డాలస్‌లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ప్రతీ తెలంగాణ బిడ్డకు గర్వకారణం. ఈ ఉత్సవాలకు తెలంగాణ అభివృద్ధి ప్రదాత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానుండటం దీని ప్రాధాన్యతను మరింత ఇనుమడింపజేయనున్నది. ప్రపంచం నలుమూలల నుంచి తెలంగాణ బిడ్డలు ఎంతో ఉత్సాహంతో డాలస్‌కు చేరుకుంటున్నారు. ఇది ఒక వేడుక కాదు, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షల సాఫల్యానికి, బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని ప్రస్థానంలో ఒక సువర్ణాధ్యాయానికి ప్రతీక.
ఆరు దశాబ్దాల పాటు సాగిన అకుంఠిత పోరాటానికి, అమరవీరుల త్యాగాలకు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, రైతులు, కార్మికులు, సకల జనుల ఆకాంక్షలకు దక్కిన ప్రతిఫలమే తెలంగాణ. ఈ మహోద్యమానికి ఊపిరులూది, దాన్ని ఒక తార్కిక ముగింపునకు తీసుకువచ్చిన ఘనత నిస్సందేహంగా కేసీఆర్‌కే దక్కుతుంది. సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్న తెలంగాణ గోసను చూడలేక పదవులను తృణప్రాయంగా వదిలి, 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమ శంఖారావం పూరించారు. పద్నాలుగేండ్ల పాటు ఆయన చేసిన పోరాట ఫలితంగా తెలంగాణ స్వప్నం సాకారమైంది.
రాష్ట్రంగా ఆవిర్భవించే నాటికి తెలంగాణ అనేక సమస్యలతో సతమతమవుతున్నది. ఈ తరుణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఒక స్పష్టమైన, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకుసాగారు. వ్యవసాయం, సాగునీటిపారుదల, విద్యుత్తు, పరిశ్రమలు, విద్య, వైద్యం, సంక్షేమం వంటి కీలక రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను సాకారం చేశారు. ఈ ప్రగతి ప్రస్థానాన్ని ‘ది ఎకానమిస్ట్’ వంటి అంతర్జాతీయ పత్రికలు కొనియాడాయి. అయితే, మార్పు పేరిట మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పట్ల అతి తక్కువ కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ పాలనలోని సుస్థిరతను, కేసీఆర్ నాయకత్వంలోని దార్శనికతను ప్రజలు ఇప్పుడు మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు.
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం బీఆర్ఎస్తోనే సురక్షితం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సమగ్రాభివృద్ధి బీఆర్ఎస్తోనే ముడిపడి ఉన్నాయనేది చారిత్రక సత్యం. బీఆర్ఎస్ రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అదొక ఉద్యమం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం, వారి గుండె చప్పుడు.
ఉద్యమంలోనూ, ఆ తర్వాత నవ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ, ఇప్పుడూ.. ప్రవాస తెలంగాణ బిడ్డలు పోషించిన, పోషిస్తున్న పాత్ర ఎనలేనిది. మాతృభూమి అభివృద్ధికి ఎన్నారైలు అందిస్తున్న చేయూత, బీఆర్ఎస్ పార్టీకి వారు ఇస్తున్న నైతిక మద్దతు వెలకట్టలేనివి. డాలస్ వేడుకలు వారి అచంచలమైన అభిమానానికి, తెలంగాణ పట్ల వారికున్న ప్రేమకు నిదర్శనం. భవిష్యత్తులోనూ మహేష్ బిగాల సారథ్యంలో ఎన్నారైలు బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు భాగస్వాములు కావాలని, వారి మేధస్సును, వనరులను తెలంగాణ అభివృద్ధి కోసం అందించాలని ఆకాంక్షిస్తున్నా. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యం. కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో, కేటీఆర్ సారథ్యంలో, హరీశ్‌రావు కార్యదక్షతతో మరోసారి అధికార పగ్గాలు చేపట్టి, ప్రజాసేవకు పునరంకితమవుతుంది. ఈ లక్ష్య సాధనకు మనమందరం సైనికుల్లా పనిచేయాలి.
జై తెలంగాణ! జైజై కేసీఆర్!!