2021లో జీవో నెంబర్ 33 ద్వారా అగ్రకుల పేదల(ఈడబ్ల్యూఎస్)కు తెలంగాణ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఒకరికి మోదం మరొకరికి ఖేదం అన్నట్టయింది.తమిళనాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టే..తెలంగాణలోని ఈబీసీలకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయడం అత్యంత ఆవశ్యకం. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఈబీసీ రిజర్వేషన్లను సాధించాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్‌పైనే ఉన్నది.
10 శాతం అగ్రకుల రిజర్వేషన్ల విషయం కనుమరుగు కావడానికే ప్రస్తుతం ఓబీసీ వర్గీకరణను కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది.
56 శాతం మంది ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మేమెంతో మాకంతా’నినాదంతో రిజర్వేషన్ ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడటం తథ్యం.
103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరి 12న ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. లోక్‌సభలో 323 -3 ఓట్ల తేడాతో, రాజ్యసభలో 165 -7 తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఆ సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన పార్లమెంట్ సభ్యుల్లో ఒక్కరూ నోరు మెదపలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15లో ఇప్పటికే ఉన్న 5 నిబంధనలకు అదనంగా మరో నిబంధనను చేర్చిన కేంద్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలను వంచించింది. 15(6)ఏ లో ప్రస్తావించిన వర్గాలకు కాకుండా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకునే వెసులుబాటు దీని ద్వారా ప్రభుత్వానికి కలిగింది. నిబంధన (బీ) ప్రకారం.. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఆర్థికంగా బలహీనవర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి. 16(6)లో 4వ నిబంధనలో పేర్కొన్న వర్గాలకు కాకుండా అదనంగా ఈబీసీ వర్గాలకు కేటాయించాలని పేర్కొన్నారు. 16(4)లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేని సామాజికవర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. కానీ, కొత్త క్లాజులో ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలు అనే మాటను తొలగించారు.
రాజ్యాంగంలో 340 అధికరణం వెనుకబడిన తరగతులకు, 341 షెడ్యూల్డ్ కులాలకు, 342 షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన పరిస్థితులను అధ్యయనం చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ అధికరణంలో పేర్కొన్న వర్గాలకు మినహా మరే ఇతర వర్గాలకు రిజర్వేషన్ల హక్కు కల్పించడమంటే కులాన్ని శాశ్వతీకరించి అగ్రకులాలు మరింత ఉన్నతంగా వర్ధిల్లేందుకు తోడ్పడటమే. సామాజిక వెనుకబాటుతనాన్ని రూపుమాపి సమానత్వాన్ని సాధించడానికి ఎన్నుకున్న మార్గమే రిజర్వేషన్లు. కులాల మధ్య ఉన్న సామాజిక అసమానతలను తొలగించడానికి సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మన రాజ్యాంగం రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. అంతేతప్ప, ఆర్థిక వెనుకబాటుతనానికి కాదు. ఆర్థిక వెనుకబాటుతనాన్ని రూపుమాపాలంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. రిజర్వేషన్లు అనేవి ఒక సంక్షేమ పథకం కాదు.
1953 జనవరి 20న కాకా కాలేల్కర్ నేతృత్వంలో 11 మంది సభ్యులతో కూడిన కమిషన్‌ను అప్పటి రాష్ట్రపతి నియమించారు. ప్రభుత్వానికి ఈ కమిషన్ పలు సూచనలు చేసింది. దేశంలోని ఏ వర్గానికి చెందినవారైనా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయా వర్గాలను నిర్ధారించడం, ఆయా వర్గాల జాబితాను తయారు చేయడం. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సామాజికవర్గాల జీవన స్థితిగతులను, వారి సమస్యలను అర్థం చేసుకొని ఆ స్థితిగతులను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలను సూచించడం.
సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఇతర టెక్నికల్ కోర్సులు, సంబంధిత విద్యాసంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 70 శాతం రిజర్వేషన్లు కల్పించడం. సీట్ల కేటాయింపుల్లో అత్యంత వెనుకబడినవర్గాల పిల్లలకు ముందు ప్రాధాన్యత ఇవ్వడం. ప్రభుత్వ ఉద్యోగాలనేవి ప్రజలకు ఒక రకమైన సామాజిక హోదా, గుర్తింపు, విలువ, అధికారం, వేతనాలు, ఆర్థిక, ఉద్యోగపరమైన భద్రత కల్పిస్తాయి. కాబట్టి, వారికి రిజర్వేషన్లు కల్పించడం. స్థానిక సంస్థల సర్వీసుల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలని కమిషన్ సూచించింది. ఈ కమిషన్ తన నివేదికను 1955 మార్చి 30న నాటి రాష్ట్రపతికి సమర్పించింది. ఆ తర్వాత వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం రెండో కమిషన్ ఏర్పాటైంది.
1979లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం మండల్ కమిషన్‌ను నియమించింది. సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన 11 సూచికల ఆధారంగా వెనుకబాటుతనాన్ని మధించేందుకు పనిచేసిన ఈ కమిటీకి బీపీ మండల్ నేతృత్వం వహించారు. 1980 డిసెంబరు 31 నాటికి మండల్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. కులం, ఆర్థిక, సామాజిక అంశాల ఆధారంగా 1980 నాటికి దేశ జనాభాలో 52 శాతం మంది ఓబీసీలు (ఇతర వెనుకబడ్డ కులాలు) ఉన్నట్టు గుర్తించింది. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోనూ 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఈ 27 శాతాన్ని కలిపితే మొత్తం రిజర్వేషన్లు 49 శాతానికి చేరతాయి.
10 శాతం అగ్రకుల రిజర్వేషన్ల విషయం కనుమరుగు కావడానికే ప్రస్తుతం ఓబీసీ వర్గీకరణను కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది. 56 శాతం మంది ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మేమెంతో మాకంతా’ నినాదంతో రిజర్వేషన్ ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడటం తథ్యం.
-యెనుగందుల శంకర్
94407 47614