కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలలో అంగబలం, అర్థబలం అధికంగా ఉన్న పార్టీ కాబట్టి తమ అభీష్టం మేరకు ఒక మహాసమావేశం నిర్వహించడం పెద్ద పనేమీ కాదు. ఇక భారీ ప్రదర్శనలు, ప్రచారాలు చేయడం వాళ్లకు అలవాటున్న విశేషాలే. ఈసారి సమావేశానికి తెలంగాణ రాష్ర్టాన్ని, హైదరాబాద్ నగరాన్ని బీజేపీ ప్రత్యేకంగా ఎంచుకోవడం కొంత ఆసక్తికరంగా ఉన్నది.
బీజేపీకి తెలంగాణలో అధికారం లేదు. ఆ పార్టీకి అసెంబ్లీలో ఉన్నవి మూడే సీట్లు. ఇక పార్లమెంటులో నాలుగు సీట్లు. దేశంలోని పలు రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది. కొన్ని రాష్ర్టాల్లో వేరే పార్టీలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ర్టాల్లో ఏదో ఒక దానిని ఎంచుకొని ఈ మహా ఉత్సవం నిర్వహిస్తే బాగుండేది. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా, ఒక రాజకీయ ఎత్తుగడతో, తెలంగాణలో పాగా వేయడానికే ఈ సమావేశం తెలంగాణలో జరపాలని నిర్ణయించుకున్నట్లుంది. అందులో భాగంగానే తెలంగాణలోని ప్రాంతీయ పార్టీ ప్రభుత్వ అస్తిత్వాన్ని తక్కువచేసి చూపాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లే అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా అప్పుడే అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర, రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధికి అందించిన సహకారం మొదలైన వాటిని ఇక్కడ కొంత అవలోకనం చేసుకొని ఆ పార్టీ సమావేశాల సందర్భాన్ని, ఆవశ్యకతను అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆ విశ్లేషణ జరిపినప్పుడు విస్మయం కలిగించే విషయాలు అవగతమవుతున్నాయి.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీజేపీ గోడ మీది పిల్లివాటం ప్రదర్శించింది. 1998లో ‘ఒక ఓటు రెండు రాష్ర్టాలు’ అనే నినాదం లేవనెత్తినా చివరికి రాష్ర్టాల ఏర్పాటు వచ్చేసరికి 2000లో ఉత్తరాదిన మూడు రాష్ర్టాలు ఏర్పాటు చేసి, తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపింది. ఆ తర్వాత 2014లో రాష్ట్ర ఏర్పాటు బిల్లును సమర్థించే విషయంలో కూడా బీజేపీ అటూ ఇటూ ఊగిసలాడిన సందర్భాలున్నాయి. పార్లమెంటులో బిల్లు మీద చర్చ జరిగినప్పుడు గందరగోళం చోటు చేసుకోవటాన్ని సాకుగా చూపి, బిల్లుపై చర్చను నిరవధికంగా వాయిదా వేయమని ఆ పార్టీ అప్పటి అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ కోరారు. అంటే, తెలంగాణ ఏర్పాటునే నిరవధికంగా వాయిదా వేయించాలని బీజేపీ చూసింది. అయినప్పటికీ, రాష్ట్ర ఏర్పాటును ఆపలేక ఊరుకున్నారు. 2014 తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య అంత సయోధ్య లేదు. నిజానికి బీజేపీకి తెలంగాణలో తొలి నుంచి కొంత రాజకీయ ప్రతిపత్తి ఉన్నది. ఆంధ్రాలో ఆ మాత్రం కూడా లేదు. అయినా విచిత్రంగా, ఆంధ్రాలో టీడీపీని సమర్థించి ఆ పార్టీ గెలుపునకు బీజేపీ సాయపడింది. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంతో స్నేహగీతం ఆలపిస్తూ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో రాజకీయంగా దూరంగా ఉంటూ వచ్చింది. ఏపీకి సహాయకారిగా కేంద్రం పనిచేసింది. ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపేసింది. చంద్రబాబు అతి రాజకీయాలకు మొదట్లో పూర్తి సమర్థన ఇచ్చింది మోదీ ప్రభుత్వం.
వాస్తవానికి మోదీ తెలంగాణ పట్ల తొలినుంచి వ్యతిరేకతతోనే ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తిరుపతి ఎన్ని కల సభలో ఆయన మాట్లాడుతూ… ‘ఏపీ విభజన అనేది తల్లిని చంపి, బిడ్డను బతికించినట్టుగా ఉన్నది’ అంటూ తెలంగాణ ఏర్పాటుపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కూడా పార్లమెంట్ లోపట, బయటా ప్రధాని, కేంద్రమంత్రులు ఆంధ్రకు అన్యాయం జరిగిందనే ధోరణిలో రాజకీయ వ్యాఖ్యానాలు కొన సాగించారు. ఆంధ్ర రాష్ర్టానికి విభజన బిల్లు, ఫైనాన్స్ కమిషన్ల ద్వారా ఎక్కువ ఆర్థిక సహాయం అందింది. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు మాత్రం కేంద్రం నుంచి సరైన సహకారం అందలేదు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా బీజేపీతో సఖ్యత కోసం టీఆర్ఎస్ ప్రయత్నించినా అది అంత ఫలవంతం కాలేదు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ మధ్య దూరం ఇంకా పెరిగింది.
తెలంగాణలో బీజేపీకి పార్టీపరంగా కొంత మెరుగైన వ్యవస్థ ఉన్నా, ఎంపీల సంఖ్య దృష్ట్యా మోదీ బీజేపీ ఆంధ్ర మీద ఎక్కువ అరివారం చూపించింది. అది ఇప్పటికీ కొనసాగుతున్నది. అయితే ఆంధ్రాలో బీజేపీ పప్పులుడకలేదు. అక్కడి పార్టీల, ప్రభుత్వాల సంగతి ఎట్లున్నా, ప్రజలు మాత్రం బీజేపీకి టోకుగా మొండిచేయి చూపించారు.
2019లో లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలుచుకోవడంతో, ఫోకస్ ఇటువైపు తిరిగింది. అయితే తెలంగాణ మీద ప్రభుత్వపరంగా ఉన్న చిన్నచూపులో పెద్దగా మార్పు లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వారి రాజ్యాంగవిరుద్ధ వ్యాఖ్యానాలు వాళ్లకు అవసరం పడ్డప్పుడల్లా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, అంతకుమించి ఫెడరల్‌స్ఫూర్తికి విరుద్ధంగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఒక చిత్రమైన కొత్త పంథా అమలుచేయడం మొదలుపెట్టింది.
తెలంగాణకు సహాయం చేసి ప్రజాభిమానం పొందే బదులు, ఆర్థిక ఇబ్బందులు కలుగచేసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యపరిచి ఇక్కడ పాగా వేయాలనే కుటిల ప్రయత్నం బీజేపీ మొదలుపెట్టింది. రాష్ర్టానికి ఇవ్వాల్సిన డివల్యూషన్ నిధులు తప్ప, అదనంగా ఒక్క పైసా ఇవ్వకుండా, అవి కూడా సరైన సమయానికి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో కరెంటు, సాగునీరు, తాగునీటికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు చేపట్టినా, వాటికి కేంద్ర ప్రభుత్వసంస్థలు నిధులు సిఫారసు చేసినా కూడా కేంద్రం సహాయం చేయలేదు. రాష్ర్టాలకు కేటాయించే జాతీయసంస్థలు, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు, అనేక ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల విషయంలో కూడా ఒక్క సంస్థనూ ఇవ్వకుండా పక్షపాత వైఖరి చూపింది. వరదలు వచ్చినప్పుడు చాలా రాష్ర్టాల్లో వేల కోట్ల సాయం చేసి, హైదరాబాద్ నగరానికి భారీ వరదనష్టం జరిగితే సహాయం నిరాకరించింది. తెలంగాణ వరి పంట కొనుగోలు విషయంలో కావాలని ఒక అనవసరపు సమస్య సృష్టించి, రాష్ర్టానికి పెద్ద ఆర్థికభారం కలుగజేసింది. తాను ఆర్థిక సహాయం అందించకపోగా, రాష్ట్రం తన పరిమితులకు లోబడి తీసుకోదలచిన అప్పులకు కూడా అనుమతివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నది.
కేంద్రప్రభుత్వం ఇంత దారుణమైన వివక్ష చూపినా కూడా దేశంలోని రాష్ర్టాల్లోకెల్లా తెలంగాణ గొప్ప ప్రగతి సాధించింది. ముఖ్యంగా, అతిగా ప్రచారం చేయబడిన గుజరాత్ మోడల్‌ను కాదని ఒక తెలంగాణ మోడల్‌ను సృష్టించి ముందుకుపోతున్నది. అటు జాతీయస్థాయిలో కానీ, లేదా తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కానీ అభివృద్ధిపరంగా తెలంగాణతో పోటీ పడలేని స్థితిలో బీజేపీ ఉంది. అయినప్పటికీ, తెలంగాణకు వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపుతామని ఆ పార్టీ నేతలు ఎట్లా చెప్తున్నరో ఎవ్వరికీ అర్థం కాని విషయం. తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని అన్ని సంబంధిత కేంద్ర సంస్థలు, మీడియా సంస్థలు కూడా గుర్తించి ప్రచురిస్తున్నాయి. వాటిని కాదని, బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయం చేస్తున్నారు. అనాగరిక, అప్రజాస్వామిక, అబద్ధపు ఆరోపణలను సమర్థిస్తూ బీజేపీ కేంద్రమంత్రులు, అగ్రనాయకత్వం చేస్తున్న దాడులు, సమావేశాలు, ఉపన్యాసాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ఒక జాతీయ పార్టీ గౌరవాన్ని మంటగలుపుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా అధికారం కోసం ఎక్కడైనా, ఎంతైనా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కేంద్రప్రభుత్వం, అధికారంలో ఉన్న పార్టీ కలిసి.. ఫెడరల్ వ్యవస్థలోని, బాగా పనిచేస్తున్న ఒక రాష్ట్ర ప్రభుత్వంపై, ఆ ప్రభుత్వ పార్టీపై, తమ అధికార బలంతో ఈ విధంగా దాడి చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియ వలె కనిపించడం లేదు. ఇదొక మధ్యయుగాల నాటి యుద్ధదాడిని గుర్తుకుతెస్తున్నది.మరి, ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయ స్వాతంత్య్రం సంపాదించుకొని, వెనుకకు నెట్టబడిన రాష్ర్టాన్ని తమ సొంత వనరులతో, అస్తిత్వంతో ముందుకు తీసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు ఈ జాతీయ
దాష్టీకాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాలి.