ధర్మబద్ధతకు ప్రతీక, మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పుట్టినరోజు కూడా దేశంలో అధర్మం రాజ్యమేలింది. చట్టం, న్యాయం అనే వాటిని పక్కనపెట్టి ఒక వర్గం ప్రజలే లక్ష్యంగా దాడులు, ఆస్తుల ధ్వంసం కొనసాగింది. ఏప్రిల్ 10, శ్రీరామనవమి రోజున దేశవ్యాప్తంగా పది రాష్ర్టాల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాల్లో హనుమాన్ జయంతి ఊరేగింపుపై రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయటం, ఈ చర్యలను ప్రభుత్వ పెద్దలే సమర్థించుకోవటం గమనార్హం.
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ హయాంలో బుల్డోజర్ సంస్కృతి మితిమీరిపోయింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో విపక్ష నేతలు, ఒక వర్గం ప్రజల ఆస్తులు, ఇండ్ల కూల్చివేత ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది. యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారనే అభియోగం ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి షాజిల్ ఇస్లాంకు చెందిన పెట్రోల్ బంక్‌ను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేశారు. యోగిపై ఘాటు విమర్శలు చేసిన మూడు రోజుల్లోనే అతని పెట్రోల్ బంక్ అక్రమ నిర్మాణమని బుల్డోజర్తో కూల్చివేశారు. 2019లో నిర్మించిన ఈ పెట్రోల్ బంక్ కోసం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణతో బరేలీ డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు! ఈ నేపథ్యంలోనే యూపీలో సీఎం యోగి ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను బుల్డోజర్లకు కట్టి ప్రదర్శించటం యాదృచ్ఛికం కాదు.
శ్రీరామనవమి సందర్భంగా ఒక వర్గం వారు ఎంత పథకం ప్రకారం ఉద్రిక్తతలకు కారణమయ్యారో మధ్యప్రదేశ్‌లోని ఖర్గాన్ జిల్లా తాలాబ్చౌక్లో జరిగిన ఘటనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 63 ఏండ్ల నజీర్ అహ్మద్‌ఖాన్ (విశ్రాంత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) తవ్దీమొహల్లాలోని తన మూడంతస్తుల భవనంపై నుంచి నవమి ఊరేగింపును చూస్తున్నాడు. ఖాజిపుర, సంజయ్‌నగర్, ఆనంద్‌నగర్, భవుసర్ మొహల్లా, ఖాస్కద్వాడీ తదితర ప్రాంతాల నుంచి తావ్దీ మొహల్లా వైపు ఒక్కసారిగా వందలాదిగా దూసుకొచ్చారు. పెరిగిన సమూహం మిన్నంటిన నినాదాలు చేస్తూ హింసకాండకు పాల్పడ్డారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు, లాఠీచార్జీ, బాష్పవాయు గోళాలు ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. అయినా.. కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో ప్రదర్శనకారులు పోగయ్యారు. తన పక్కింటతను గుంపులో ముందుండి తన ఇంటికి ఉన్న ఇనుపగేటును కూల్చేందుకు ఉపక్రమించాడు. దాంతో.. ‘ఏం చేస్తున్నారు. నేను మీ పక్కింటి వాడిని. ఎందుకు దాడి చేస్తున్నార’ని నజీర్ వారిస్తున్నా వినకుండా దాడికి ఉపక్రమించారు. అంతలోనే పక్కింట తని భార్య ముందుకువచ్చి ఈ బజార్లో ఈ ఇల్లొకటే ఇతర మతస్థులది ఉన్నది. దీన్ని కాల్చి, కూల్చివేయండంటూ మూకను ఎగదోసింది. నజీర్ ఇంటితోపాటు ఆ ప్రాంతంలో ఉన్న 16 ఇండ్లు, 32 దుకాణాలు నేలమట్టమయ్యాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వమే స్వయంగా విధ్వంసానికి దిగటం ఈ దారుణానికి పరాకాష్ఠ. శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న వారి ఇండ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ అనుమానితులందరూ ఒకే మతానికి చెందిన వారు కావటం గమనార్హం. మధ్యప్రదేశ్ న్యాయ, హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ‘రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. అక్కడి ఇండ్లు కూలగొట్టబడతాయి’ అని వ్యాఖ్యానించాడంటే.. పాలకుల నీతి ఏ రీతిన ఉన్నదో చెప్పకనే చెప్తున్నది. అలాగే, గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో కూడా శ్రీరామనవమి సందర్భంగా ఇదేవిధమైన దాడులు జరిగాయి. అక్రమ నిర్మాణాల పేరుతో ఒక వర్గం వారి ఇండ్లను, ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేశారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక వర్గం వారికి ఇష్టానుసారం ప్రవర్తించటానికి ప్రభుత్వ యంత్రాంగమే అనుమతిచ్చిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేరే వర్గం వారికి కనీస హక్కులున్నాయి, వాటిని గౌరవించాలనే స్పృహ ఏ కోశాన కనిపించలేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో మత కలహాల అణచివేత పేరుతో బుల్డోజర్లను వినియోగించటం తాజా భీతావహ పరిణామం. ఈ అల్లర్ల నేపథ్యంలో ఒక వర్గం వారిపై కనీసం ప్రాథమిక నేరారోపణ రిపోర్టులు కూడా నమోదు చేయని పరిస్థితి ఉంటే, మరో వర్గం వారికి మాత్రం బెయిల్ కూడా రాని దుస్థితి ఉంటున్నది. ఈ మధ్యకాలంలో వ్యక్తి స్వేచ్ఛ కూడా ఎంత కురచబారిపోయిందో ఓ ఘటన చెప్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మైనర్ యువకులను పాకిస్థాన్‌కు చెందిన సంగీతం వింటున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. వీరి విషయంలో వ్యక్తి స్వేచ్ఛకు తావున్నదా?
నేర కట్టడి, నిరూపణ అనేది ఈ మధ్యకాలంలో కొత్త పుంతలు తొక్కుతున్నది. తక్షణ న్యాయం ప్రతీకార రూపం తీసుకుంటున్నది. అరెస్టుల దగ్గరే ఆగకుండా వారి ఆస్తులు, నివాసాలు లక్ష్యాలుగా మారి ధ్వంసమవుతున్నాయి. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ పథకం కింద మధ్యప్రదేశ్‌లో హసీనా ఫక్రు అనే మహిళకు ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసింది. శ్రీరామనవమి అల్లర్ల నేపథ్యంలో తాజాగా కూల్చివేసిన ఒక వర్గం వారి ఇళ్లల్లో ఆమె ఇల్లు కూడా ఉన్నది. ఆ ఇల్లు అక్రమ నిర్మాణమని, అందుకే కూల్చివేశామని అధికారులు చెప్పారు. ప్రభుత్వమే నిర్మించి ఇచ్చిన ఇల్లు ఇప్పటికిప్పుడు అక్రమం ఎలా అవుతుంది? అక్రమమైన స్థలంలో ప్రభుత్వం ఇంటిని ఎలా మంజూరు చేసింది? ‘అక్రమ నిర్మాణాలు మాత్రమే కూలగొట్టామని ప్రభుత్వం చెప్తున్న వివరణ పచ్చి అబద్ధం. ఇది కేవలం ఒక వర్గంపై కక్షతో వారిని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విధ్వంసమే’నని పలు జాతీయ పత్రికలు, చానెళ్లు ఈ దారుణాన్ని ఎండగట్టాయి.
– ఎడిటోరియల్ డెస్క్