ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న దేశంగా చైనాను భారత్ త్వరలో అధిగమించనున్నది. సగటు భారతీయుని వయస్సు 28 ఏండ్లు మాత్రమే. అంటే యువరక్తంతో ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశం ప్రగతిలో పరుగులు తీయాల్సిన సమయం ఇది. కానీ జరుగుతున్నది ఏమిటి? మోదీ పాలనలో ప్రపంచ సూచికల్లో అన్ని రంగాల్లోనూ దిగదుడుపే. ప్రపంచ ఆకలి సూచీలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ కన్నా మనదేశం దిగజారి ఉండటం విచారకరం.
స్వాతంత్ర ఉద్యమం జరుగతున్న సందర్భంలో ఉత్తరాదిన హిందూ, ముస్లిం ఘర్షణలు జరుగుతున్న సందర్భంలో మన జాతిపిత మహాత్మాగాంధీ, హైదరాబాద్ రాజ్యంలోసర్వమతాల సహోదర భావం పరిఢవిల్లడం చూసి దేశానికి ఆదర్శం హైదరాబాద్ అని కొనియాడారు. నేడు కేసీఆర్ పాలనలో నేడు అన్ని మతాలు, కులాలను ప్రభుత్వంలో భాగస్వాములు చేయటంతో అందరూ తమదే ఈ ప్రభుత్వం అనే భావనతో ఉన్నారు.
మోదీ ఎనిమిదేండ్ల పాలనలో అన్నింటా దేశ ప్రభ మసకబారుతున్నది. నిరుద్యోగశాతం రోజు రోజకు పెరగటం, రూపాయి విలువ రోజు రోజుకూ పతనం కావడానికి కారకులు ఎవరు? ప్రతి పౌరుడు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. దీనికి పరిష్కారమార్గం వెదకాలి. ‘అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్నట్లు ఉంది మన దేశం పరిస్థితి. ఏ దేశంలో లేనట్టి వనరులు, ఖనిజ సంపద, మేధస్సుతో కూడిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పాలించే నాయకునిలో ఉండాల్సిన విజన్, దాన్ని అమలు చేయడానికి కావాల్సిన చిత్తశుద్ధి లేకపోవటమే ప్రధాన సమస్య. ఈ పరిస్థితుల్లో, అలాంటి నాయకుడు ఎక్కడ?.. అన్న ప్రశ్న ఎదురవుతున్నది.
తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అభివృద్ధి, ప్రజాసంక్షేమంలో మన రాష్ట్రం దూసుకుపోతున్నది. జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఒకనాటి కరువు కాటకాల తెలంగాణ నేడు పచ్చదనాల తెలంగాణగా మారిందంటే కారణం సీఎం కేసీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై అధ్యయనం కోసం మే నెల లో తమిళనాడు, కర్ణాటకలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పర్యటించింది. అక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలపై అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించింది. తమిళనాడు, కర్ణాటకలో చేపట్టిన కులగణన, రిజర్వేషన్ల తీరును బీసీ కమిషన్ సభ్యుడిగా తెలుసుకున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు- రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ. మిషన్ కాకతీయ, ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, అన్నదాతలకు ఉచితంగా 24 గంటల కరెంట్, ఉచిత విద్య, గురుకులాల ఏర్పాటు వంటి పథకాలను వారికి వివరించాం. తమిళనాడు, కర్ణాటక అధికారులు తెలంగాణ పథకాలు భేష్ అని ప్రశంసించటం ముదావహం.
రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత విద్యాభివృద్ధిలో ఎంతో పురోగతి సాధించింది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 970కి పైగా గురుకులాలు ఏర్పాటు చేసింది. తమిళనాడు అధికారులు తెలంగాణ గరుకులాలను ఆదర్శంగా తీసుకొని పైలెట్ ప్రాజెక్ట్ కింద తమ రాష్ట్రంలో మూడు గురుకులాలు ఏర్పాటు చేశారు. ఉన్నత చదువుల కోసం రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం వంటి పథకాన్ని కూడా తమిళనాడులో అమలు చేయబోతున్నారు.
అదే విధంగా మన వద్ద అమలవుతున్న క్షరకులు, రజకులకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ పథకం వంటివి కూడా పలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా, అనుసరణీయంగా మారటం గమనార్హం. తమిళనాడు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో పల్లెపకృతి వనాలు, క్రీడాప్రాంగణాలు, నర్సరీలు, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, స్మశాన వాటికల నిర్మాణం వంటి కార్యక్రమాలతో పల్లెల ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారు.. పక్క రాష్ర్టాలను పరిశీలిస్తే తెలంగాణలో జరుగుతున్న ప్రగతి అర్థమవుతుంది.
75 ఏండ్ల స్వతంత్రభారతం మోదీ పాలనా తీరుతో తిరోగమనంవైపు పరిగెడుతున్నది. ఏ మతం వారు ఏం తినాలో.. ఏ దుస్తులు వేసుకోవాలో కూడ నిర్దేశించే స్థాయికి దిగజారింది. దేశంలో మతతత్వశక్తులు రెచ్చిపోతున్నాయంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలకుల అండదండలే కారణం. స్వాతంత్య్ర సమరయోధులు కలలు కన్న భారతావని ఇది కాదు. భారతదేశం అంటేనే విభిన్నమతాలు, జాతులు, కులాల కలయిక. ‘భిన్నత్వంలో ఏకత్వం’ మన నినాదం, మన జీవన విధానం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ , సిక్కు, యిసాయి అందరూ తమ మతాచారాలను పాటిస్తూ.. ఇతర మతాలను గౌరవించటమే మన దేశ సంస్కృతి.
గంగా జమునా తెహజీబ్: స్వాతంత్ర ఉద్యమం జరుగతున్న సందర్భంలో ఉత్తరాదిన హిందూ, ముస్లిం ఘర్షణలు జరుగుతున్న సందర్భంలో మన జాతిపిత మహాత్మాగాంధీ, హైదరాబాద్ రాజ్యంలో సర్వమతాల సహోదర భావం పరిఢవిల్లడం చూసి దేశానికి ఆదర్శం హైదరాబాద్ అని కొనియాడారు. కేసీఆర్ పాలనలో నేడు అన్ని మతాలు, కులాలను ప్రభుత్వంలో భాగస్వాములు చేయటంతో అందరూ తమదే ఈ ప్రభుత్వం అనే భావనతో ఉన్నారు. కొన్ని దుష్ట శక్తులు ఎన్ని కుట్రలు చేసినా, వాటికి లోనుకాకుండా, సోదర భావంతో శాంతియుత వాతావరణంలో జీవిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. విజనరి లీడర్ షిప్ లేకపోవడమే. ఈ నేపథ్యంలో, దేశాన్ని ముందుకు నడిపించే విజన్, దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉన్న కేసీఆర్ అవసరం దేశానికి ఎంతైనా ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అవగాహన, దూరదృష్టి, ప్రజలకు దేశ స్థితిగతులను విడమర్చి చెప్పే శక్తి ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్. ఇలాంటి నాయకుడే దేశానికి నేడు అవసరం.
-(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)
శుభప్రద్ పటేల్ నూలీ 97010 69698