కుటుంబ సమస్యలు, గృహహింస, వరకట్నం వేధింపులు… కారణమేదైనా అబల ఆత్మైస్థెర్యం కోల్పోతున్నది. ఆత్మహత్యనే శరణ్య మంటున్నది. ప్రతి 25 నిమిషాలకో గృహిణి బలవన్మరణానికి పాల్పడుతుండటం అత్యంత బాధాకరం.
‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ విడుదల చేసిన గణాంకాలు ఈ విధంగా చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే మహిళల్లో దాదాపు 40 శాతం మంది భారతీయులే. ఇటీవల ప్రచురించిన లాన్సెట్ అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ‘ఎన్సీఆర్బీ’ నివేదిక ప్రకారం 2020లో మొత్తం 1,53,052 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 50 శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. 14.6 శాతం మంది అంటే 22,372 మంది గృహిణులే. ఈ లెక్కన సగటున రోజుకు 61 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహిళల ఆత్మహత్యలకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి.
గృహహింస: ముప్ఫై శాతం మంది మహిళలు గృహహింసకు గురవుతున్నారని ఒక ప్రభుత్వ సర్వేలో తేలింది. గృహహింసను ఎదుర్కొన్న మహిళల్లో ఆత్మహత్య ఆలోచనలు మూడు రెట్లు అధికంగా ఉంటాయని 2012లో నిర్వహించిన ఓ పరిశోధన తేల్చింది.
వరకట్న వేధింపులు: గృహిణుల ఆత్మహత్యల్లో సగానికి పైగా వరకట్న వేధింపులతోనే జరుగుతున్నాయని తెలుస్తున్నది. 1930 కంటే ముందు దేశంలో జరిగిన వివాహాల్లో కేవలం 40 శాతమే వరకట్నం సమస్యతో కూడుకున్నవి. 2000 తర్వాత ఈ సంఖ్య 90 శాతానికి చేరుకున్నది. వరకట్నం వేధింపులతో మహిళలు తిరిగి తల్లిగారింటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. సమాజ కట్టుబాట్లు అంటూ మళ్లీ వారిని అత్తగారింట్లోనే ఉండాలని బలవంతం చేయడంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలుస్తున్నది.
ఆర్థిక ఇబ్బందులు: ఆర్థికంగా ఏం అవసరం వచ్చినా మహిళలు భర్తలపై ఆధారపడుతారు. దీనివల్ల మహిళల్లో నిరాశ, నిస్సహాయత, డిప్రెషన్ పెరిగిపోతున్నది. ప్రతి లెక్క ఆయనతో చెప్పలేక ఆమె లోలోపల కుమిలిపోతున్నది. దీనివల్ల కూడా ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు మానసిక వైద్యులు చెప్తున్నారు.
నివారణ మార్గాలు: మహిళల ఆత్మహత్యలను నివారిం చడానికి ప్రధానంగా రెండురకాల మార్గాలపై దృష్టిపెట్టవచ్చు. మొదటిది, మహిళలను మానసిక ఆరోగ్య సమస్యల నుంచి, డిప్రెషన్ నుంచి కోలుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అసలు మహిళలకు సమస్యలే ఉత్పన్నం కాకుండా మూల కారణాలను వెతికి పట్టుకొని నివారణ మార్గాలను కూడా అన్వేషించాలి. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వడం ద్వారా కూడా సమస్యను కొంతమేర పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.
దీనికోసం మహిళల ఉపాధిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెట్టాలి. 2018లో ‘ఆక్స్‌ఫామ్ ఇండియా’ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో సర్వే నిర్వహించింది. పిల్లల సంరక్షణ బాధ్యతలను సరిగా నిర్వహించకపోతే మహిళలను కొట్టడం ఆమోదయోగ్యమేనని 33 శాతం మంది చెప్పారు. కుటుంబానికి చెందిన పురుషులకు సరైన ఆహారాన్ని అందించకపోతే కొట్టవచ్చని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీనిద్వారా ప్రజల ఆలోచనావిధానాన్ని మనం అంచనా వేయవచ్చు. అతివల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాలంటే ముందుగా మగవాళ్ల వైఖరిలో మార్పు రావాలి. ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. స్త్రీ, పురుష సమానత్వాన్ని పెంపొందించే విధంగా వివిధ సామాజిక కార్యక్రమాలను చేపట్టి సమాజం ఆలోచనా తీరులో మార్పు తీసుకురావాలి.
–ఫిరోజ్‌ఖాన్, 96404 66464
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్)