ముస్లిం రాజుల పాలనలో కట్టిన హుస్సేను సాగరు నీళ్లు, ఆకులతో మమేకమై పచ్చగా మెరుస్తున్నాయి. ఖురాన్ పఠనాలేవో వినిపిస్తున్నట్టు! నట్టనడుమ విశాలంగా విస్తరించిన జీబ్రాల్టర్ రాయి! అది ఎడారి అయినా, ఏరైనా అలజడులకు జడవకుండా నిశ్చలంగా నిలవాలనే అంతరార్థమేదో చెప్తున్నట్టు! పెద్ద బుద్ధుడు గంభీరంగా నిలుచుని పైనుంచి ప్రశాంతంగా పరికిస్తున్నడు. చిన్ముద్రతో బౌద్ధ శాంతి ప్రబోధమేదో చేస్తున్నట్టు! బిర్లామందిర్ ఘంటానాదాలతో భక్తి సంగీతమూ మంద్రంగా వినిపిస్తున్నది. ఇంతి బాలల జట్టు, చేతుల్లోని బంతిపూల చుట్టు చెరువు కట్టపై బతుకమ్మలై ఆనందంలో తేలియాడుతున్నయి. సాగర జలాలను పూల కట్టే చెరువుగైట్టె ఆపేసింది! ట్యాంక్‌బండ్‌పై కొలువుదీరిన తేజోమూర్తులను చూస్తూ మువ్వన్నెల పతాకం నీళ్ల మీద నీడై పరుచుకున్నది… సగర్వంగా!
పసిడి రంగుల పట్టుచీరలతో మహిళలు మనోహరంగా కదులుతుండగా, రంగురంగుల పూలదండల కుండలు బోనాలై ఆమ్మవారి గుడిముందు దడి కట్టినయి. మహంకాళి ముందు పోతురాజు ఎగిరి దుంకిండు. రంగం పండుగకు రంగం సిద్ధమైంది. సదర్‌లో దున్నపోతు ముందటి కాళ్లు మూడు మూరలు మీదికి లేపి, మోర పైకెత్తి గుర్రాలపైకి గుర్రుమని గుర్కాయించింది. పీరీలు అస్సై దూలా అని ఎగురుతుం టే, పిల్లా జెల్లా బాగుండాలని అమ్మతల్లులు కుడుకల పేర్లు వేస్తున్నరు. ఆ పక్క సందుల్లోనే దాండియా కోలాటమై కోలాహలం చేస్తున్నది. ఘాస్మండిలో గుజరాతీ గార్బా ఆర్భాటంగా ఆడుతున్నది. సింధీ బజార్ సోదరులు ప్యూర్ వెజ్ భోజన శాలలకు సకుటుంబంగా తరలుతున్నరు. ఇరానీచాయ్- ఉస్మానియా బిస్కట్ కోసం ఇద్దరు యువకులు ఆల్ఫా హోటల్లో దూరారు! 75 ఏండ్ల పార్శీ గుట్ట ఫైర్టెంపుల్ ఇప్పటికీ ఒక ప్రశ్నగా ఆకర్షిస్తూనే ఉన్నది. ఆ చివరన వెలుస్తున్న, వెలుగులీనుతున్న ఆకాశ హర్మ్యాలను చూసి చార్మినార్ మురిసిపోతున్నది.
ఏమని నిర్వచించుకుందాం మన హైదరాబాద్‌ను? మన నగరానిది ఏ మతమని చెప్పుకొందాం? హైదరాబాద్ పేరు చూసి ముస్లిం అందామా? అడుగడుగుకో గుడి చూసి భాగ్యనగరం అందామా? చర్చిలను చూసి హైడ్రాబాడ్ అందామా? హైరైజ్ బిల్డింగులు చూసి హైటెక్ సిటీ అందామా? జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పెద్దరికాన్ని ఎంతని వర్ణించగలం! సికిందరాబాద్ చర్చి రాజసాన్ని ఏమని రాయగలం! మక్కా మసీదు గంభీరతను ఎంతని చెప్పగలం!
వింధ్యకు ఆవల ఇంగ్లిష్ మాట్లాడటం తక్కువ. దక్షిణాది రాష్ర్టాల్లో హిందీ పెద్దగా సాగదు. మరి హైదరాబాద్… అది ఉత్తర-దక్షిణ సంగమ స్థలి. వచ్చీరాని కలగలపు హిర్దూ (హిందీ+ఉర్దూ) మొదలుకొని, సొగసైన దక్కనీ ఉర్దూ దాకా, తెలంగాణ భాష మొదలుకొని, తెలుగులో ఉన్న అన్ని యాసల దాకా, హింగ్లిషు మొదలుకొని, క్లాసికల్ ఇంగ్లిషు దాకా హైదరాబాద్‌లో వినిపించని భాష ఏది? తమిళులు, మలయాళీలు, మరాఠీలు, గుజరాతీలు, పారశీకులు, సింధీలు, బెంగాలీలు, కాయస్థులు, సిక్కులు, నేపాలీలు, గూర్ఖాలు.. హైదరాబాద్‌లో లేనిదెవరు? రాజస్థాన్ వరుడు నడిరోడ్డు మీద గుర్రంపై పెండ్లి పరివారంతో పోతుంటడు. ఆ నడకలో ఎంత ధీమా! ఎవరూ వింతగా చూడరు. ఎక్కడో వాడకట్టులో తీన్మార్ డప్పు చప్పుళ్లకు పిల్లగాండ్లు బారాత్ డాన్స్ చేస్తుంటరు… ఎవరూ అడగకుండానే! తమిళుల పొంగల్, మలయాళీల ఓనం, బెంగాలీల దేవీ పూజలు అన్నీ జరుగుతూనే ఉంటయి. ఎవరి వేడుక వారిది. ఇక్కడ ఏసీ (ఆఫ్రికన్ క్యావెల్రీ) గార్డ్స్ ఉంటది. గుజరాతీ గల్లీ కనిపిస్తది. సింధీ కాలనీ ఉంటది. బంగ్లా బజార్ ఉంది. ఇందులో ఏది హైదరాబాద్.. ఏది కాదు? వేరుచేసి చెప్పగలమా?
ఎక్కడో తూర్పు ఆసియాలో పుట్టిన ఇడ్లీ కన్నడ భూమిపై వాలి మనకు చేరింది. ఎక్కడ పుట్టిందో బిర్యానీకి హైదరాబాద్ బ్రాండ్ అద్దుకున్నాం. పర్షియా, అరేబియా ప్రాంతాల నుంచి వచ్చిన జిలేబీలు, గులాబ్ జామూన్లు మనవి కాదని తినకుండా మానేయగలమా? సమోసాలో కూరలు కూరిపెట్టి శాఖాహారంగా మార్చుకున్నాం కదా! అన్నం, కూర, రోటీ, సబ్జీ ఎవరి తిండి వారిది! ఎవరి రుచి వారిది. అందరికీ అన్నీ దొరుకుతాయిక్కడ!
చదువుకునే వాడి అక్షరయాత్ర హైదరాబాద్. ఆకలితో వచ్చేవాడికి అక్షయపాత్ర హైదరాబాద్. ల్యాప్‌టాప్ చేతబట్టుకొని దిగే హైటెక్కు ఇంజినీర్‌ను అక్కున చేర్చుకునే ఆకాశనేత్ర హైదరాబాద్! ఉత్తరాది కార్మిక సోదరుడిని ఊరటపరిచే సత్రం హైదరాబాద్! ప్రతి ఒక్కరూ సొంత ఇల్లుతో ఇక్కడే ఉండిపోవాలని తపించే ఆత్రం హైదరాబాద్! కటిక నిరుపేదకూ, డాలర్ కలల కోటీశ్వరుడికీ సమానంగా నీడనిచ్చే ఛత్రం హైదరాబాద్. సర్వజన సామూహిక పఠన మంత్రం హైదరాబాద్. శాంతిగాత్రం నా హైదరాబాద్! ఉస్మానియా వర్సిటీ చెట్ల కిందో, ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీదో చదువుకొని, నగరం తొట్లెలో పెరిగి పెద్దయి, సొంత ఊరేదో మరిచిపోయి, నాది హైదరాబాద్, నేను హైదరాబాదీగా మారిన వారెందరో! ఈ నగరం ఎవరికీ పరాయి కాదు. కిరాయి అంతకన్నా కాదు. ఆశతో వచ్చేవారికి బతుకు నీడనిచ్చే కల్పవృక్షం. మన కోపాలను, తాపాలను, శాపాలను, పాపాలను, లోపాలను ప్రక్షాళన చేసే జీవనగంగ హైదరాబాద్.
కొన్ని దశాబ్దాల కిందటి మాట! హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడొకరు లక్నో వెళ్లాడట. అక్కడ ఒక మోచీతో మాట్లాడుతున్నడు. ఎక్కడినుంచి వచ్చారని ఆ మోచీ అడిగిండు. హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పిండితను. “ఉత్నా షాందార్ షహర్సే ఇధర్ క్యొం ఆయా బాబా?” అని అన్నాడట అతడు. హైదరాబాద్ అంటే అక్కడెక్కడో ఉన్న సాధారణ వ్యక్తికి ఉన్న గౌరవ భావమది. దేశం నలుమూలల నుంచి కట్టుబట్టలతో, పొట్ట చేత బట్టుకొని హైదరాబాద్ చేరుకొని, బతుకు బండిని నెట్టి, భవిష్యత్తుకు బాటలు వేసుకున్న నా లాంటివారు ఎందరో! అందుకే కదా.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆగే వందలాది రైళ్ల నుంచి దిగే వేలాది ఉత్తరాది కార్మికులు ఉపాధిని వెతుక్కుంటూ బస్కెక్కి వస్తే గచ్చిబౌలి కిక్కిరిసి పోతున్నది. మూడు నిముషాలకు ఒకటిగా వస్తున్న విమానాలకు శంషాబాద్ విమానాశ్రయమే సరిపోతలేదు. ‘ఆవంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబిలి హాలు, తళతళ మెరిసే హుసేను సాగరు, దాటితే సికింద్రబాదు, ఒక తలపై రూమీ టోపీ, ఒక తలపై గాంధీ టోపీ, క్యాభాయ్ అంటాడొకడు. ఏమోయ్ అని అంటాడొకడు. మతాలు భాషలు వేరైనా మనమంతా భాయీభాయీ’ అన్లేదా మన సినారె. ఒకటో అరో జరిగే దుర్ఘటనలతో హైదరా బాద్‌కు మరక అంటించలేరు.బద్నాం చేయలేరు.
నా హైదరాబాద్ ఒక మినీ ఇండియా. ఒక త్రివేణీ సంగమం. దక్కన్ పీఠభూమికి వెలిసిన సింహాసనం! ‘సముద్రాన్ని చేపలతో నింపినట్టుగా ఓ దేవుడా ఈ నా నగరాన్ని ప్రజలతో నింపు’ అంటూ హైదరాబాద్ వ్యవస్థాపకుడు కులీ కుతుబ్‌షా చేసిన ప్రార్థనలు ఫలించినాయేమో… చీమల పుట్ట పగిలినట్టు ఇప్పుడు నగరం నిండా జనమే జనం. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి ఈ ఎనిమిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి అనితర సాధ్యం. సర్వధర్మ సమభావం, వెల్లివిరిసే మత సామరస్యం, వెలుగులు విరజిమ్మే విద్యుత్తు, ఆగకుండ నడిచే యాంత్రిక జగత్తు… ఇది కదా కేసీఆర్ హైదరాబాద్. ముత్యాల అంగళ్లు లేకపోవచ్చు. కానీ ముత్యాల్లాంటి మనసులున్నాయిక్కడ! రాసులు పోసిన రత్నాలు కన్పించకపోవచ్చు. కానీ రత్నాల్లాంటి మనుషులున్నారిక్కడ! అందుకే కదా.. యావద్దేశం నుంచి ఇక్కడికి వస్తున్నరు! హైదరాబాద్‌కు రావడం అంటే కల్మశాలను కడుక్కోవడమే. ఈ సహజీవన సంస్కృతిని కలుషితం చేయలేరు. కొన్ని గంటల్లోనే చక్కబడ్డ పరిస్థితి చెప్తున్న సత్యమిది. అదే కేసీఆర్ రాజకీయ పరిణతి!
ద్వేషంతో హైదరాబాద్‌ను జయించడం అసా ధ్యం. నేటి హైదరాబాద్ జాజ్వల్యమైనది. సంకుచిత కండ్ల కు కనిపించదది. నేటి హైదరాబాద్ విశాలమైనది. ఇరుకు బుర్రల్లో ఇరికిపోనిది. నేటి హైదరాబాద్ మహోన్నతమైనది. వక్రబుద్ధులకు అంతుపట్టదది. నేటి హైదరాబాద్ సహస్రబాహు. అంగుష్ఠ మా త్రులకు అంతుచిక్కనిది. నేటి హైదరాబాద్ విశ్వనగరం. విషపు పిడికిలికి చిక్కనిది. హైదరాబాద్ మన వారసత్వ వైభవం. వర్తమానపు చైతన్యం. భవిష్యత్తు స్వప్నం. అది కుత్సితాలకు కుంగదు. సంకుచితాలకు లొంగదు.
నేటి హైదరాబాద్ క్రియేటివ్, రియాక్టివ్! చరిత్ర పొడుగునా ఎన్నెన్నో కుతంత్రాలను చూసి, గంభీరంగా, చిద్విలాసంతో నిలిచిన నేటి హైదరాబాద్…
విద్వేషంపై ప్రకటించే యుద్ధ సందేశం!
ఇది కేసీఆర్ హైదరాబాద్!
కుట్రలను ఛేదించే హైదరాబాద్!!
చల్లటి సాయంకాలం, పిల్లగాలులు వీస్తుండగా, హుస్సేన్‌సాగర్ మీదుగా పడమటి గూటివైపు ప్రయాణిస్తున్న సూరీడు, చుక్కల చెక్కిళ్లు తలచుకొని ఏమో తానే ఎర్రబడ్డడు. అలుముకున్న ఆ సంధ్యారుణ కాంతి రుధిర ధారల చార అని భ్రమపడుతున్నరేమో! అది ఆకాశం అద్దుకున్న ‘అభివృద్ధి మైదాకు’తో పండిన ఎర్రటి పంట! రేపటి ఉదయానికి ముందే పరిచిన ఎర్ర తివాచీ!
గర్వంగా చెప్పుకొందాం..నాది హైదరాబాద్, నేను హైదరాబాదీ అని!!