ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు సుస్థిరంగా ఉంటేనే ఆ రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. ఇది గమనించిన కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర డీజీపీతో సమావేశమై పోలీసుశాఖలో మౌలిక సదుపాయాల కల్పన కోసం, అత్యాధునిక వాహనాల కొనుగోలు కోసం రూ.375 కోట్లు మంజూరు చేస్తూ మొదటి జీవోలోనే ఉత్తర్వులు జారీచేశారు. ఇదే క్రమంలో వెంటనే మరో రూ.500 కోట్లు మంజూరు చేయడం అభినందనీయం. ఈ క్రమంలోనే నేడు ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ సాకారమైంది.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే అత్యు త్తమ పోలిసింగ్ నెట్వర్క్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఏడెకరాల స్థలాన్ని సేకరించింది. ఆ స్థలంలో ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ పేర ప్రతిష్ఠాత్మక ట్విన్ టవర్స్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఆలోచన చేసింది. ఆసియా ఖండంలోనే మరెక్కడా లేనివిధంగా, ఇంగ్లండ్‌లోని ‘స్కాట్లాండ్ యార్డ్ పోలీసు వ్యవస్థ’ వలె తెలంగాణ పోలీసు వ్యవస్థను రూపొందించడానికి కేసీఆర్ పథక రచన చేశారు. ఈ మేరకు 2015 నవంబర్ 22న ‘కమాండ్ కంట్రోల్, ఫ్యూషన్ సెంటర్’ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పోలీసు ఉన్నతాధికారులను లండ న్, న్యూయార్క్ వంటి విదేశీ నగరాలకు పంపించారు. అక్కడ అమలు చేస్తున్న భద్రతా వ్యవస్థల తీరుతెన్నులను పోలీసు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ విధంగా కమాండ్ సెంటర్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించారు. ఈ భవన సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 4న ప్రారంభోత్సవం జరగనున్నది.
ఈ ప్రతిష్ఠాత్మక భవనంలో రెండు ప్రధాన విభాగాలుంటాయి. ఒకదానిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది. ఇందులో అత్యున్నత పోలీసు విధానాలకు అవసరమైన అన్ని వసతులుంటాయి. రెండ వ టవర్‌లో ‘ఫ్యూషన్ సెంటర్’ ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యాధునిక, సాంకేతిక విధానాలతో ఇది రూపుదిద్దుకున్నది. ఒక్క పోలీసు శాఖకు మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ సంస్థలకూ ఇది ఉపయోగపడుతుంది. వివిధ వ్యవస్థలను అనుసంధానం చేసి అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేలా ఈ భవనం ఏర్పాటైంది. ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ పనితీరు అంతర్గతంగా అనుసంధానమైన 5 విభాగాల ద్వారా జరుగుతుంది. అవి. 1. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 2.స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషనల్ సెంటర్, 3.మల్టీ ఏజెన్సీ ఆపరేషనల్ సెంటర్, 4. వార్ రూం, 5. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. రెండు టవర్లుగా కనిపించే ఈ 20 అంతస్తుల భవనం 6.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైంది.
ఈ భవనం విశేషం ఏమంటే రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమవుతాయి. దీంతో రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో, ఏ చిన్న సంఘటన జరిగినా అది వెంటనే ఈ సెంటర్‌కు తెలుస్తుంది. శాంతిభద్రతలకే కాకుండా, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, అత్యవసర వైద్య సదుపాయాల కోసం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఈ భవనం తెలంగాణకే తలమానికం. దేశంలోనే అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ.. ఐటీ రంగం నుంచి వ్యవసాయం వరకూ అనేక రంగాల్లో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. నేడ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మరోసారి తన సత్తా చాటింది.
(వ్యాసకర్త: కోలేటి దామోదర్, 98491 44406, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్)