బీజేపీ విధానాలు ఎంత తలాతోకా లేకుండా ఉంటాయో తెలుసుకోవాలంటే ఒకసారి ఆ పార్టీ ఆరేండ్లుగా అధికారంలో ఉన్న యూపీకి వెళ్లాల్సిందే. పశు వధశాలలను, పశువుల మార్కెట్లను గో రక్షణ పేరుతో యోగి ప్రభుత్వం మూసివేసింది. ఫలితంగా లక్షలాది పశువులు పొలాల మీద పడ్డాయి. రోడ్లమీదికి గుంపులుగా వస్తూ ప్రమాదాలకు కారణమయ్యాయి. ఇది ఆ రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారటంతో, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో యోగి, మోదీ దీనిపై వాగ్దానాలు గుప్పించారు. ఆవుపేడను బంగారంగా మార్చి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. ఎన్నికలు పూర్తయి, బీజేపీ గెలిచి నాలుగు నెలలైంది. మరి ఆ సమస్యకు పరిష్కారం ఏమైందో మీరే చదవండి.
ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఆ రాష్ట్రంలో రైతాంగానికి కునుకు పట్టకుండా చేస్తున్న వీధి పశువుల సమస్యను పరిష్కరిస్తానని ప్రధానమంత్రి హోదాలో మోదీ వాగ్దానం చేశారు. ఆవు పేడను కూడా పెట్టుబడిగా మారుస్తామన్నారు. కానీ, ఎన్నికలు ముగిశాయి. యోగి రెండోసారి సీఎం అయి 120 రోజులు దాటింది. కానీ, ఇప్పటి వరకూ ఆ హామీ ఊసే లేదు. ఇంతకూ సమస్యేమిటో తెలియాలంటే.. ఐదేండ్ల వెనక్కి వెళ్లాలి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, నాడు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీపార్టీ ప్రభుత్వం గద్దె దిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. గోవుల రక్షణ పేరుతో పశు వధశాలలను మూసేశారు. పశువుల తరలింపుపై అనేక ఆంక్షలు విధించారు. ఎవరైనా తరలిస్తే వారిపై అసాంఘికశక్తులు దాడి చేయటం, ఆ మూకల మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం సాధారణ విషయమైపోయింది. దీంతో రాష్ట్రంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న పశువుల మార్కెట్లు అస్తవ్యస్తమైపోయాయి. ఆ రంగంపై ఆధారపడిన లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారు. అయితే, ఇదొక పార్శ్యం మాత్రమే. వ్యవసాయానికిగానీ, పాడికిగానీ పనికి రాని పశువులను గతంలో రైతులు వధశాలలకు తరలించేవారు. లేదా, పశువుల వ్యాపారులకు విక్రయించేవారు.
కానీ, వా టిపై నిషేధం నేపథ్యంలో, ఆ పశువులను ఇంటి వద్ద పెట్టుకొని మేపలేక, వీధుల్లో వదిలేయటం ప్రారంభించారు. దీంతో వందలు, వేల, లక్షల సంఖ్యలో పశువులు రోడ్ల మీద, వీధుల్లో విచ్చలవిడిగా తిరగటం ప్రారంభమైంది. పంటపొలాల మీది పడి ధ్వంసం చేయటం, అడ్డం వచ్చిన వారిపై దాడి చేయటం నిత్యకృత్యమైంది. నడిరోడ్ల మీద పశువులు గుంపులుగా తిరుగుతుండటంతో అనేక ప్రమాదాలు జరిగి ఎంతోమంది వికలాంగులయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వీధిపశువుల సంఖ్య 12 లక్షలకు పెరిగిపోయింది. వీటితో విసిగిపోయిన గ్రామస్థులు, రైతులు పశువులను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోకి తరలించి, బంధిస్తున్నారు. దీంతో స్కూల్లో చదువుకోవటానికి విద్యార్థులకు చోటు లేకుండా పోతున్నది.
యూపీలో ఇదొక ఎన్నికల అంశంగా మారటంతో, మొన్నటి ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరిలో ప్రధాని మోదీ దీనిపై హామీలు గుప్పించారు. ఈ సమస్యను పరిష్కరించే ఒక పథకం తన మదిలో ఉన్నదని, ఎన్నికల కోడ్ అడ్డంగా ఉన్నందువల్ల దాని గురించి చెప్పటం లేదని, మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే తెలియజేస్తానని నమ్మబలికారు. కానీ, ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు గడిచింది. కానీ, అటు మోదీగానీ, ఇటు యోగి గానీ ప్రజలకు ఇచ్చిన హామీ ఊసెత్తటం లేదు. ఇంతకూ మోదీ ప్రస్తావించిన పథకం ఏమిటంటే.. అప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘గోదాన్ న్యాయ్ యోజన’ పేరిట అమలు చేస్తున్నదే. వీధి పశువుల వల్ల పంట నష్టం జరిగితే ఎకరాకు రూ. 3 వేల పరిహారం ఇవ్వటం, పిడకలను కిలో రూ.2 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయటమే ఈ పథకం. అంటే, పథకం కూడా బీజేపీ సొంతది కాదు. అది కూడా కాపీ పథకమే. అయినా, దానినీ అమలులో పెట్టలేదన్నమాట.
ఈ హామీల సంగతి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో పెనుసమస్యగా దాపురించిన వీధి పశువుల పరిష్కారానికి యోగి ప్రభుత్వం గత ఐదేండ్లలో కొన్ని చర్యలను ప్రకటించింది. వాటిలో ఒకటి, గోశాల ఏర్పాటుచేసి పశువులను సంరక్షిస్తే, ఒక్కొక్క పశువుకు రోజుకు రూ.30 చొప్పున గోశాల నిర్వాహకులకు సాయం అందిస్తామని చెప్పింది. ఇది ఎలా అమలైందో తెలుసుకోవాలంటే దేవరియాలో గోశాల ఏర్పాటుచేసిన ముఖేశ్ కుమార్ మాటలు వినాల్సిందే. ‘ఐదేండ్లలో మూడుసార్లు మాత్రమే చెల్లించారు. అది కూడా అధికారులు రూ.30లో దాదాపు 30 శాతం కమీషన్ తీసుకొని రూ.22 మాత్రమే ఇచ్చేవారు’ అని ఆయన వాపోయారు. గోశాలలను ఏర్పాటు చేస్తే డబ్బులతోపాటు పశువులకు దాణా కూడా సరఫరా చేస్తామన్న ప్రభుత్వ ప్రచారంతో అనేకమంది వాటిని ఏర్పాటు చేశారు. కానీ, అటు డబ్బులూ అరకొరగా ఇవ్వటమేగాక ఇటు దాణా ఊసే లేకుండా పోయింది. దీంతో వాటి నిర్వహణభారం మోయలేక అనేకమంది నిర్వాహకులు చేతులెత్తేశారు. గోశాలల్లో పరిశుభ్రమైన పరిస్థితులు లేక, దాణా లేక, కిక్కిరిసిపోయిన పరిస్థితుల్లో అనేక పశువులు మృత్యువాత పడ్డాయి. బీజేపీ ప్రవచించే గోరక్షణ.. యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉన్న యూపీలో అమలైన తీరు ఇదీ.
గోశాలల పరిస్థితి ఇలా ఉంటే, యోగి సర్కారు యూపీ రైతులకు మరిన్ని హామీలు కూడా ఇచ్చింది. ఉదాహరణకు, పేడను ఇంధనంగా మార్చే బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఇస్తామని, పశువుల దాణా బ్యాంకులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏదీ ఆచరణకు నోచుకోలేదు.
ఈ విధంగా శతాబ్దాలుగా మనుగడలో ఉన్న వ్యవస్థను ధ్వంసం చేశారు. తమ అభిప్రాయాలను కోట్లాదిమంది ప్రజలపై రుద్దారు. దానివల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. కోట్లాది మంది నష్టపోతున్నారు. వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయినా కూడా వారిలో పశ్చాత్తాపం లేదు. ఉన్న వ్యవస్థను ధ్వంసం చేసిన వారికి కొత్త వ్యవస్థను సృష్టించే తెలివితేటలైనా ఉన్నాయా అంటే అదీ లేదు. ఇదీ బీజేపీ మోడల్, డబుల్ ఇంజిన్ సర్కారు పనితీరు.
-ఎడిటోరియల్ డెస్క్