సముద్రాన్ని దోచుకున్న మేఘం
వెనకాల మేఘాన్ని తరుముతూ గాలి
భళ్ళున వాంతి చేసుకున్న ఆకాశం
స్వజాతుల మధ్య అంతర్యుద్ధంలా
మేఘానికి మేఘానికి మధ్య
బహిరంగ యుద్ధం
కాలాన్ని అంచనా వేసిన పిట్ట
దుఃఖాన్ని రెక్కలపై మోస్తూ
బతికితే మళ్ళీ ఆకాశాన్ని ఈదేస్తానని
రెక్కల్ని చాపలా మడిచి ఏ చెట్టు తొర్రలోనో
తనని మరచిపోతుంది
అప్పటిదాకా పెనంలా కాలిన మట్టి
చర్మం మీద
నీటి దుప్పటి సుట్టుకొని
పిల్ల కాలువలు నదులై వలసబోతాయి
ముంపు గ్రామాలు
కూలిపోయిన మట్టి గోడలు
తుంగకొనల ఆసరాపై వేలాడే ఆఖరి క్షణాలు
శరణార్థుల శిబిరాల్లో తలదాచుకుంటాయి
చీకట్ని వదలని రాత్రి
చిత్తడి చిత్తడిగా కురుస్తున్న వాన
ఏ ప్రాణానికి తాను బాధ్యుడిని
కానని తప్పుకుంటుంది
కాళ్ళ కింద నమ్మిన వెన్నెల మాయమైనప్పుడే
మృత్యువు ప్రాణిని వెంటాడే ప్రియమైన
మిత్రుడని నమ్ముతుంది
బతుకు ఒక తాపత్రయం
మరణ శాసనాన్ని తిరిగి రాయాలనే
వెదుకులాట
ఇంకేది కళ్ళ ముందు కనపడనీయదు
యుద్ధమూ యుద్ధం చెయ్యాల్సిందే
ఇది ఇక ఆఖరి యుద్ధమే.
– ఇబ్రహీం నిర్గుణ్