రాజు గారికి దప్పికయినప్పుడల్లా..
అధికారికంగా జేబుల్ని కత్తిరించవచ్చు..
అణువణువు మీద యథేచ్ఛగా
నిలువు దోపిడీ ముద్ర వేయవచ్చు..
వంట గది నుంచి వల్లకాడు వరకు
బరితెగించి చిల్లర ఏరుకోవచ్చు
పేద ఇసుక రేణువుల నుంచి
భారీ తైలం పిండుకోవచ్చు
కాకుల కడుపు కొట్టి
గద్దలకు విందులు చేయవచ్చు…
రాజుగారి ఖజానాకు ఆకలేసినప్పుడల్లా…
రొట్టెముక్కల నుంచి కూడా
రొక్కం ఆరగించవచ్చు
చివరికి సిరాచుక్కలకూ ఖరీదు కట్టవచ్చు..
తీవ్ర ధరోత్పాతంతో
ఛిద్రమైన గుండెల్లో
పన్ను కత్తితో పొడవవచ్చు…
వామనుడి విశ్వరూపంలా
విస్తరిస్తున్న వస్తు సేవల సుంకం
సగటు జీవితాలను
పాతాళానికి తొక్కేస్తుంది
పన్ను ఒక్కటే కానీ
అసంఖ్యాక వస్తు సామ్రాజ్యాన్ని ఆక్రమిస్తుంది
దేశం ఒక్కటే
లెక్కలేని గాయాలతో
ఆక్రోశిస్తుంది…
తోటమాలి సునాయాసంగా
కొమ్మ నుంచి
పూవు తెంపుకొన్నట్లు
సహజంగా ద్రవ్యం
సమకూర్చుకోవాలి…
తీనెటీగ సుకుమారంగా
మకరందాన్ని సేకరించినట్లు
ధర్మసుంకం గ్రహించాలి..
జలగ రక్తం పీల్చినట్లు కాదు
-కోయి కోటేశ్వరరావు
94404 80274