తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సంక్షేమం అందని గడప లేదు. అభివృద్ధికి నోచుకోని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు. దేశంలో ఎక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డా తమ పార్టీ వీర విధేయులకు, బంధుగణానికి అప్పనంగా ప్రభుత్వ సొమ్మును ఏదో రూపంలో ధారాదత్తం చేయాలనే తాపత్రయమే కనిపిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యావత్ రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ తమ కుటుంబంగా భావిస్తూ కన్న పిల్లల్లా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది కాదనలేని సత్యం.
గతంలో రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన పార్టీలు ఏ పని చేయాలన్నా ఢిల్లీ ఆదేశాలు తీసుకోవలసిందే. మన రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చే నిర్ణయాలకు ఢిల్లీ ఆమోదం తెలిపే దౌర్భాగ్యం మళ్ళా మనకు అవసరమా? కానీ తెలంగాణ చైతన్యాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు మళ్ళా దాపురించాయి. ఇలాం టి సమయంలో మన ప్రజలు మేల్కొలుపుగా, ఎటువంటి మేర్వాణం లేకుండా, కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన తరుణమిది. తెలంగాణ తల్లుల కడుపు కోతకు కారణమైన ఢిల్లీ తల్లి మన తెలంగాణకు ఎప్పటికైనా సవితి తల్లే కానీ, కన్న తల్లి ఎట్లా అయితదనే ఎరుక ప్రతి తెలంగాణ తల్లులకు తెలియనిది కాదు.
మనం గత కొద్ది రోజులుగా గమనిస్తే కేవలం పార్టీ టిక్కెట్ల నిర్ణయమే ఢిల్లీ పెద్దల భిక్ష అనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ఇంకా కొనసాగిస్తున్నది. రాష్ట్ర లీడర్లు ఢిల్లీ వీధుల్లో తమ అభ్యర్థులను టికెట్ల కోసం భిక్షాటన చేయిస్తున్నారు. ‘ఢిల్లీ బహుత్ దూర్ హై’ అన్నది అక్షర సత్యం. ఇది కొంచెం లోతుగా గమనిస్తే ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే, ఏదైనా మన అవసరాలకు, తీసుకునే నిర్ణయాలకు కూడా ఫైళ్లు పట్టుకొని ఢిల్లీ వెళ్లాల్సిందే. కానీ ఇక్కడ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులను తెలంగాణ ఒప్పుకోదని అనుభవంలోకి వచ్చింది.
ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రంలో వనరులన్నీ ఆంధ్ర కాంగ్రెస్ లీడర్లు దోచుకుపోతుంటే నోరు మెదపని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో చక్రం తిప్పుతామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉన్నది. తమకు అధికారం రాకపోయేసరికి ప్రజలను భ్రమల్లోకి నెట్టి తెలంగాణను స్వాధీనం చేసుకోవాలనే అత్యాశతో ఉన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఇది. వారి కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయం ఉదయపూర్ డిక్లరేషన్‌కే దిక్కు దివాణం లేని పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రజల మనసు గెలువలేక, ఇక్కడ ఓటర్లను కొనేందుకు కర్ణాటక కమీషన్ డబ్బులను కట్టలుగా తరలించాలనే ప్రయత్నం విఫలమైన సందర్భం సాక్ష్యంగా నిలిచింది.
బీసీలను ఓర్వలేని తనంలో ఉన్న ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, ఒక్కప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించి హుందాగా రాజకీయాలు చేసిన బీసీ లీడర్ పొన్నాల లక్ష్మయ్యను అవమానించిన తీరు ఆయన అహంకారానికి నిదర్శనం. ఆ అవమానాలను ధిక్కరించి ఆ విష వలయం నుంచి బయటకు వస్తే , సిగ్గుండొద్దా అంటూ కించపరిచే వాఖ్యలు, ఓడిపోయిన వాడు అంటూ, చచ్చే ముందు ఏం రోగం వచ్చిందనే చౌకబారు విమర్శలు చూస్తే పెద్ద వారిపై రేవంత్‌కు ఉన్న గౌరవం ఏంటో తేటతెల్లమవుతుంది.
పురాణాల్లో మనం చదివిన కథలో భస్మాసురుడు అనే రాక్షసుడు, శివుడు ఇచ్చిన వరాన్ని వాడుకొని ఎవరి తలపై చెయ్యి పెట్టినా వారు కాలి బూడిదయ్యే శక్తిని సంపాదించాడు. ఆ రాక్షసుడు యావత్ ప్రపంచానికి కీడుగా, చీడగా మారితే దేవతలు ఎలా నిలువరించాలనే క్రమంలో శ్రీ మహా విష్ణువు మోహిని అవతారం ఎత్తి భస్మాసురుడు తన తలపై తానే చేయి పెట్టుకునేలా చేసి వాడిని బూడిద చేస్తాడు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న భస్మాసురుడు అనే రాక్షసుడు పీసీసీ పదవి అనే వరం ఇవ్వగానే పాత కాంగ్రెస్‌ను ఖతం పెట్టే పనిలో నిమగ్నమయ్యాడు. దీన్ని నిఖార్సయిన కాంగ్రెస్ క్యాడర్ గమనించాల్సిన అవసరం ఉన్నది! ఇతన్ని ఓటర్లంతా ఓటు అనే ఆయుధంతో కొట్టక పోతే తెలంగాణను బూడిద చేయడం ఖాయం.!
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నారంట వెనుకట, ఏమిట్లకు ఏమి కాకముందే ఏకంగా డిసెంబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అంటూ రేవంత్ ఇంటి పార్టీ లెక్క ప్రకటన చేసుకొంటున్నాడు. అంతే కాదు సీఎంగా తొలి సంతకం ఏదో పెడతాననే భ్రమల్లో బతుకుతున్న రేవంత్ రెడ్డిని చూసి తెలంగాణ నవ్వుకుంటున్నది. ముందల మురిసినమ్మ పండగ పబ్బం ఎరుగదని తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందిన సామెత రేవంత్‌కు సరిగ్గా సెట్ అవుతుంది. నిరుద్యోగులకు ఏకంగా తొలి నియామక పత్రం అందజేస్తామని నమ్మబలికే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం. ఇకపోతే నిన్న కాక మొన్ననే కర్ణాటకలో అలవి గాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని నిలబెట్టుకోలేక జనం ముందు నవ్వుల పాలవుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణలో కూడా ఇవే మాయ మాటలు చెప్పి గద్దెనెక్కే ప్రయత్నాన్ని ప్రజలు అప్రమత్తంగా ఉండి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఉన్నది.
ఇదే తెలంగాణ ప్రభుత్వం తన తాహతుకు తగ్గ ట్టు సంక్షేమ పథకాలను పెంచుకుంటూ వస్తున్నది. అభివృద్ధి చేస్తున్న తీరు ప్రజలకు అనుభవంలో ఉన్నదే. ఏదో ఓట్లకోసమో, జనం మెప్పుకోసమో అని మ్యానిఫెస్టోను పెట్టలేదు. ఆచరణాత్మకంగా అమలు చేసిన వాటి నే, ఇంకింత ముం దుకు ఇంతకు ఇంత, మనకు కలిగినంత లో సంక్షేమం పంచుకుందాం అనే ప్రపోజల్‌ను కేసీఆర్ ప్రజ ల ముందుంచారు. అలవిగాని హామీలు ఇవ్వకుండా అమలు చేసే వాటినే ముందు ంచారు దాన్ని అం దరం స్వాగతిద్దాం.
ముఖేష్ సామల
9703973946