రాష్ట్రంలో కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల వల్ల నీటి సౌలభ్యం పెరిగింది. ఈ నేపథ్యంలో సంప్రదాయ వరి సాగు విధానం నుంచి లాభసాటి జలసేద్యానికి ఇక్కడి రైతాంగాన్ని సంసిద్ధులను చేయాలి. ముఖ్యంగా ‘ఆక్వాకల్చర్’ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
తెలంగాణలో పెరిగిన జల వనరులతో ఆక్వారంగం అభివృద్ధికి అనువైన పరిస్థితులున్నాయి. పెరుగుతున్న జనాభాకు అవసరమైన పౌష్టికాహారం అందించటంతోపాటు, వ్యవసాయరంగంపై ఒత్తిడిని తగ్గించడంలోనూ ‘ఆక్వారంగం’ ముఖ్య భూమిక పోషించనున్నది. ఈ పరిస్థితుల్లో మన రైతాంగానికి సరైన అవగాహన కల్పించాలి. దేశంలో సముద్ర చేపల ఉత్పత్తి రోజురోజుకూ తగ్గుతున్నది. ఈ కారణంగా ఉపరితల జలవనరుల్లో చేపల ఉత్పత్తిపైనే ఆహా ర అవసరాలకు ఆధారపడవలసి వస్తున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని ఉపరితల జలవనరుల వాటాలో అగ్రభాగానికి చేరుకున్న తెలంగాణలో ‘ఆక్వారంగాన్ని’ అన్నిరకాలుగా అభివృద్ధిపరిచేందుకు మంచి అవకాశాలున్నాయి.
వానకాలం, యాసంగి సీజన్లలో వరిని పండించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. కానీ, వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా వరిపంటకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ లాంటి దీర్ఘకాలిక పంటలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీనికోసం రానున్న మూడేండ్లకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు బడ్జెట్లో రూ.1000 కోట్లను కేటాయించింది. అలాగే 2023-24లో ఏడు లక్షల ఎకరాలు, 2024-25లో పది లక్షల ఎకరాలు.. మొత్తంగా కనీసం 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదే రీతిన రైతులకు అత్యధిక లాభాలను అందించే మరొక రంగం ‘ఆక్వారంగం‘. దీనికోసం అందుబాటులో ఉన్న జల వనరుల్లో చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించాలి. వరి మాత్రమే పండించగలిగే వందురు పొలాల్లో ‘ఆక్వాకల్చర్’ను ప్రారంభించాలి. తెలంగాణలో ఈ దిశగా ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఏప్రిల్ 28న ఛీఫ్ సెక్రటరీ అధ్యక్షతన నిర్వహించిన అత్యున్నత సమావేశంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించటానికి నిర్ణయం తీసుకున్నారు. నీటి సదుపాయం పుష్కలంగా ఉన్న ఏడు జిల్లాల్లో రానున్న మూడేండ్లలో కనీసం ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా ‘ఆక్వాకల్చర్’ను నిర్వహించాలని నిర్ణయించారు. తొలివిడతగా నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో అమలుచేయాలని ప్రతిపాదించారు. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
పామాయిల్, ఆక్వాకల్చర్ లాంటివి రైతులకు 25-30 ఏండ్ల పాటు ఆదాయాన్నిస్తాయి. పామాయిల్ మొక్కలు నాటిన నాలుగైదేండ్ల తర్వాత మాత్రమే దిగుబడి వస్తుంది. కానీ ఆక్వాకల్చర్‌లో మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే రైతులకు ఆదాయం మొదలవు తుంది. ఎకరం విస్తీర్ణాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఆ పొలా న్ని ఆక్వాకల్చర్ పద్ధతిలో చేపలు లేదా రొయ్యల చెరువులుగా మార్చుకోవచ్చు. దీంతో అదే విస్తీర్ణంలో వరి సాగుతో వచ్చే ఆదాయం కంటే అనేక రెట్ల నికర ఆదాయం వస్తుంది. అయితే దీనికోసం వరి పొలాలను ఆక్వాకల్చర్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. దీనికి ప్రారంభంలో ఎకరానికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది.
రొయ్యల సాగు ద్వారా అన్ని ఖర్చులు పోను ప్రతి పంటకు సగటున రెండు లక్షల నికర ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఈ లెక్కన ఒక ఎకరం విస్తీర్ణంలో ఏటా మూడు పంటలు తీయడం ద్వారా చేపల పెంపకంతో ఏడాదికి సగటున 5 నుంచి 6 లక్షల ఆదాయం పొందవచ్చు. ఈ రొయ్యలను, చేపలను ప్రాసెసింగ్- వాల్యూ ఆడిషన్ పద్ధతులను అనుసరించి ఎగుమతి చేయవచ్చు. ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
అయితే ఆక్వాకల్చర్ సాగు కోసం వరి మడులను సిద్ధం చేసుకోవటానికి ప్రారంభ పెట్టుబడులను సమకూర్చాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం ప్రభుత్వపరంగా తగిన రీతిలో రైతులకు సాయం అందించాలి. ఈ విధమైన ప్రోత్సాహక పరిస్థితులున్నప్పుడే తెలంగాణ రైతులు ప్రత్యామ్నాయ ఆక్వాకల్చర్ సాగు విధానానికి మొగ్గు చూపుతారు. ఫలితంగా అటు రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఇటు అందుబాటులోకి వచ్చిన సాగునీటి వనరులను సద్వినియోగం చేసినట్లవుతుంది. ముఖ్యంగా వరి ధాన్యం అమ్మకం విషయంలో ఏర్పడిన సమస్య నుంచి కూడా రైతాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పరిష్కారం లభించినట్లు అవుతుంది.
-(వ్యాసకర్త: ‘తెలంగాణ ఫిషరీస్ సొసైటీ’వ్యవస్థాపక అధ్యక్షులు)
పిట్టల రవీందర్ 99630 62266