Arteries | శరీరం గుండా ఆక్సిజన్ ను, రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ధమనులు. గుండె ఆరోగ్యం ఉండడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ధమనుల లోపలి గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ధమనులు మూసుకుపోతాయి. కాలక్రమేణా ఇది రక్తసరఫరాను తగ్గిస్తుంది. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ లేదా మరణం వంటివి వచ్చే ప్రమాదం ఉంది. కనుక ధమనులు మూసుకుపోకుండా జాగ్రత్త వహించాలి. ధమనులు ఆరోగ్యంగా ఉంటేనే గుండె ఆరోగ్యంగా, గుండెపై ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది. కనుక ధమనుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరం. మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాల ద్వారా ధమనుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ధమనులు మూసుకుపోయిన సమస్యతో బాధపడే వారు అలాగే ఈ సమస్య రాకూడదు అని భావించే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ధమనుల ఆరోగ్యాన్ని కాపాడే, మూసుకుపోయిన ధమనుల సమస్యను తగ్గించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మూసుకుపోయిన ధమనుల సమస్యతో బాధపడే వారు ఓట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇన్ప్లమేషన్ తగ్గించడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ఓట్స్ ను తీసుకోవడం వల్ల ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉండడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సుగంధ ద్రవ్యాల్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఫ్రీరాడికల్స్ ను తగ్గించడంలో ఇవి ఎంతో దోహదపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గడం వల్ల ధమనులు, గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అల్లం, మిరపకాయలు, దాల్చిన చెక్క, మిరియాలు వంటి వాటిని తీసుకోవడం వల్ల ధమనులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
ధమనులు మూసుకుపోకుండా నిరోధించడంలో టమాటాలు అద్భుతంగా పనిచేస్తాయి. టమాటాల్లో లైకోపీన్, విటమిన్ సి, ప్లేవనాయిడ్స్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. టమాటాలను అల్లం, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపి తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుంది. అలాగే ధమనులు మూసుకుపోకుండా చేయడంలో క్యాబేజి, బ్రోకలీ, కాలీప్లవర్ వంటి కూరగాయలు ఎంతో దోహదపడతాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ధమనులు మూసుకుపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సిట్రస్ జాతి పండ్లను తీసుకోవడం వల్ల గుండె జబ్బులతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఈ పండ్లల్లో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రీరాడికల్స్ ను తగ్గించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చేపలను తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిలో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేలా మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. చేపలను తీసుకోవడం వల్ల వాపు తగ్గడంతో పాటు రక్తం గడ్డకట్టడం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన ఆహారాలను తీసుకోవడం వల్ల ధమనులు మూసుకుపోవడం తగ్గడంతో పాటు ఈ సమస్య భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుందని, ఈ ఆహారాలు గుండె ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.