కనుమరుగైన ఏడు శతాబ్దాల తర్వాత కూడా ఒక రాజ్యాన్ని ఏదో ఒక రూపంలో గుర్తుకుతెచ్చుకోవడం అంటే ఆ ప్రాంతం మీద ఆ రాజ్యం ఎంతటి బలమైన ముద్రను వేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆ రాజ్యమే కాకతీయ మహాసామ్రాజ్యం. శాతవాహనుల తర్వాత దక్కనులో తెలంగాణ కేంద్రంగా బయల్దేరి, దక్షిణాన ప్రకాశం-నెల్లూరు తీరం వరకు, కర్ణాటకలో కృష్ణా-తుంగభద్ర అంతర్వేది ప్రాంతంలోని రాయచూర్ దుర్గం, కల్యాణ-కర్ణాటక ప్రాంతంలోని బీదర్ ప్రాంతం, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం- అంతటినీ శాసించినవారు కాకతీయులు. వారి ఘనచరిత్ర గురించి తెలుసుకుందాం.
క్రీ.శ. 1163 నుంచి క్రీ.శ.1310 వరకు అంటే సుమారు 160 ఏండ్లు దక్కనులో స్వతంత్ర రాజ్యంగా ఉండటమే కాదు, కాకతీయ రాజ్య కోశాగారంలో ఉన్న సంపద చూసి ఢిల్లీ సామ్రాజ్యానికే కన్నుకుట్టి, ఈ సంపద దోచుకునేందుకు యుద్ధాలు చేసేంతగా ఎదిగిన దక్కను సామ్రాజ్యం ఇది. ఈ కాకతీయ సామ్రాజ్యం వింధ్యకు పైన లేక గంగ-యమున మైదానాల్లో ఉండి ఉంటే భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖ రాజ్యంగా లిఖించేవాళ్ళు. చరిత్ర రచనలో ఉన్న దృష్టికోణ లోపం వల్ల, ‘ప్రాంతీయ సామ్రాజ్యాల’ కింద పరిమితమైన కాకతీయ రాజ్యానికి తగిన స్థానం దక్కలేదు.
తెలంగాణ చరిత్రలో కాకతీయులు
గతానికీ, వర్తమానానికీ మధ్య జరిగే నిరంతర సంభాషణే చరిత్ర అంటాడు ప్రఖ్యాత చరిత్రకారుడు ఈ. హెచ్.కార్. చరిత్రలో జరిగిపోయిన ఘటనల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన గుణపాఠాలు – ఈ రెండింటినీ తెలంగాణ సమాజం, రాజకీయం కాకతీయ కాలం నుంచి గ్రహించింది. నిరంకుశ కేంద్రీకృత పరిపాలన కాకుండా స్థానిక సామంతులకు కావలసినంత పాలనా స్వేచ్ఛను ఇచ్చి స్థానిక పాలనను నిలపడమే కాకతీయ రాజ్య బలం. ఇదే స్థానిక పాలన ప్రత్యేక ఉద్యమ స్ఫూర్తి అయింది. రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ‘ఎవుసం’ బాగుండాలని, రాజ్యాన్ని గొలుసు చెరువులతో కలిపిన వాళ్ళు కాకతీయులు. అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్యమైన డిమాండ్ అయిన ‘నీళ్లు’ సొంత రాష్ట్రంలో లక్షల ఎకరాల్ని తడిపింది. మధ్యయుగ తెలంగాణ ప్రత్యేకత అయిన మిశ్రమ సంస్కృతి వారసత్వంగా కాకతీయ తోరణం చార్మినార్‌తో కలిసి రాష్ట్ర అధికార చిహ్నం అయింది.
తవ్వే కొద్దీ బయటపడ్డ చరిత్ర
ఈ రోజు మనం చదువుతున్న కాకతీయ చరిత్ర వెలికితీత వెనుక ఎందరో చరిత్రకారుల, పురాతత్వవేత్తల ఎన్నో ఏండ్ల శ్రమ ఉంది. నిజాంల పాలనాకాలంలో శాసనాల పరిష్కరణ, తవ్వకాలు జరుపకపోతే మనకు కాకతీయ చరిత్రకు సంబంధించిన భాండాగారం ఉండేదే కాదు. కాకతీయ చరిత్రను వివరంగా చర్చించే ముందు 1880లలో మొదలైన పరిశోధనలు, పరిశోధకుల గురించి మాట్లాడుకోవాలి. అనుమకొండ (హనుమకొండ) వేయి స్తంభాల గుడిలో కోనేటి పక్కన ఉన్న క్రీ.శ.1163 నాటి రుద్రదేవుడి శాసనాన్ని 1882లో జె.ఎఫ్.ఫ్లీట్ శాస్త్రీయంగా పరిష్కరించి ప్రచురించడం ముఖ్యమైన మలుపు. మొదటి స్వతంత్ర కాకతీయ రాజు రుద్రదేవుడి విజయాల్ని, హనుమకొండ విషయం (విషయం అంటే నేటి జిల్లా వంటి పరిపాలన విభాగం) కాకతీయ సామ్రాజ్యంగా మారే క్రమాన్ని ఇది వివరిస్తుంది.
నిజాం రాష్ట్ర అధికారి సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామి 1884లో హిస్టారికల్ అండ్ డిస్క్రిప్టివ్ స్కెచ్ ఆఫ్ నిజామ్స్ డొమినియన్స్ అనే పుస్తకంలో పాకాల, వరంగల్ చరిత్రను రాశారు. వరంగల్ గురించి రాస్తూ ఏకశిలానగరం పేరును, ప్రతాపచరిత్ర పుస్తకాన్ని చర్చించారు. అలాగే పాకాల గురించి రాస్తూ ఇప్పడున్న దట్టమైన అటవీ ప్రాంతంలో, ఒకప్పుడు (కాకతీయుల కాలం లో) మానవ జీవితం విలసిల్లి ఉండొచ్చని పేర్కొన్నారు. ఆంధ్రేతిహాస పరిశోధక మండలి మారేమండ రామారావు సంపాదకత్వంలో 1935లో తెచ్చిన కాకతీయ సంచిక.. కాకతీయులపై జరిగిన పరిశోధనలో ఒక మైలురాయి.

చరిత్రను, వారసత్వాన్ని మతంతో ముడిపెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్న వారికి, నిజాంల పాలనలో కాకతీయుల గుళ్ళు, శాసనాలు, తెలంగాణ చరిత్రపై జరిపిన పరిశోధనలు, వాటికి ప్రభుత్వపరంగా నాడు లభించిన ప్రోత్సాహం జవాబిస్తాయి. ‘మధ్య యుగ దక్కను అనే నక్షత్ర మండలంలో పాలంపేట గుళ్ళు ప్రకాశవంతమైన తారలు’ అని గొప్పగా అభివర్ణించి, కాకతీయ వైభవాన్ని పునర్నిర్మించేందుకు గులాం యాజ్దానీ పడ్డ తపన అంతా ఇంతా కాదు.
1920 నాటికి వేయి స్తంభాల గుడికి మరమ్మతుల్ని పూర్తి చేసింది నిజాం ప్రభుత్వ ఆర్కియాలజీ శాఖ. యజ్దానీ పర్యవేక్షణలోనే వరంగల్ కోట, పాలంపేట, ఘనపూర్, ముప్పారం వంటి ఎన్నో కాకతీయ పురావస్తు ఆధారాల్ని తిరిగి నిలపడం జరిగింది. 1934-35లో వరంగల్ కోట ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో కాకతీయ తోరణంతోపాటు, ఎన్నో పురావస్తు ఆధారాలు దొరికాయి. కాకతీయ శాసనాల్ని పరిష్కరించిన శేషాద్రి రమణ కవులు, శిరిగిరి హనుమంతరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి వాళ్ళ భుజాల పై నుంచి కాకతీయ చరిత్రను క్రమంగా నిర్మించుకున్నాం. దాని గురించి వివరంగా వచ్చే వారాల్లో చర్చించుకుందాం.
-డా. ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000