ఒలింపిక్స్‌లో నిర్వహించే 100 మీటర్ల పరుగు పందెంతో పాటు 4×100 రిలే పరుగు పందెం పోటీలను సైతం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులు
ఆసక్తిగా తిలకిస్తారు. 4×100 రిలేలో స్టార్టింగ్ లైను నుంచి పరుగు మొదలుపెట్టిన క్రీడాకారుడు తన వంతు 100 మీటర్ల పరుగు పూర్తికాగానే
బ్యాటన్‌ను తదనంతర క్రీడాకారుడికి అందిస్తాడు. ఆ బ్యాటన్ అందుకున్న క్రీడాకారుడు వాయువేగంతో ఫినిషింగ్ లైన్ దిశగా ముందుకు
పెరుగెత్తాలి. కానీ, 2023 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర అధికార బ్యాటన్‌ను అందుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి తిరోగమన దిశలో
పరుగెత్తడాన్ని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు.ఈ ధోరణి రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.
ప్రభుత్వాలు, పార్టీల ఇష్టాయిష్టాలను రాజకీయ ప్రయోజనాలకు అతీతం గా నిరంతరం పురోగమన దిశలో పయనించాల్సిన వ్యవస్థలకు ఈ స్పృహ కొరవడిన పక్షంలో ప్రజలు పరాజితులుగా మిగిలిపోతారు. రాబో యే విద్యుత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ప్రాజెక్టు రాష్ట్ర పురోగతిలో అత్యంత కీలకమైనది. తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టు మీద కొంతకాలంగా కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయి ఈ నెలలో జాతికి అంకితం కానుండటం శుభపరిణామం. దాన్ని ప్రారంభించకుండా తప్పించుకోవడం కాంగ్రెస్ సర్కార్‌కు సాధ్యం కాలేదు.
విద్యుత్తు రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల పట్ల ప్రస్తుత పాలకుల ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకోవడమే కాకుండా ప్రజల్లో గందరగోళ పరిస్థితుల ను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాల ను తెలుసుకోవాల్సిన అవసరమున్నది. 2018 జనవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు 24 గంటల కరెంటు అందుబాటులోకి రాగా, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందింది. దేశవ్యాప్తంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది.
ప్రస్తుతం నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మాణం పూర్తికావస్తున్న 4000 మెగావాట్ల మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ పూర్వాపరాలు, వాస్తవాలను చర్చించుకోవడం ఎంతైనా అవసరం. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, అందు లో థర్మల్ విద్యుత్తు వాటా 2,300 మెగావాట్లే. సాధారణంగా థర్మల్ విద్యుత్తును మనం బేస్లోడ్గా చెప్పుకొంటాం. ఎందుకంటే నీటి లభ్యత ఉన్నప్పుడే జల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. అలాగే సౌర విద్యుత్తు పగటి పూటే అందుబాటులోకి వస్తుంది. థర్మల్ విద్యుత్తును మాత్రమే నిరంతరాయంగా ఏడాది పొడవునా ఉత్పత్తి చేసుకోవడానికి వీలుంటుంది.
2014 జూన్ 2 నాటికి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న థర్మల్ విద్యుత్తు కేంద్రాలు:
కొత్తగూడెం 5వ దశ
2×250 మె.వా – 500 మె.వా
కొత్తగూడెం 6వ దశ
1×500 మె.వా – 500 మె.వా
కాకతీయ మెదటి దశ
1×500 మె.వా – 500 మె.వా
కొత్తగూడెం ఏ, బీ, సీ స్టేషన్లు
3×240 మె.వా – 720 మె.వా
రామగుండం ‘బీ’ – 62.5 మె.వా
మొత్తం సామర్థ్యం – 2,282.5 మె.వా
పైన పేర్కొన్న వాటిలో 40 శాతం వరకు కాలం చెల్లిన ప్లాంట్లే. రామగుండం ప్లాంట్లను 2020లో స్క్రాప్ చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మన రాష్ట్ర విద్యుత్తు డిమాండ్ 9,000 మెగావాట్లు కాగా.. విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన దిగువ సీలేరు 450 మెగావాట్ల ప్లాంట్లు ఆంధ్రాకు తరలిపోగా, నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మన వాటాగా రావాల్సిన 440 మెగావాట్లు అందకుండా ఆంధ్రా పాలకుడు చంద్రబాబు కుట్రతో విద్యుత్తు ఉత్పత్తి చేయకుండా నిలిపివేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో కోతలతో కరెంటు సరఫరా చేయడానికే 2,500 మెగావాట్లు లోటు ఉండగా, చంద్రబాబు మూలంగా 890 మెగావాట్ల మన విద్యుత్తు మనది కాకుండా పోయింది.
తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి రైతులు అలవిగాని కరెంటు కోతలతో అల్లాడిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర జెన్కోను పరిపుష్ఠం చేసి విద్యుత్తు ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా వేసిన ముందడుగు వైటీపీఎస్.
థర్మల్ పవర్ ప్లాంటును నెలకొల్పడానికి ప్రధానంగా కింద పేర్కొన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు.
కొత్తగూడెం మండలంలోని పునుకూడు చెల్క, పాల్వంచ మండలంలోని పాండురంగాపురం గ్రామాలనూ ప్రభుత్వం పరిశీలించింది. అయితే, ఇవి కేటీపీఎస్కు సమీపంలో ఉండటం, కిన్నెరసాని అభయారణ్యం ప్రాంతం కావడంతో వీటిని పరిగణనలోకి తీసుకోలేదు.
వైటీపీఎస్పై వచ్చిన ప్రధానమైన ఆరోపణలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రాజెక్టు వ్యయం ఎక్కువగా ఉందని, వైటీపీఎస్ పూర్తయ్యే నాటికి మెగావాట్ వ్యయం సుమారు రూ.8.63కోట్లకు చేరుతుందనేది వాటిలో ఒకటి. అయితే, ఎన్టీపీఎస్ ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలో భాగంగా రెండో దశ 800×3 = 2400 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌కు సంబంధించి ఇటీవల గ్లోబల్ టెండర్లను పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.29,345 కోట్లు. అంటే మెగావాట్‌కు రూ.12.23 కోట్లు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఇది రూ.14-15 కోట్లకు చేరవచ్చు. అంటే ఏ రకంగా చూసినా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాలకు లోబడే వైటీపీఎస్ పూర్తయ్యిందనే విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదు. నామినేషన్ పద్ధతిపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్కు దీని నిర్మాణ పనులను కట్టబెట్టారన్నది మరో ప్రధానమైన ఆరోపణ. అయితే, ఎన్టీపీఎస్ కూడా ఇటీవల బీహెచ్‌ఈఎల్‌కే ప్లాంట్ల నిర్మాణ పనులను కట్టబెట్టింది. అంతేకాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అదానీ నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ పనులను కూడా బీహెచ్‌ఈఎల్‌కే అప్పగించడం గమనార్హం.
బొగ్గు గనులకు సమీపంలో పిట్
హెడ్ ప్లాంట్‌ను నిర్మించాల్సిందనేది మరొక అభియోగం. ఇప్పటికే ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో 8000 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్లు ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉన్నాయి. డిమాండ్‌కు దూరంగా ఒకే ప్రాంతంలో ఉత్పత్తి కేంద్రాలుండటం అవాంఛనీయమే. ఎందుకంటే, ఆ ప్రాంతంలో కాలు ష్యం ఎక్కువవడమే కాకుండా పెద్ద ఎత్తున ఎక్స్ట్రా హై
టెన్షన్ లైన్లను నిర్మించడానికి భూ సేకరణ సమస్య కూడా ఉత్పన్నమవుతుంది.
దామరచర్ల యూనిట్ ధర.. పిట్ హెడ్ ప్లాంట్‌తో సరిపోల్చినప్పుడు బొగ్గు సరఫరా వ్యయం వల్ల యూనిట్ ధరపై 20 పైసల ఇంపా క్టు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా కేటీపీఎస్, బీటీపీఎస్, కేటీపీపీ, రామగుండం థర్మల్ స్టేషన్, సింగరేణి ఆధ్వర్యంలోని జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్, ఎన్టీపీసీ రామగుండం.. తదితర అన్నీ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు గోదావరి పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయే ప్రమాదముంటుంది.
పై విషయాలను పరిగణనలోకి తీసుకున్నట్టయితే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని దక్షిణ తెలంగాణలో, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి సమీపంలో నెలకొల్పడం ఎంతమాత్రం అవాంఛనీయం కాదు.
-తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313