‘గుడ్, సింపుల్ టాక్స్’ అంటూ కేంద్రప్రభుత్వం ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్’ (జీఎస్టీ) ప్రకటనల్లో హోరెత్తించింది. ఈ నినాదంలో ‘గుడ్’ కేవలం పెద్ద కంపెనీలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, టాక్స్ లాయర్లకే తప్ప; వినియోగదారులు, సామాన్యులకు కాదు. చిన్న వ్యాపార సంస్థలు, చివరికి రాష్ర్టాలకు కూడా అటు ‘గుడ్’ కాదు, ఇటు ‘సింపుల్’ కాదు. వినిమయం మీద వేసే పన్ను అయినందున దీని దెబ్బ నేరుగా వినియోగదారులపైనే పడుతున్నది.
అడకత్తెరలో చిన్న, మధ్యతరహా కంపెనీలు: జీఎస్టీ అడకత్తెరలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ‘ఐదేండ్లలో ఒకవైపు బహుళ జీఎస్టీ రేట్లను చూస్తూనే, జీఎస్టీ ఫైలింగ్, రిపోర్టింగ్ కోసం అంతులేని పరుగు తీస్తున్నాం’ అని విడిభాగాలు తయారుచేసే ఒక చిన్నతరహా సంస్థ యజమాని వాపోయారు. 8 మందితో నడుపుతున్న ఆ చిన్న యూనిట్ 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సివచ్చింది. కొవిడ్‌తో ఆర్థికంగా దెబ్బతిని రూ.10 లక్షల అప్పులో కూరుకుని, సంస్థను మూసేశారు. ఇవే కారణాలతో ఎన్నో యూనిట్లు మూతపడ్డాయి. చిన్న సంస్థల్ని జీఎస్టీ పెద్ద దెబ్బతీసిందని ఆర్థికవేత్త డాక్టర్ భరత్ ఝుంఝున్వాలా అన్నారు. వాటి వ్యాపారాలన్నింటినీ పెద్ద కంపెనీలకు వెండిపళ్ళెంలో సమర్పించుకోవాల్సి వస్తున్నదని అన్నారు.
జీఎస్టీ కౌన్సెల్ సమావేశం జరుగుతున్నదంటే చాలు.. దేని మీద ఎంత పన్ను వేస్తారు? మనం వాడే ఏ ఉత్పత్తిపై పన్ను పెంచుతారంటూ వినియోగదారులు హడలిపోయే పరిస్థితి. సమోసా కొని షాపు దగ్గర తినాలా, ఇంటికి తెచ్చుకొని తినాలా అనే సందిగ్ధంలో పడిపోతాం. అలాంటి నిర్ణయాన్నే గత నెలలో జరిగిన కౌన్సెల్ సమావేశం తీసుకున్నది. సమోసా, స్వీట్ల వంటివాటిని స్నాక్స్ కౌంటర్లో కొంటే 1 శాతం జీఎస్టీ, వాటినే ఆ షాప్, హోటల్, ఈటరీ ఔట్లెట్లో తింటే 5 శాతం పన్ను. పిజ్జా రెస్టారెంట్లో తింటే 5 శాతం, హోం డెలివరీ అయితే 18 శాతం జీఎస్టీ. కేసినోలు, లాటరీలు, హార్స్ రేసులపై జీఎస్టీ నిర్ణయాన్ని ఈ మీటింగ్ వాయిదా వేసిందిగానీ, అంతకుముందు మినహాయింపుల జాబితాలో ఉన్న పాల ఉత్పత్తులు, బెల్లం, చేపలు, లెడ్ బల్బులూ, చివరికి పెన్సిల్, షార్ప్‌నర్లపై కూడా 12 నుంచి 18 శాతం వరకూ జీఎస్టీ విధించింది.
నిబంధనల గందరగోళం: ఎప్పటికప్పుడు మారుస్తున్న జీఎస్టీ నిబంధనలు వినియోగదారుల్ని గందరగోళ పరుస్తున్నాయి. జీఎస్టీ నిబంధనల మార్పునకు ఇప్పటివరకూ కేంద్రప్రభుత్వం 869 నోటిఫికేషన్లు, 143 సర్క్యులర్లు, 38 ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి అనుగుణంగానే జీఎస్టీ బెంచ్‌లు రూలింగ్స్ ఇస్తున్నాయి. రోటీలు, చపాతీలపై 5 శాతం, పరోటాలపై 18 శాతం జీఎస్టీ అని 2020లో అథారిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ కర్ణాటక బెంచ్ రూలింగ్ ఇచ్చింది. షాంపూలు, లోహం తో తయారైన పెన్నులను లగ్జరీ ఐటమ్స్‌గా పరిగణించి 28 శాతం జీఎస్టీ వర్తిస్తుందని రూలింగ్ ఇచ్చింది. ఈ తతంగాన్ని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వివరిస్తూ పిజ్జాపై మూడు రకాల జీఎస్టీ రేట్లు ఉన్నాయన్నారు. పిజ్జా వేరు, పిజ్జా టాపింగ్ వేరు అంటూ హర్యానా అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ పేర్కొన్నదని, జీఎస్టీ ఫ్రేమ్‌వర్క్ హాస్యాస్పదంగా ఉందనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్న కొద్దీ పన్నులు: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతున్న తరుణంలో పన్నుల్ని విధించడం, ఉన్న వాటిని పెంచడంతో ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నది. మధ్యతరగతిని లక్ష్యంగా చేసుకుని రూ.5,000 ఖరీదుకు పైబడిన హాస్పిటల్ బెడ్స్‌పై జీఎస్టీ విధించారంటే ఏ స్థాయిలో పన్నుభారం మోపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. జనం విరివిగా ఉపయోగించే ఉత్పత్తుల్ని పన్ను జాబితాలోకి జీఎస్టీ కౌన్సిల్ చేర్చుకుంటూ పోతున్నది. ప్రస్తుతం మినహాయింపులో ఉన్న సేవల్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి.
కేంద్రం జేబులోకే జీఎస్టీ లాభాలు- రాష్ర్టాలకు ఇచ్చిన గ్యారంటీ గంగపాలు: జీఎస్టీ ప్రవేశపెట్టి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా తన లక్ష్యాలు నెరవేరాయంటూ కేంద్రం ఘనంగా ప్రకటించుకున్న ది. వినియోగదారుల్ని, చిన్న వ్యాపారుల్నే కాదు, రాష్ర్టాల ఆర్థిక స్థితిగతుల్ని కూడా దెబ్బతీయడమే ఆ లక్ష్యం. జీఎస్టీతో ఒనగూడిన లాభాల్ని కేంద్రమే జేబులో వేసుకుంటున్నదని, నష్టాల్ని రాష్ర్టాలకు మళ్లిస్తున్నదని, ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ర్టాల మధ్య విశ్వాసమే విచ్ఛిన్నమవుతున్నదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
2017లో జీఎస్టీని ప్రవేశపెట్టినపుడు, రాష్ర్టాల ఆదాయంలో 14 శాతం వార్షిక వృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాలకు గ్యారంటీ ఇవ్వడం జరిగింది. మొదటి ఐదేండ్లూ రెవెన్యూ తగ్గుదలకు పరిహారం చెల్లిస్తామని కూడా కేంద్రం హామీ ఇచ్చింది. ఇది కేంద్రం ఖజానా నుంచి కాకుండా వినియోగదారులపైనే ‘సెస్’గా వడ్డించి, ఆ నిధిలోంచి పరిహారం ఇస్తున్నది. 2022 జూన్ 30తో పరిహారం చెల్లింపు గడువుకాలం కూడా ముగిసిపోయింది. సెస్ వసూళ్లను కొనసాగించాలని కౌన్సిల్ నిర్ణయించినప్పటికీ, రాష్ర్టాలు డిమాండ్ చేస్తున్నట్టు ఇక మీదట కూడా పరిహారం చెల్లించే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం తీసుకోలేదు. రాష్ర్టాలకు ఇవ్వనప్పుడు సెస్ ఎందుకు వసూలు చేయాలంటూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ప్రశ్నించారు. అలాగే 2017 నుంచి ఇప్పటివరకూ ఏ ఒక్క రాష్ట్రమూ 14 శాతం వార్షిక ఆదాయ వృద్ధిని సాధించలేదు. రాష్ర్టాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల్ని కేంద్రం కొట్టిపడేస్తున్నది.
కౌన్సిల్లో కేంద్రానిదే దాదాగిరి: క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఇక్రా) అధ్యయనం ప్రకారం… 2022 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో 22 రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు రూ.320 లక్షల కోట్లు. కొవిడ్‌కు ముందు ఏడాది ఇది 230 లక్షల కోట్లు. కరోనా ముందస్తు కాలంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక ఆదాయ వృద్ధి కేవలం 4.2 శాతానికే పరిమితమైనందున, లోటు పెరిగిందని ‘ఇక్రా’ తెలిపింది. బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా ఈ విషయంలో ఎంతో అసంతృప్తితో ఉన్నప్పటికీ, కౌన్సిల్ సమావేశాల్లో దీన్ని ప్రశ్నించడం లేదని ప్రతిపక్ష పాలనలో ఉన్న రాష్ర్టాల ఆర్థిక మంత్రులు వాపోతున్నారు.
పరిహారం బకాయిలు నిలిచిపోతాయనో, జాప్యం అవుతాయనో భయంతో జీఎస్టీ కౌన్సిల్లో మెజారిటీ అభిప్రాయాన్ని బీజేపీయేతర రాష్ర్టాలు అంగీకరించాల్సి వస్తున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశానికి కేంద్ర రెవిన్యూ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ‘ముందుగానే నిర్ణయమైన ఎజెండాను ఆమోదించడానికే జరిగే ఈ సమావేశాల్లో చర్చ నామమాత్రంగా ఉంటున్నది. కేంద్రం ఏది నిర్ణయిస్తే దానికి అనుకూలంగా ఓటింగ్ జరుగుతున్నది. కౌన్సిల్ ఆమోదిస్తుంది’ అంటూ ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈ తతంగాన్ని వివరించారు. ఇదీ జీఎస్టీ అమలు తీరు.
– ఎస్పీ