సుమారు 350 ఏండ్లు పాలించిన వీళ్లు పెద్ద రాజ్యంగా ఎదగలేదు కానీ మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలలోని గోదావరి పరీవాహక అటవీ ప్రాంతంలోనూ, నేటి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో విస్తరించి వేంగీ చాళుక్య రాజ్యానికీ, మాల్ఖేడ నుంచి ఏలుతున్న రాష్ట్రకూటులకు మధ్య సరిహద్దుగా నిలిచారు.
ఖమ్మం పట్టణానికి పక్కనే ఉన్న ముదిగొండ ఒక చాళుక్య వంశ రాజధాని అని ఎందరికి తెలుసు? ఈ ముదిగొండ పట్టణం కేంద్రంగా తూర్పు వరంగల్‌ను (నేటి మహబూబాబాద్), ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని పాలించిన ముదిగొండ చాళుక్యులు భౌగోళికంగా తెలంగాణలో భాగమైనా విడి రాజకీయ అస్తిత్వంతో ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన వేంగీ చాళుక్యుల సామంతులుగా ఉన్నారు.
భౌగోళికంగా కృష్ణా-గోదావరీ మధ్య ప్రాంతంలో, రాజకీయంగా రాష్ట్రకూట-వేంగీ చాళుక్యుల మధ్య బఫర్ (మధ్యనున్న ప్రత్యేకప్రాంతం) లాగా మనుగడలో ఉన్న రాజ్యం ముదిగొండ చాళుక్య రాజ్యం. క్రీ.శ.850 నుంచి 1200 వరకు అంటే సుమారు 350 ఏండ్లు, పెద్ద రాజ్యంగా లేకున్నా ఆ కాలంలో ప్రముఖంగా నిలిచింది. తొలుత వేంగీ చాళుక్య-రాష్ట్రకూట కాలంలో, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యుల కింద ఉన్న వీళ్లు చివరికి కాకతీయుల విస్తరణలో తెర మరుగైనారు.
కొరవి సీమ, విసురునాడు, మంచికొండనాడు – ఈ ప్రాంతాన్ని క్రీ.శ.9వ శతాబ్దంలో పిలుచుకున్న పేర్లు. మహబూబాబాద్ జిల్లాలోని కురవినే కొరవి అనేవాళ్లు. కొరవి నుంచి మొదలైన పాలక వంశం ముదిగొండను రాజధానిగా చేసుకొని ఎదిగినందున ముదిగొండ చాళుక్య వంశమైంది. కేంబ్రిడ్జిలో సంస్కృత ప్రొఫెసర్‌గా పనిచేసిన సి.బెండాల్ అనే పరిశోధకుడి వల్లే మొదటిసారి ముదిగొండ చాళుక్యుల గురించి ప్రపంచానికి తెలిసింది. నిజాం ఖజానాలో ఉన్న రాగి రేకులను 1899లో చూసిన బెండాల్ 1903లో ఇండియన్ యాన్టిక్వెరీ గ్రాంట్ అఫ్ కుసుమాయుధ-4 అనే పేరిట ఆ తామ్ర శాసనాన్ని పరిష్కరించాడు.
ముదిగొండ చాళుక్యులు ఎవరు?
బాదామితో మొదలైన చాళుక్య వంశాల్లో ముదిగొండ ఒకటి. బాదామి చాళుక్యుల నిజమైన వారసులా లేక ‘చాళుక్య’ నామానికి ఉన్న విశిష్టత కోసం స్థానిక పాలక వర్గంగా ఎదుగుతున్న ఒక కుటుంబం పేరును ఆపాదించుకున్నదా అనేది ఒక చర్చనీయాంశమే. ఏదైమైనా రాష్ట్రకూటులు బలంగా ఉన్నకాలంలో వేంగీ చాళుక్య రాజ్యానికి బలమైన దన్నుగా నిలిచినవాళ్లు ముదిగొండ చాళుక్యులు. అందుకే రాష్ట్రకూట సామంతులైన వేములవాడ చాళుక్యులు ఒకపక్షంగా, వేంగీ చాళుక్యుల సామంతులైన ముదిగొండ చాళుక్యులు ఇంకో పక్షంగా నిలిచి యుద్ధాల్లో పాల్గొన్నారు.
నాటి పాలక వర్గ కుటుంబాల లాగే, శూద్రకులాల నుంచి ఎదుగుతున్న వీళ్లు కూడా చంద్ర వంశస్థులమని చెప్పుకొన్నారు. ఈ వంశ మూలపురుషుడు కొరవి పుర వల్లభుడైన ‘కరియ గొణగుడు’ అని ఖమ్మం జిల్లా పాల్వంచ దగ్గరి కుక్కునూరులో దొరికిన క్రీ.శ.12వ శతాబ్దానికి చెందిన కుసుమాదిత్యుని రాగి రేకు శాసనం చెప్తుంది. అంటే కురవిలో మొదలైన గొణగుడి పాలన తర్వాత ముదిగొండకు వ్యాపించి ఉంటుంది. సుమారు 350 ఏండ్లు పాలించిన వీళ్లు పెద్ద రాజ్యంగా ఎదగలేదు కానీ మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలలోని గోదావరి పరీవాహక అటవీ ప్రాంతంలోనూ, నేటి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో విస్తరించి వేంగీ చాళుక్య రాజ్యానికీ, మాల్ఖేడ నుంచి ఏలుతున్న రాష్ట్రకూటులకు మధ్య సరిహద్దుగా నిలిచారు.
వీరి చరిత్రకు ఆధారాలు
శాసనాలే వీరి చరిత్రకు ఆధారాలు. మహబూబాబాద్ జిల్లా కొరవిలో వీరభద్రస్వామి ఆలయంలో విరిగి ఉన్న రెండు స్తంభాల మీద ఉన్న శాసనం తూర్పు (వేంగీ) చాళుక్యరాజు చాళుక్య భీముడు జారీ చేసినది. వీరికీ వేంగీ చాళుక్యులకు ఉన్న బంధాన్ని ఇది వెల్లడిస్తుంది. స్టేట్ మ్యూజియంలో ఉన్న కుసుమాదిత్యుని కుక్కునూరు రాగి రేకు శాసనం (దీనినే పరబ్రహ్మశాస్త్రి కుసుమాయుధుని క్రివ్వక శాసనం పేరిట ‘భారతి’ మాస పత్రికలో ప్రచురించారు) ముదిగొండ చాళుక్య వంశావళిని, వారి విజయాలనూ వివరిస్తుంది. బెండాల్ పరిష్కరించిన తామ్ర పత్ర శాసనాన్ని మొగలిచెరువు శాసనం అని కూడా అంటారు. ఈ శాసనం మంచికొండనాడు నుంచి కొండపల్లి వరకు విస్తరించిన ముదిగొండ రాజ్య విస్తృతిని తెలియజేస్తుంది.
ఈ శాసనాల ఆధారంగా కరియ గొణగ, కొ క్కిరాజు, రణమర్ద, మొదటి కుసుమాయుధ, గొణగ, నిరవద్య, బద్దెగ, రెండవ కుసుమాయుధ, రెండవ విజయాదిత్య, మూడవ కుసుమాయుధ, నిజ్జయరాజ మల్లప్ప, నాలుగవ కుసుమాయుధ, బేతరాజు, ఐదవ కుసుమాయుధ, బొట్టు బేత, ఆరవ కుసుమాయుధ, నాగతి రాజు అనే వంశావళి మనకు తెలుస్తున్నది. తెలంగాణకు ఆంధ్రకు మధ్య భూభాగంలో జరిగిన రాజకీయాన్ని, సమాజ గమనాన్నీ ఈ శాసనాలు మనకు చెప్తున్నాయి.
-డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000