తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అని ఎవరైనా అడిగితే చెప్పే సమాధానాలు ఎన్నో. కాళేశ్వరం, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షీటీమ్స్, టీఎస్-ఐపాస్, యాదగిరిగుట్ట పునర్నిర్మాణం.. ఈ సుదీర్ఘమైన జాబితాలో కొత్తగా చేర్చుకోవాల్సినది సమీకృత కలెక్టరేట్ భవనాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రంగారెడ్డి కలెక్టరేట్ భవనంతో ఇప్పటివరకూ 10 కొత్త కలెక్టరేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో ఐదు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. నిర్మాణదశలో 10 ఉండగా, మిగిలిన వాటిల్లో పనులు మొదలు కావాల్సి ఉంది. తెలంగాణలోని గంగా జమునీ తహ్జీబ్ను ప్రతిబింబించేలా నిర్మించిన ఈ సమీకృత కలెక్టరేట్లు మన స్వయంపాలనకు ఒక సమున్నత నిదర్శనం. వీటిద్వారా జిల్లా స్థాయిలో ఉండే ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇప్పుడు ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకే కాదు అధికారులకూ, సిబ్బందికీ ఎంతో సౌకర్యవంతమైన ఏర్పాటు ఇది.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి తీసుకొచ్చిన సంస్కరణల్లో అత్యంత కీలకమైనది పరిపాలన వికేంద్రీకరణ. ‘ప్రజల చెంతకు పాలన’ అంటూ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది సీఎంలు మాటలు చెప్పారు. కానీ, ఆ నినాదం ఆచరణలోకి వచ్చిందెన్నడూ లేదు. ఒకటిరెండు ప్రయత్నాలు జరిగినా అవి కూడా తెలంగాణ పట్ల ఉన్న వివక్ష, నిధుల లేమి కారణంగా పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడిన వెంటనే కేసీఆర్ ఈ అంశంపై దృష్టి పెట్టి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే బృహత్తర ప్రయత్నాన్ని చేపట్టారు. పది జిల్లాలను 33 జిల్లాలకు పెంచారు. రెవెన్యూ డివిజన్లను 37 నుంచి 74కు, మండలాలను 464 నుంచి 593కి పెంచారు. అంతకుముందు 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జిల్లాలు ప్రస్తుతం సగటున 50-70 కిలోమీటర్లకు పరిమితమయ్యాయి. దీంతో జిల్లా చివరన ఉన్న ప్రజలు కూడా జిల్లా కేంద్రానికి రావటానికి మునుపటిలా ఐదారు గంటలు ప్రయాణించే శ్రమ లేకుండా ఒకట్రెండు గంటల్లో చేరుకోగలుగుతున్నారు. వచ్చిన రోజే పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లగలుగుతున్నారు. అంతేకాదు, పాత దవాఖానలన్నీ జిల్లా దవాఖానలుగా అప్గ్రేడ్ కావటంతో ఉన్నత వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా నిజమైన అర్థంలో ప్రజల చెంతకు పాలన సాకారం కావటమే కాదు, అధికారులకూ పర్యవేక్షణ సులువైంది. ప్రభుత్వానికి వివిధ పథకాల లబ్ధిదారుల కచ్చితమైన వివరాలు అందుబాటులో ఉంటున్నాయి. ఆయా జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్రోడ్ల నిర్మాణం జరుగటం, ఐటీ తదితర పరిశ్రమలు అందుబాటులోకి రావటం వల్ల తెలంగాణ వ్యాప్తంగా పలు పట్టణాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెంది భూముల ధరలు పెరగటానికి ఇది కూడా ఒక కారణం. స్వరాష్ట్రంలో స్వయంపాలన ఫలితాలు ఇవన్నీ.