నరేంద్ర మోదీ.. రైతుల ఆదాయాన్నిరెట్టింపు చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. కానీ, ఆయన పాలనలో గతంలో వచ్చే ఆదాయమే 50 శాతానికి పడిపోయింది. గత ఎనిమిదేండ్లలో మోదీ పాలనలో రైతుల బతుకులు దిన దిన గండంగా మారాయి. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆత్మహత్యల నివారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసా య విధానాలు రైతులను మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి.
మోదీ పాలన పుణ్యమా అని… ఎరువుల ధరల పెరుగుదలతో వ్యవసాయ పెట్టుబడి పెరుగుతుండగా, పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రతి ఎకరాపై రూ.2000ల భారం రైతులపై అదనంగా పడుతున్నది. ఈ భారాలకు తోడు నాణ్యతలేని కల్తీ విత్తనాలతో ఏటా 2 కోట్ల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతున్నది. వ్యవసాయ పెట్టుబడులు పెరగడమే తప్ప, అందుకు అనుగుణంగా కనీస మద్దతు ధరల పెంపుదల లేదు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలతో రైతులకు ఒనగూడుతన్నది ఏమీ లేదు. కేంద్ర ధరల నిర్ణాయక బోర్డు వాస్తవ పెట్టుబడిని పట్టించుకోకుండా గత ఏడాదిపై సగటున రూ. 100 నుంచి రూ.250 వరకు పెంచుతున్నది. దీన్నే స్వామినాథన్ కమిటీ సూచనల ప్రకారం ప్రకటించామని చెప్పుకొస్తున్నారు. ధరల నిర్ణయంలోనే మరో రూ.5,6 లక్షల కోట్ల ఆదాయాన్ని రైతులు నష్టపోతున్నారు.
మద్దతు ధరల నిర్ణయానికి 1. ఉపకరణాల పెట్టుబడి, 2. కుటుంబ శ్రమ, 3. వ్యవసాయ భూమికౌలు విలువ, సొంత పెట్టుబడిపై, వడ్డీని లెక్కగట్టాలి. కానీ ఉపకరణాల పెట్టుబడి, కుటుంబ శ్రమను మాత్రమే తీసుకొని దానికి 50 శాతం కలిపి మోదీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమని ‘ప్రధాని ఫసల్ బీమా’ పథకాన్ని తెచ్చింది. దేశంలో 35 కోట్ల ఎకరాలు సాగవుతుండగా 3.5 కోట్ల ఎకరాలకు మాత్రమే బీమా సౌకర్యం కల్పించింది. ఈ బీమా వల్ల ప్రయోజ నం లేదని గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పంజాబ్ రాష్ర్టాలు ‘ప్రధాని ఫసల్‌బీమా’ నుంచి తప్పుకోవటం గమనార్హం. ఈ పథ కం వల్ల ఏటా కార్పొరేట్ బీమా కంపెనీలు వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నాయే తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదు. అలాగే ‘కిసాన్ సమ్మాన్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానితో సన్న-చిన్నకారు రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు.
11.07 కోట్ల మందికే ఏడాదికి రూ.6వేల చొప్పున సాయం అందుతున్నది. దేశంలో సన్న-చిన్నకారు రైతులే 14 కోట్ల మంది ఉన్నారు. వారుగాక మిగతా రైతులు మరో 3 కోట్ల మం ది ఉన్నారు. దేశంలోని సన్న-చిన్నకారు రైతులలో 5 కోట్ల మందికి ఈ పథకం వల్ల ఏ ప్రయోజనం కలగడంలేదు. తెలంగాణలో 64 లక్షల మంది రైతులు ఉండగా 38.63 లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నది. దీన్ని బట్టి ఈ పథకం ఎంత లోపభూయిష్టమో స్పష్టమౌతున్నది. రైతు రుణాలకు 4 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్న పథకం వల్ల రైతులకు జరుగుతున్న ప్రయోజనం ఏమీ లేదు.
మోదీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం కన్నా దిగుమతులపై ఆధారపడే పరిస్థితులు తెస్తున్నది. ఇప్పటికైనా మన దేశ మౌలిక జీవన విధానాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయరంగ రక్షణకు తగు చర్యలు చేపట్టాలి. రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండే విధంగా మద్దతు ధరలు ప్రకటిస్తూ వ్యవసారంగాన్ని కాపాడాలి.
-టి. సాగర్, 94900 98055
(వ్యాసకర్త: తెలంగాణ రైతు సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)