పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు జిల్లా కుప్పంలోని పరమసముద్రం చెరువును కృష్ణా జలాలతో నింపుతున్న వీడియోలను ఇటీవల చూసినప్పుడు మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ఏ రైతుకైనా లేదా వ్యవసాయంతో అనుబంధమున్న ఎవరికైనా సరే ఈ దృశ్యాలు అమితానందాన్నిస్తాయి. అంతేకాదు, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదనే భరోసా కలిగిస్తాయి. ప్రాంతంతో సంబంధం లేకుండా తెలంగాణ సరిహద్దుల నుంచి తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో బీడువారిన గ్రామాల్లోని చెరువులను నింపుతూ నీళ్లు ఇంత దూరం ప్రయాణించడం ఒక మధుర ఘట్టమనే చెప్పాలి. ఈ ప్రయాణంలో కృష్ణా జలాలు మార్గమధ్యంలో అనేక జలాశయాలను నింపుతూ, కరువు ప్రభావిత రాయలసీమకు జీవం పోస్తాయి.
భారతదేశ సైన్స్, టెక్నాలజీ రంగాలు, ప్రపంచ దౌత్యపరంగా గణనీయమైన పురోగతి సాధిస్తున్న ప్రస్తుత రోజుల్లోనూ వ్యవసాయానికి నీళ్లను అందించడం సాధ్యంకాని కలగానే మిగిలిపోయింది. అంతేకాదు, రైతులను పాలకులు ప్రకృతి అస్థిరతలకు వదిలేశారు. అయితే గత రెండు మూడు దశాబ్దాలను పరిశీలిస్తే, ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో కృష్ణా, గోదావరి నీటిని ఉపయోగించడం లేదా మళ్లించడంలో గణనీయమైన పురోగతి కనిపిస్తున్నది. తెలంగాణలో నీటిపారుదల రంగాభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ చర్యలు ఆలస్యంగా రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ, 2014-2023 మధ్యకాలంలో వేగం పుంజుకోవడమే కాదు; గోదావరి, కృష్ణా నీటిని గొప్పగా ఉపయోగించడంలో అత్యద్భుతమైన ఫలితాలను సాధించారు.
నీటిపారుదలరంగంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంబంధించిన లెక్కల గురించి కాదు ఈ వ్యాసం. సోషల్ మీడియా, ప్రధాన తెలుగు మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్) సహాయంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని నీటిపారుదల పథకాలపై వ్యాప్తి చేసిన, చేస్తున్న విరుద్ధమైన కథనాల గురించి వివరించి చెప్పడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. తెలంగాణలోని రైతులు, పరిశీలకుల మెదళ్లలో శాశ్వతంగా నిలిచిపోయేవి ఈ విరుద్ధ కథనాలే. ఉదాహరణకు కృష్ణా నీళ్లతో కుప్పం ప్రాంతంలోని చెరువులను నింపడం పట్ల ఏపీలో విజయోత్సవాలు చేసుకున్నారు. దీనిపై విస్తృత ప్రచారం జరిగింది. రైతుల్లో ఉత్సాహం, అక్కడి అధికార పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని కలిగించింది ఈ ఘటన. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ వార్త ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికే పరిమితమైంది. తెలంగాణ రైతులు, ముఖ్యంగా ప్రజలకు ఈ విషయం గురించి కనీస అవగాహన కూడా లేదు. తెలంగాణ వార్తాపత్రికల్లో ఈ వార్తను ప్రచురించకపోవడం, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ దృశ్యాలను చూపించకపోవడమే అందుకు కారణం. దీని వెనుక తెలంగాణ ప్రజలకు తెలియని పలు కారణాలున్నాయి.
ఇందుకు విరుద్ధంగా 2023కు ముందు తెలంగాణలో ఇలాంటి అద్భుతమైన మైలురాళ్ల గురించిన వార్తలు ఈర్ష్యతోనూ, సాధ్యాసాధ్యాలపై అనుమానాలతోనూ, అసలు ఇలాంటివి అవసరమా? అనే సందేహాలతోనూ ప్రచురితమయ్యాయి. సాగునీళ్లు అన్ని ప్రాంతాల రైతులకు జీవనాడి అయినప్పుడు ఏపీలో ఎందుకు ‘జలహారతి’ ఇస్తూ ఉత్సవాలు చేసుకుంటున్నారు? తెలంగాణలో ఎందుకు నిందలు వేస్తున్నారు? వ్యయం-ప్రయోజనాల విశ్లేషణ, విద్యుత్ భారం, నదీ బేసిన్ల వెలుపల నీటిని మళ్లించడం, సంబంధిత చట్టాలు లాంటి ప్రశ్నలను ఏపీ విషయంలో చాలా అరుదుగా లేవనెత్తుతారు. కానీ, తెలంగాణ విషయంలో మాత్రం రైతుల ప్రయోజనాలను విస్మరించేందుకు కూడా సాహసిస్తున్నారు. అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలు చేయడం, సర్కారుపై నిందలు వేయడం మొదలుకొని వాతావరణ మార్పుల వరకు వివిధ రకాల కథనాలను ఎలాంటి తడబాటు లేకుండా వ్యాప్తి చేస్తున్నారు.
తెలంగాణలో మీడియా కథనాల్లో సాగు విస్తీర్ణం, వరి సాగు వల్ల కార్బన్ ఉద్గారాల విడుదల గురించిన ఆందోళనలు, ఎకరం పంట పండించేందుకు అధిక సాగునీటి ఖర్చు, నీళ్లను ఎత్తిపోసేందుకు అత్యధిక విద్యుత్తు వ్యయం లాంటి అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కథనాలు చివరికి వరిపై ఎక్కువ నీళ్లను వాడే పంటగా ముద్రవేసేంత వరకు, వరి సాగును తగ్గించాలని సూచించేంత వరకు వెళ్లాయి.
రాష్ట్ర విభజన జరగకపోయి ఉంటే, తెలంగాణ రైతులకు వ్యవసాయం చేయడం తెలియదని, అందువల్ల వారికి సాగునీరు అవసరం లేదని సూచించే స్థాయికీ ఈ కథనాలు వెళ్లేవి. కానీ, వాస్తవానికి ఐదేండ్లలోనే వడ్ల ఉత్పత్తిలో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లిన తెలంగాణ రైతుల సామర్థ్యాన్ని ఈ ప్రపంచం చూసింది. నిజానికి తెలంగాణ రైతులు వరి సాగు చేయకుండా నిరుత్సాహపరచాలని కొంతమంది మేధావులుగా చెప్పుకొనేవారు ప్రయత్నించారు. డయాబెటిస్ కారణంగా ప్రజలు అన్నం తినడం లేదని, అందువల్ల తెలంగాణ రైతులకు సాగునీరు అందించే ప్రయత్నాలు అనవసరమని ప్రచారం చేశారు. ప్రధాన మీడియా సంస్థల మద్దతు ఉంటే ఎలాంటి నెరేటివ్‌ను అయినా సులువుగా ప్రచారం చేయవచ్చని అనడానికి ఇదే నిదర్శనం. పండించిన ధాన్యాన్ని పూర్తిగా వినియోగించే ఇతర మార్గాలను ప్రభుత్వం వెతకాలే తప్ప, వరి సాగు చేయవద్దని చెప్తారా? అని తెలంగాణ రైతులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పప్పు, కూరగాయలు, పండ్ల వంటి పంటలకూ వరికి ఇచ్చినట్టే మద్దతిస్తే, రైతులు ఇతర పంటలు పండించేందుకు సంకోచించరు.
ఇక అసలు విషయానికి వస్తే, ఏపీలో సాగునీటి కోసం అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తొలి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మధ్య వ్యత్యాసాలేమీ లేవు. ఈ రెండు రాష్ర్టాలు కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లను తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నాయి. అయితే, ఈ సారూప్యత ఇక్కడితోనే ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు మూడు కీలకమైన అంశాలను లేవనెత్తుతున్నారు. మొదటిది, తమ రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం శ్రీశైలం జలాశయం నుంచి ‘వరద లేదా మిగులు’ జలాలను ఉపయోగిస్తున్నామని ఏపీ చెప్తున్నది. కానీ, తెలంగాణ రైతులు ఈ వాదనను ఖండిస్తున్నారు. కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలు సాగు, తాగునీటి కోసం తండ్లాడుతున్నాయని, అలాంటప్పుడు ‘మిగులు’ అనే మాటెక్కడిదని, వాస్తవ పరిస్థితులను విస్మరిస్తూ ‘మిగులు, వరద జలాలు’ అనే మాట ఎత్తుకున్నారని తెలంగాణ రైతులు చెప్తున్నారు. రెండవది, క్షుణ్నంగా పరిశీలిస్తే ఏపీలోని హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాలు; తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలేనన్నది సుస్పష్టం. కానీ, వీటిని చూసే, ప్రచారం చేసే కోణం మాత్రం భిన్నం. ఏపీలో వీటిని ‘సుజల స్రవంతి’ పథకాలని కవితాత్మకంగా పిలుస్తున్నారు. దాంతో సామాన్య పాఠకుల్లో సానుకూల వైఖరి కలుగుతున్నది. తెలంగాణలో మాత్రం ‘లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు’గా అంటున్నారు. దీంతో ఇవి ఆర్థిక భారాన్ని మోపే ప్రాజెక్టులనే సందేశం ప్రజల్లోకి వెళ్తున్నది. మూడవది, తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రాంతాలకు సాగునీరు అందించినప్పటికీ.. ఏపీలోని కుప్పం ప్రాంతానికి జలాలు చేరినప్పుడు కనిపించిన ‘జలహారతి’ దృశ్యాలు, అలాంటి ఉత్సాహభరిత వాతావరణం, సానుకూలత చాలా అరుదుగా కాళేశ్వరం విషయంలో కనిపిస్తుంది.
(వ్యాసకర్త: ప్రొఫెసర్, సోషియాలజీ విభాగం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం)
(తరువాయి రేపటి సంచికలో..)
-చంద్రి రాఘవరెడ్డి