(కేరళలో జరిగిన సీపీఎం 23వ మహా సభలకు అతిథిగా హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రసంగంలోని ముఖ్యంశాలు..)మన రాజ్యాంగ నిర్మాతలు ఏకీకృత, ఏకశిలా ప్రభుత్వాన్ని సృష్టించలేదు. అధికారాలు, బాధ్యతలను మూడు విభాగాలుగా చేసి.. రాష్ర్టాల జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర ప్రభుత్వ జాబితాగా ఏర్పాటుచేశారు. పంచాయతీ రాజ్ చట్టం ఆమోదం తర్వాత స్థానిక ప్రభుత్వ సంస్థలకు హక్కులు, అధికారాల పంపిణీ జరిగింది. కాబట్టి..తొలుత గ్రామాలు అభివృద్ధి చెందాలి. వాటి అభివృద్ధితోనే రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయి. రాష్ర్టాల వృద్ధితో దేశం అభివృద్ధి అవుతుంది.
కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గ్రామాల, రాష్ర్టాల పురోభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నది. ఇది మన రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమైన పని. రాజ్యాంగం నిర్వచించిన అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది. ఆక్రమణ ద్వారా ఆ పరిధినిపెంచుకుంటున్నది.
ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి సర్వాధికార ఏకీకృత వ్యవస్థను సృష్టించాలని బ్రిటిష్ వాళ్లు కూడా అనుకోలేదు. స్థానిక, రాష్ర్టాల అవసరాలను తీర్చేవిధంగా రాష్ర్టాల్లో స్వయం పాలిత ప్రభుత్వాలు ఉండాలని ‘భారత ప్రభుత్వ చట్టం-1919’లోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఈ రాష్ర్టాలను సమన్వయపరచటం, పర్యవేక్షించటం, వాటన్నింటినీ కలుపుకొంటూ పాలించటం కేంద్రప్రభుత్వం చేయాల్సిన పని అని అదే చట్టంలో చెప్పారు. కానీ కేంద్రం రాష్ర్టాల, స్థానిక సంస్థల అధికారాలను కూడా గుంజుకుంటూ, అన్ని అధికారాలను తన వద్దే కేంద్రీకృతం చేసుకోవాలని భావిస్తున్నది. కేంద్రం అధికార దాహం ఏ స్థాయి లో ఉన్నదంటే గ్రామాల్లోని సహకార సంఘాలను కూడా తానే నియంత్రించాలనుకుంటున్నది. రాష్ర్టాల్లో ఉన్న ప్రజల యోగ క్షేమాలకు బాధ్యత వహిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అటువంటి రాష్ర్టాలను లొంగదీసుకుంటూ, తమ వద్ద మోకరిల్లేలా చేసుకోవటంలో సంతోషం వెతుక్కుంటున్న కేంద్ర పాలకులు చేస్తున్నది ద్రోహం కాదా? రాష్ర్టాలపై ఇది ప్రతీకారం తీర్చుకోవటం కాదా? రాష్ర్టాలపై ప్రతీకారం తీర్చుకుంటున్నామని భావిస్తూ నిజానికి వాళ్లు (కేంద్ర పాలకులు) ఆయా రాష్ర్టాల ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
పన్నులపై గుత్తాధిపత్యం
అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అమలుచేసిన జీఎస్టీ.. రాష్ర్టాల ఆర్థిక హక్కులను లాగేసుకున్నది. పన్ను ఆదాయాలను వాళ్లు (కేంద్రం) గుంజుకున్నారు. నష్టపరిహారం చెల్లిస్తామని హామీలిచ్చారు గానీ అది ఇప్పటికీ పూర్తికాలేదు. ఇచ్చే అసంపూర్ణ పరిహారాన్ని కూడా గడువులోగా ఇవ్వటం లేదు. రాష్ర్టాలకు విడుదల చేయాల్సిన నిధులను ఇవ్వటం లేదు. కేంద్రం నుంచి తమిళనాడుకు రూ.21 వేల కోట్లు రావాల్సి ఉన్నది. వాటి అతీగతీ లేదు.
తమకున్న ఆర్థికహక్కుల గురించి మాట్లాడటానికి గతంలో రాష్ర్టాలకు ప్రణాళికాసంఘం ఒక వేదికలాగా ఉపయోగపడేది. అటువంటి సంస్థను బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. రాష్ర్టాలు తమ డిమాండ్లను వెల్లడించటానికి జాతీయాభివృద్ధి మండలి అవకాశం ఇస్తుంది. దీన్ని ధ్వంసం చేయటానికి పూనుకొన్నారు. దక్షిణ భారతంలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు నిధులను కేటాయించటం లేదు. దీనిపై దక్షిణాది రాష్ర్టాలు మాట్లాడుతాయనే కావచ్చు.. ఏకంగా రైల్వే బడ్జెట్టే లేకుండా చేశారు. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాల జాబితాలో ఉన్న వ్యవసాయరంగంపై కేంద్రం చట్టాలు చేస్తున్నది. చట్టాలు చేసేటప్పుడు ఒక చర్చను కూడా నిర్వహించరు. ప్రస్తుతం ఏ చట్టాన్నైనా చర్చ లేకుండానే ఆమోదింపజేసుకుంటున్నారు. పార్లమెంటులో చర్చ అనేదే లేకుండాపోయింది. ఒకవేళ విపక్ష సభ్యులు ఏదైనా అంశంపై ప్రశ్నించినా.. దానికి తగిన సమాధానం ఇవ్వరు.
యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన
తమకు మెజారిటీ ఉన్నదన్న కారణంతో కేంద్రం యథేచ్ఛగా విచక్షణా రహితమైన పనులకు పాల్పడుతున్నది. రాష్ర్టాల్లో ఉన్న గవర్నర్ల ద్వారా ఈ పనులను అమలుచేయాలని వాళ్లు భావిస్తున్నారు. రాష్ర్టాల్లో ప్రజాతీర్పుతో కొలువైన ప్రభుత్వం, మంత్రివర్గం ఉన్నప్పుడు గవర్నర్ ద్వారా రాష్ర్టాలను పాలించాలనుకోవటం రాజ్యాంగ వ్యతిరేకం కాదా? ఒక కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పనిచేయవచ్చా? బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో గవర్నర్ల ద్వారా సమాంతర ప్రభుత్వాన్ని నడుపాలని అనుకోవటం రాజ్యాంగబద్ధమా? నీట్ వ్యతిరేక బిల్లులను తమిళనాడు అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించినా కూడా రాష్ట్ర గవర్నర్ వాటిని రాష్ట్రపతికి పంపించకుండా వాయిదా రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఆయన రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తున్నారా? నీట్ మాత్రమే కాదు, మొత్తం 11 బిల్లులు గవర్నర్ వద్దే నిలిచిపోయాయి. వాటిపై ఆయన చర్య తీసుకోకపోవటానికి కారణమేమిటి? నామినేట్ అయిన గవర్నర్‌కు ఉన్న అధికారాలు 8 కోట్ల మంది ప్రజల సంకల్పాన్ని కూడా నిర్లక్ష్యం చేసేంత గొప్పవా? ప్రతిపక్షపార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో కేంద్ర ప్రభు త్వం వ్యవహరించే తీరు ఇలా ఉంటే దీన్ని మనం ఆచరణాత్మక ప్రజాస్వామ్యం అని పిల్చుకోవచ్చా?
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నేను గానీ, కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న పినరాయి విజయన్ గానీ కేంద్రం అడుగులకు మడుగులొత్తితే వాళ్లు ఇక్కడి ప్రభుత్వాలకు ఏ సమస్యలు సృష్టించరు. కానీ పేద ప్రజలు, అణచివేతకు, వివక్షకు గురైన ప్రజల జీవితాలను మెరుగుపరుస్తూ చట్టాలు తేవాలని భావించామో, రాష్ట్ర విద్యార్థుల విద్యాహక్కుల గురించి మాట్లాడామో, దక్షిణభారతానికి ఉన్న విశిష్ట సంస్కృతి గురించి చెప్పామో, సమానత్వ భావన గురించి నోరు తెరిచామో, అంతే.. ఆ క్షణం నుంచే వాళ్లు అడ్డంకులు సృష్టించటం ప్రారంభిస్తారు.
దీనిని మనం ఎదుర్కోక తప్పదు. చట్టసభలు, కోర్టులు, బహిరంగ వేదికల ద్వారా ఇప్పటికే మనం దీనిని ఎదుర్కొంటున్నాం. ఈ ఆటంకాలను ఎదుర్కోవటానికి, పోరాడటానికి, వాటిని అధిగమించి ముందుకువెళ్లటానికి రాష్ర్టాలు చేతులు కలపాలి. దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఒక సమిష్టి వేదికను (కలెక్టివ్‌ను) తప్పకుండా ఏర్పాటుచేసుకోవాలి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులతో విడిగా మరొక వేదికను ఏర్పాటుచేసుకోవాలి. రాష్ర్టాలకు మరిన్ని హక్కులు లభించేలా రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నది. ఇది జరగాలంటే రాజకీయాలకు అతీతంగా మనం ఐక్యతను సాధించాలి.
ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం దృష్ట్యా.. భావసారూప్యత ఉన్న రాజకీయపార్టీలు ఒక దగ్గరికి వచ్చి యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడటం చాలా కీలకం. దీనిద్వారానే గెలుపు సాధ్యమవుతుంది. ఈ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికత్వం అనే సమున్నత ఆదర్శాలు కొనసాగటానికి ఈ గెలుపు అవసరం. ఇటువంటి మహత్తర విజయాన్ని సాధించటానికి ప్రతీ రాజకీయ పార్టీ చొరవ చూపాలని, తగిన కార్యాచరణకు దిగాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.రాష్ర్టాల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుదాం! నిజమైన భారత సమాఖ్యను నిర్మిద్దాం!
స్వయం ప్రతిపత్తి లేని స్వయం పాలనను తీసుకురావటమంటే తెల్లపులి (బ్రిటీష్ వాళ్ల) స్థానంలోకి నల్లపులిని (భారతీయ పెత్తందార్లను) తీసుకురావటమే అని మహాత్మాగాంధీ చెప్పారు. ఇప్పుడదే నిజమై కూర్చున్నది. అటువంటి స్వాతంత్య్రం ఎంతమాత్రం పనికిరానిదని భగత్‌సింగ్ కూడా వ్యాఖ్యానించారు.