ఒక సమాజం శాశ్వతంగా నిలబడాలంటే, రెండు మూలాధారాలు అవసరం. ఒకటి విలువలు, రెండోది కులవృత్తులు. ప్రతి కులానికి ఒక వృత్తి.. ప్రతి వృత్తికి ఒక గౌరవం అనే తత్వం శతాబ్దాలుగా మన దేశ గ్రామీ ణ జీవనశైలికి నిలువుదట్టంలా కొనసాగుతున్నది. కానీ, కార్పొరేట్ విస్తరణ, బ్రాండెడ్ మార్కెటింగ్, గ్లోబల్ ఫ్యాషన్ కల్చర్ కలగలిసి సంప్రదాయ వృత్తుల మెడపై కత్తిగా మారాయి. బ్రాండెడ్ మోజులో సంప్రదాయ కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి. ఇది ఉపాధిపైనే కాదు, సమాజ నిర్మాణం, వారసత్వ కళలు, కుటుంబ జీవన విధానాలపై కూడా ప్రభావం చూపుతున్నది.
నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఓ కార్పొరేట్ సెలూన్ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నాయీబ్రాహ్మణులు 45 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. ఇది వారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, గ్రామీణ జీవన విధానానికి, అన్ని కులవృత్తుల అస్తిత్వానికి సంబంధించినది. గతంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బ్రాండెడ్ సెలూన్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఫలించలేదు. ఇప్పుడు అదే కత్తి మండల కేంద్రాలకు, గ్రామాలకూ దూసుకెళ్తున్నది. కార్పొరేట్ సెలూన్ల వల్ల స్థానిక సెలూన్లు మూతపడుతున్నాయి. నాయీబ్రాహ్మణులు ఉపాధి కోల్పోతున్నారు. ఇది ఒక్క నాయీ బ్రాహ్మణులు, ఒక్క నల్లగొండ జిల్లా సమస్య మాత్రమే కాదు. తెలంగాణలోని ప్రతీ జిల్లా, ప్రతీ మండల కేంద్రంలోని అన్ని కులవృత్తులవారికి సంబంధించినది.
తెలంగాణలోని ప్రతీ గ్రామంలో సగటున 20-30 నాయీబ్రాహ్మణ కుటుంబాలు వారి వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే, బ్రాండెడ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు పెరగడంతో తమ ఆదాయం 50 శాతానికి తగ్గినట్లు నాయీబ్రాహ్మణ సంఘాలు చెబుతున్నాయి. తెలంగాణలో లక్షల మంది నాయీబ్రాహ్మణులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సెలూన్లపై ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా సంప్రదాయ వృత్తిదారులు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
నాయీబ్రాహ్మణులు పండుగల సమయంలో అర్ధరాత్రి వరకు సేవలందించే వృత్తి సంస్కృతి కలిగినవారు. శుభకార్యాలకు వీరి అవసరం ఎంతో ఉంటుంది. ప్రతీ ఇంట్లో జరిగే మంచి, చెడుకు వీరి అవసరం ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. కంసాలులు బంగారానికి కళాత్మక రూపం ఇస్తారు. ఒక్కో ఆభరణాన్ని రోజుల తరబడి చెక్కుతారు. కానీ, ఇప్పుడు బ్రాండెడ్ బంగారం షాపుల వల్ల వీరు ఉపాధి కోల్పోతున్నారు. కార్పొరేట్ మార్కెట్ల మాయకు చేనేత కార్మికులు సహా ఎన్నో కులవృత్తులవారు ఉపాధి కోల్పోతున్నారు. వారి అస్తిత్వమే ప్రమాదంలో పడుతున్నది. తద్వారా ఒక వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నది. కార్పొరేట్ విస్తరణలో గ్రామీణ నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకోకపోతే, మనం మరో పదేండ్లలో శతాబ్దాల వారసత్వాన్ని కోల్పోతాం.
ఈ నేపథ్యంలో కులవృత్తులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్థానిక వృత్తులను కాపాడుకునేందుకు ప్రత్యేక జాబితా, మార్కెట్ లింకేజీలు, ఈ-కామర్స్ మార్కెట్ వంటివి అవసరం. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా తదితర కార్యక్రమాలు ప్రచారానికే పరిమితమయ్యాయి. వీటిని కులవృత్తులకు అన్వయించడంలో ప్రభుత్వం విఫలమైంది.
ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో, మండల పరిధిలో కార్పొరేట్ సంస్థలకు లైసెన్సులు ఇచ్చే ముందు, స్థానిక వృత్తులపై సోషియో-ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తప్పనిసరిగా చేయాలి. మేడ్ ఇన్ విలేజ్, ప్యూర్ స్కిల్ సర్వీస్, గోల్డ్ బై హ్యాండ్ వంటి బ్రాండ్లు తీసుకురావాలి. నాబార్డ్ ఎంఎస్ఎంఈ, కేవీఐసీ వంటి సంస్థలు గ్రామీణ వృత్తిదారులకు మౌలిక సదుపాయాలు, బ్రాండింగ్ మద్దతును అందించాలి. నూతన పరికరాలు, సాంకేతికత, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. ఈ- కామర్స్ ద్వారా మార్కెట్ అవకాశాలు కల్పించాలి. పాఠశాల స్థాయిలోనే సంప్రదాయ వృత్తులపై అవగాహన కల్పించాలి. గ్రామ పంచాయతీల నుంచే స్థానిక సేవల ప్రోత్సాహానికి ప్రణాళిక రూపొందించాలి. ముఖ్యంగా అభివృద్ధికి సమతుల్యత అవసరం. కార్పొరేట్ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగం కావచ్చు. కానీ, వాటి అభివృద్ధి సంప్రదాయ వృత్తులను తుడిచిపెట్టేలా ఉంటే, అది సమతుల అభివృద్ధి కాదు.
అభివృద్ధి కావాలి కానీ, అస్తిత్వాన్ని దెబ్బతీసే అభివృద్ధి కాదు. బ్రాండ్లు కావాలి కానీ, బతుకులను మింగేవి కావు. నవీన విధానాలు కావాలి కానీ, నైపుణ్యాన్ని నిర్వీర్యం చేసేది కాదు. గ్రామీణ జీవనాన్ని రక్షించడమే అసలైన అభివృద్ధి. కులవృత్తుల పునరుజ్జీవమే భవిష్యత్ భారత నిర్మాణానికి అసలైన పెట్టుబడి. ఇప్పటికైనా ప్రభుత్వాలు, సమాజం స్పందించకపోతే మన గ్రామాలు, మన కళలు, మన వృత్తులు బ్రాండ్ల నీడలో కనుమరుగైపోవడం ఖాయం.
-జి.అజయ్ కుమార్