‘దసరా పండుగ వచ్చే దమ్మిడి చేతుల లేదు, దీపావళి వస్తుంది దీపంత లేదాయే, నీ బతుకంత అమావాస్య లచ్చుమమ్మో లచ్చుమమ్మా..’అని ప్రజా యుద్ధనౌక గద్దర్ రాసిన పాటలోని ఈ వాక్యాలు నేడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితులకు సరిగ్గా సరిపోతున్నాయి. గద్దర్ కేవలం రైతు కూలీ లచ్చుమమ్మ జీవితాన్ని ఉద్దేశించి రాసినప్పటికీ, నేడు రాష్ట్రంలో రైతు కూలీ నుంచి మధ్యతరగతి ఉద్యోగుల దాకా అందరిదీ అదే పరిస్థితి. ఆ పాటలోని వాక్యాలు ఇప్పుడు అందరికీ అన్వయించేలా ఉన్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఉద్యోగులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వేతనాలను గణనీయంగా పెంచింది. దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులను నిలిపింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మధ్యంతర భృతి తర్వాత ఇంతవరకు ఉద్యోగుల వేతనాల్లో ఒక్క రూపాయైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయా యి. అయినా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదు. నమ్మి ఓట్లేసిన పాపానికి నగుబాటు పాలయ్యామనే బాధ అందరిలోనూ వ్యక్తమవుతున్న ది. రైతులకు ఇచ్చిన హామీల్లో రైతు భరోసా నుంచి ధాన్యానికి బోనస్ దాకా అంతా బోగస్‌గా మారిపోయింది. రుణమాఫీని రూ.49 వేల కోట్ల నుంచి రూ.31 వేల కోట్లకు తగ్గించి, బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే పెట్టి, చివరికి కేవలం రూ.17 వేల కోట్లకు కుదించి లక్షలాది రైతుల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇటీవల ఎస్బీఐ నుం చి ఆర్టీఐ ద్వారా మాజీ మంత్రి హరీశ్‌రావు తీసుకున్న సమాచారం ద్వారా రుణమాఫీకి సంబంధించిన అసలు వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. ఇం తకాలం రుణమాఫీ పూర్తయిందని బొంకిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇటీవల ప్రధానికి రాసిన లేఖలో 46 లక్షల మంది రైతులకు గానూ 22 లక్షల మందికే రుణమాఫీ చేసినట్టు స్వయంగా అంగీకరించారు.
ఇక కౌలు రైతుల సమస్యనైతే పూర్తిగా కొండెక్కించారు. బీఆర్ఎస్ హయాంలో కౌలురైతులకు రైతుబంధు ఇవ్వాలని గట్టిగా మాట్లాడిన నోళ్లు ఇప్పు డు మాట మాత్రంగానైనా పెగలటం లేదు. మరోపక్క రైతు భరోసా ఇవ్వాల్సింది కౌలురైతుకా? లేదా భూమి కలిగిన రైతుకా? అనేది వారే తేల్చుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి లేని ఘర్షణకు ఆజ్యం పోశారు. మహిళలకు ప్రతి నెల రూ.2,500 భృతి ఇస్తామన్న హామీ ప్రభుత్వానికి స్మృతిలో కూడా ఉన్నట్టు లేదు. దివ్యాంగులు, వృద్ధులకు పింఛను పెంపు గురించిన ప్రస్తావనే లేదు. 200 యూనిట్ల ఉచిత కరెంటు పొందే అర్హుల సంఖ్య నెలనెలా తగ్గిపోతున్నది. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, కల్యాణలక్ష్మితో పాటు ఇస్తామన్న తులం బంగారం తుస్సుమన్నా యి. ఇక నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నీరుగారిపోయాయి. 25,000 పోస్టులతో వేస్తామన్న మెగా డీఎస్సీని 11 వేలకే పరిమితం చేసి దగా డీఎస్సీగా మార్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి, వాటిని తమ ఖాతాలో వేసుకొని 30 వేల ఉద్యోగా లు ఇచ్చినట్టు చెప్తూ కాంగ్రెస్ సర్కార్ దారుణమైన మోసానికి పాల్పడుతున్నది. ఉత్త తేదీలే తప్ప జాబులే లేని జాబ్ క్యాలెండర్ ప్రకటించడం నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ చేసిన క్రూరమైన పరిహాసం.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఉద్యమించిన నిరుద్యోగులను నిర్బంధించటమే కాకుండా పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఏ లైబ్రరీ చుట్టూ తిరిగి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులకు ఆశలు కల్పించారో, అదే లైబ్రరీలో పోలీసులు చొరబడి నిరుద్యోగులపై లాఠీచార్జీ జరపటం కాంగ్రెస్ కపటనీతికి నిదర్శనం. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఎండమావేన ని తేలిపోవటంతో నిరుద్యోగుల నిరసన పర్వం ప్రారంభమైంది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులపై ఎదురుదాడులు, నిర్బంధాలు సర్వసాధారణమైపోయాయి. చివరికి శాసనసభ్యులను సైతం అరెస్టు చేసి పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పే దుర్మార్గానికి ఒడిగడుతున్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులది మింగ లేని, కక్కలేని పరిస్థితి. కాంగ్రెస్ మార్క్ మార్పును నమ్మి ఓటు వేసిన పాపానికి ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ‘చెప్పుకొంటే మానం బాయె, చెప్పకుంటె పానం బాయె’ అనే తీరుగా ఉద్యోగు లు మథన పడుతున్నారు. 4 విడతల కరువుభ త్యం తక్షణమే విడుదల చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డిని కలిసి గుర్తుచేసే అవకాశం కూడా లేకపోవడమే కాంగ్రెస్ తెచ్చిన పెద్ద మార్పు. 1వ తారీఖున అందరికీ వేతనాలు ఇస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ నిజానికి కొందరికే ఇస్తున్నది.
లక్షల మంది ఉద్యోగులకు నెలల తరబడి అసలు వేతనాలే ఇవ్వకుండా వేధిస్తున్నది. ముఖ్యంగా తక్కువ వేతనాలతో బతుకు వెళ్లదీసే చిరుద్యోగులు పండుగ పూట కూడా చేతుల పైసా లేక అవస్థలు పడుతున్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాల చెల్లింపులో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. డిగ్రీ కాలేజీ కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులు రెన్యువల్ కాకపోవడంతో వేతనాలు రాక, వారంతా ‘అలో లక్ష్మణా’ అని అలమటిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో తమ ఆటపాటలతో జనాలను చైతన్యపరిచిన కళాకారులకు గత ప్రభు త్వం ఉద్యోగాలిచ్చి గౌరవించింది. సాంస్కృతిక సారథి కింద పనిచేసున్న 550 మంది కళాకారులకు కాంగ్రెస్ వచ్చినంక 4 నెలల జీతం బకాయి పడింది. ఈ మధ్య ఒక నెల జీతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని సద్దుల బతుకమ్మకు సర్దుకొమ్మన్నారు. పలు డిపార్టుమెంట్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణం. గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులకు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు ఆరు నెలలుగా జీతాలు లేవు.
గత పది నెలలుగా ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క బిల్లు పాస్ కావడం లేదు. సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు తమ జేబులోంచి ఖర్చు చేస్తూనో, అప్పు చేసో పిల్లల కడుపు నింపుతున్నారు. ప్రభుత్వం నిధుల విడుదలలో చేసిన, చేస్తున్న జాప్యం, విద్యార్థుల కు, వార్డెన్లకు అనేక కష్టాలను తెచ్చిపెడుతున్నది. పంచాయతీ కార్యదర్శులదీ ఇదే పరిస్థితి. పారిశుద్ధ్య పనుల కోసం వాళ్లు సొంత డబ్బులు వినియోగించాల్సి వస్తున్నది.
గత మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన బెనిఫిట్లను నిరవధికంగా పెండింగ్‌లో పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఈ రకమై న దిక్కుమాలిన పరిస్థితి చరిత్రలో ఎన్నడూ లేదు. వయసు మీద పడి, బాధ్యతలు తీరక రిటైర్మెం ట్ డబ్బుల కోసం ఆశగా ఎదురుచూసే వారికి తీవ్ర నిరాశ ఎదురవుతున్నది. జూలై 23 నుంచి రావాల్సిన పే కమిషన్ రిపోర్ట్ ఏమైందో తెలియనే తెలియదు.
ఆరు నెలల్లో నూతన పీఆర్సీ అమలుచేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు వీడని గ్రహణం పట్టింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం పడకేసింది. ఏ ఆసుపత్రి కూడా ఉద్యోగులకు ఈ పథకం కింద వైద్యం అందించడం లేదు. వైద్యఖర్చుల వల్ల లక్షల రూపాయల ఆర్థికభారం మీదపడి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నాపట్టించుకునే నాథుడు లేడు.
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అది చెవిటివాని ముందు శంఖమూదినట్టే. నాలుగు విడతల కరువు భత్యం ఇవ్వాల్సి ఉండగా దసరా సందర్భంగా ఒక విడతై నా ఇవ్వాలని ఉద్యోగులు చేస్తున్న అభ్యర్థన అర ణ్య రోదనగా మారుతున్నది. చిరుద్యోగులు కన్నీ రు పెట్టుకొని కాళ్లా వేళ్లా పడుతున్నా కనికరించడం లేదు. కోరి కోరి కాంగ్రెస్‌ను కొని తెచ్చుకుని కొరివితో తల గోక్కున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయు లు వాపోతున్నారు. పది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభు త్వం ఉద్యోగుల ఆగ్రహానికి గురికావడం ఖాయమని తేలిపోతున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల లో ఉద్యోగులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వేతనాలను గణనీయంగా పెంచింది. దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులను నిలిపింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మధ్యంతర భృతి తర్వాత ఇంతవరకు ఉద్యోగుల వేతనాల్లో ఒక్క రూపాయైనా కాంగ్రెస్ పెంచింది లేదు. ఇప్పటికైనా వెంటనే ఉద్యోగ సం ఘాలతో సంప్రదింపులు జరిపి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను వెంటనే దూరం చేయాలి. లేకపోతే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో దాగి ఉన్న ఆగ్రహం బద్దలు కావటం ఖాయం.
(వ్యాసకర్త: ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్)
-జి.దేవీప్రసాద్