2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో వచ్చిన ఏ ఎన్నికల్లోనూ పాలకపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తన శక్తిని నిరూపించుకోలేకపోయింది.చేతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండి కూడా… మే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ సగం స్థానాల వద్దే నిలిచిపోయింది. దాంతో ఆ పార్టీకి ఎన్నికలంటేనే భయం పట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలను ఏడాదికి పైగా దాటవేస్తున్నది. కాంగ్రెస్ పాలనపై, హామీల అమలుపై అసంతృప్తితో ఉన్న ఓటరును బీసీ రిజర్వేషన్లతో చల్లబరిచి స్థానిక సంస్థల్లో గట్టెక్కాలని చూస్తున్నది. అయితే ఈ మధ్య వచ్చిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటిని బీజేపీ తన్నుకుపోవడంతో ఓటర్ల దృష్టిలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిందనక తప్పదు.
కాంగ్రెస్ పార్టీ నేత టి.జీవన్‌రెడ్డి ప్రా తినిధ్యం వహించిన ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబా ద్ పట్టభద్రుల నియోజకవర్గం ఇప్పుడు బీజేపీ వశమైంది. ఎంతో నాటకీయంగా సాగిన ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి చివరికి ఓటమి పాలు కాక తప్పలేదు. గెలుపుపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్న ఆయన ఫలితాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఆయనపై ఐదు వేల ఓట్ల ఆధిక్యంతో సంగారెడ్డికి చెందిన బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ సీటును ప్రతిష్ఠాత్మకంగానే పరిగణించింది. ముఖ్యమంత్రి, టీ కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రులు అందరూ నరేందర్‌రెడ్డి గెలుపు కోసం ఆయన వెంట ఉన్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పెద్దపల్లిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రభుత్వ తీరును వివరించి ఓట్లడిగారు. అయితే కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల రూపంలో మరోసారి బయటపడింది.
నిజానికి ఈ ఎన్నికలో అభ్యర్థి ఎంపికపైనే కాంగ్రెస్ వైపు నుంచి తప్పటడుగు పడిందనాలి. విద్యా వ్యాపారంలో ఉన్న వి.నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ అనే సంస్థకు అధిపతి. తన సంస్థ వ్యాప్తి, వ్యాపార విస్తరణ పట్ల తప్ప ఆయనలో సేవా కోణం లేదు. చేతి నిండా డబ్బున్న ఆయన రాజకీయంగా ఎదగాలని కోరుకోవడం వ్యక్తిగత కాంక్ష మాత్రమే. స్థితిమంతుడైన, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బీజేపీ నిలబెడుతున్నందువల్ల ఆయనకు తూగే వ్యక్తిగా స్థానికుడైన మరో రెడ్డిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. ఇక్కడే కాంగ్రెస్ చిత్తశుద్ధి బయటపడింది. బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో మాత్రం బీసీలను పక్కనపెడుతున్నది. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన ప్రసన్న హరికృష్ణ గురించి ప్రస్తావించుకోవాలి. గజ్వేల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ బరిలో దిగారు. అప్పటికే విద్యార్థుల, విద్యాలయాల సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నో వినతులు సమర్పించారు. సంబంధిత మంత్రులను కలిసిన ఫొటోలు, వార్తలు ప్రచారంలో కనబడ్డాయి. కోటీశ్వరులతో ఓ సాధారణ పౌరుడిగా పోటీపడ్డారు. ఆయనకు 60,419 ఓట్లు వచ్చాయి. బలమైన రాజకీయ పార్టీ మద్దతు లేకుండా ఇన్ని ఓట్లు సాధించడం గొప్ప విషయమే. ఓటరుకు ఒక్క రూపాయి కూడా పంచకుండా ఈ ఓట్లు సంపాదించానని ఆయన అంటున్నారు. ఇలాంటి అభ్యర్థులు మన ప్రధాన రాజకీయ పార్టీలకు కనబడరు. ఎన్నికలనగానే ఎంత ఖర్చుపెడతాడు, పార్టీకి ఎంతిస్తాడు అనే లెక్కలే వాటికి ప్రధానం. ఇక్కడ కాంగ్రెస్ ఒక మంచి అవకాశాన్ని వదులుకొని రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి తోడ్పడిందనక తప్పదు.
అసలు ఎమ్మెల్సీలంటే ఎవరు?
ప్రభుత్వంలో ఎగువసభ అవసరమేమిటి? రాజకీయ నాయకులతో ఎన్నికల్లో పోటీ పడే అంగ, అర్థబలం లేని మేధావులు, విద్యావంతులు, కళాకారులు, సమాజ సేవకులు పాలనలో భాగం కావాలని, వారి జ్ఞానసంపత్తిని విధాన నిర్ణయాల్లో వినియోగించుకోవాలని ‘శాసన మండలి’ ఏర్పడింది. ఎందరో మహానుభావులు మండలి సభ్యులుగా ప్రజలకు తమ సేవలందించారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతులైన పట్టభద్రులు సమాజానికి అవసరమని, వారి ప్రతినిధులు మండలిలో ఉంటే ప్రభుత్వానికి తగిన సూచనలు చేయగలరని కొన్ని ఎమ్మెల్సీ సీట్లు వారికి కేటాయించారు. తెలంగాణ విధాన మండలిలో ఉన్న 40 సీట్ల లో మూడేసి సీట్లు పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు కేటాయించారు. వాటిలో ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయుల సీట్ల పదవీకా లం మార్చి 29తో ముగుస్తుంది. ఈ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. ఒక ఉపాధ్యాయ స్థానానికి అధ్యాపకుడైన పీఆర్టీయూ అభ్యర్థి గెలవగా మిగతా రెండింటి లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. గతంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెద క్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రతినిధి ఒక ఉపాధ్యాయుడు కాగా ప్రస్తుతం బీజే పీ తరఫున గెలిచిన మల్కా కొమురయ్య ఓ బిజినెస్ మాన్. పల్లవి విద్యాసంస్థల యజమా ని. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు మల్కాజ్గిరి స్థానాన్ని ఇవ్వలేకపోయిన బీజేపీ ఇలా ఇప్పుడు భర్తీచేసింది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి కనీసం మూడేండ్లు ఉన్నత, ఆపై పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం కావాలి. పోటీ చేయడానికి మాత్రం అలాంటి అర్హతతో పనిలేదు. వృత్తి గురించి ఓనమాలు తెలియని వ్యక్తి వారి తరఫున చట్టసభకు వెళ్లి ఏం మాట్లాడుతారో మరి.
కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ స్థానానికి తమ అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్ మిగతా రెండు చోట్ల అభ్యర్థులు దొరకక, ఎవరికీ మద్దతు ఇవ్వక మౌనంగా ఉండిపోయింది. పాలకపక్షానికి ఇలాంటి పరిస్థితి రావడం ఇప్పుడే చూస్తున్నాం. సాధారణంగా ఉపాధ్యాయ, పట్టభద్ర స్థానాలకు స్వతంత్రులు, యూనియన్ నాయకులు గెలుస్తుంటారు. అయినా పాలించే పార్టీ తమ ప్రయత్నం మానుకోదు. గతంలో బీఆర్ఎస్ రెండు పట్టభద్రుల స్థానాల్లో సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను గెలిపించుకున్నది. ఈసారి మాత్రం ఉపాధ్యాయ స్థానం సంఘ నాయకుల చేతిలోంచి ఒక వ్యాపారి చేతిలోకి వెళ్లింది. పార్టీలేవైనా విధాన మండలి ఖాళీలకు కొన్ని నియమాలు పాటించాలి. ఆయా రంగాల్లో విశేష కృషిచేస్తున్న వారికే ఆ సీట్లు కేటాయించడం గౌరవప్రదంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు లాంటి ఏ వృత్తికీ ఇవ్వని ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులకు రాజ్యాంగం ఇచ్చింది. శాసనమండలిలో అడుగుపెట్టే అర్హత గురువులకే పరిమితం చేయాలి.
-బద్రి నర్సన్
94401 28169