రాయండి పేజీలకు పేజీలు
రాయండి పెద్ద పెద్ద అక్షరాలతో
కమ్మకమ్మకు అవి కనబడాలి
గొంతెత్తి చదివితే అవి
చెవిచెవినా వినబడాలి..
కర్షకుడు రోడ్డుపై బైఠాయించాడు
సైనికుడు రైలు పట్టాలపై రాళ్ళు రువ్వుతున్నాడు
దేశ రాజకీయం కొత్త ధోరణి అనుసరిస్తుంది
రాజకీయానికి ఆధునిక నిర్వచనాలు ఇస్తుంది
అర్ధ శతాబ్దపు అన్యాయం మరో పాతికేళ్లను కూడగట్టుకున్నట్లుంది..
ప్రశ్నించేది హాలికుడే అయితే న్యాయం ఉంటుంది
నినదించేది యువతే అయితే బలమైన ఆశయం ఉంటుంది
మతోన్మాదం పల్లేరుకాయలా అడుగడుగున విస్తరిస్తుంది
మానవత్వం వేరుతెగిన వృక్షంలా ఎండిపోతుంది..
భిన్నత్వంలో ఏకత్వం కాస్తా కనుమరుగైపోతుంది
నవభారతావని నిరసనల మధ్య నిరసించిపోతుంది..
రాజకీయ నాయకుల వాగ్దానాలు
ఉచితాలతో నిండిపోయాయి
ఉసిగొలిపే ప్రసంగాలు
ఆందోళనలకు చిరునామాలుగా మారిపోయాయి
అందుట్లదీర్ఘం ఇందుట్లదీర్ఘం
పార్టీలు మారే మంతనాలు
వర్గపోరుకు కులపోరుకు
సాక్షాత్తు సర్వనామాలైనాయి..
నా అక్షరాలతో మొదటి పేజీని ముద్రించండి
అవి వినబడేలా కనబడేలా పుటలు నింపండి
ఎగిసిపడే నిప్పురవ్వల ఉప్పెన అందులో కనిపించాలి
లాఠీ దెబ్బకు, తుపాకీ తూటాకు నినదించే
గొంతులు అందులో వినిపించాలి
ఉచితాలకు అలవాటుపడ్డ మొద్దు నిద్రను మేల్కొల్పాలి..
జై జవాన్ జై కిసాన్
నినాదానికి నిలువెత్తు వ్యతిరేకం
కనబడుతుంది వినబడుతుంది
డబ్భు ఐదేండ్ల భారతావనిలో…
– ఎజ్జు మల్లయ్య, 9652871915