తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు తొమ్మిదేండ్లు పూర్తికావస్తున్నది. 2014 జూన్ 2న ముఖ్యమంత్రిగా కేసీఆర్ నేతృత్వంలో తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. నాటి నుంచి నేటి దాకా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యవసాయరంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్నది. దేశ వ్యవసాయరంగంపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేశ్‌చంద్ ఒక నివేదిక (2011-12 నుంచి 2019-20 వరకు) విడుదల చేశారు. దాని ప్రకారం తెలంగాణ వ్యవసాయరంగం తలసరి ఆదాయ వృద్ధిలో 6.5 శాతం వృద్ధి సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచింది.
ఒక వేదిక పేరుతో కొన్ని పత్రికలు, టీవీలు, ఇక్కడున్న చేవ చచ్చిన వ్యక్తులు, సంస్థలు, పార్టీలు వారిచ్చే అంకెలు, అంచనాలు వాడుకోవడం కంటే దివాళాకోరుతనం మరోటి లేదు. ఇంతకంటే భావదారిద్య్రం మరొకటి ఉండదు. గతం కంటే మెరుగైన జీవన ప్రమాణాలతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఓర్వలేక చేసే ఇలాంటి కుయుక్తులను చైతన్యవంతులైన తెలంగాణ రైతాంగం తిప్పికొట్టడం ఖాయం.
దేశంలో అతి చిన్న రాష్ట్రమైన సిక్కిం 6.87 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. అంటే పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణనే నెంబర్ వన్. రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి ఇది తాజా ఉదాహరణ. ఈ వాస్తవాన్ని తెలంగాణ వ్యతిరేకశక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని పత్రికల అండతో తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వ్యవసాయరంగం నిర్లక్ష్యానికి గురైంది. నాటి పాలకులు కరెంటు సరఫరా, సాగు నీటిరంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ఓ వైపు పంట రుణాలు లభించక, విత్తనాలు, ఎరువులు సరైన సమయానికి అందక రైతులు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు లబోదిబోమని మొత్తుకున్నారు. ఫలితంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మనోైస్థెర్యాన్ని కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టారు. రైతులను అప్పుల ఊబి నుంచి కాపాడేందుకు పంట రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీనికి నిదర్శనం నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక.
ఎన్సీఆర్బీ చూపించే ప్రతి రైతు ఆత్మహత్యకు కారణం వ్యవసాయం మాత్రమే కాదు, ఇతర కారణాలూ ఉంటాయి. వృత్తిరీత్యా వ్యవసాయ, అనుబంధ రంగాలలో పనిచేస్తారు కాబట్టి వాటిని కూడా రైతుల ఆత్మహత్యలుగానే పరిగణిస్తారు. అయినప్పటికీ, రాష్ట్రంలో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది.
పార్లమెంటుసాక్షిగా కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని ప్రకటించింది. ఈ తగ్గుదలకు ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్యం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలే. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, సాగునీటి లభ్యత, పంట రుణమాఫీ, వరి ధాన్యం సేకరణ వంటి పథకాలు అందులో భాగమే. తెలంగాణ ప్రభుత్యం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన అద్భుత పథకం ‘రైతు బీమా’. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణం చేత మరణించినా వారం లోపే ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహా యం అందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి ఇప్పటివరకు 95,399 మంది రైతు కుటుంబాలకు రూ.4,769.95 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది.
అయితే… రైతు స్వరాజ్య వేదిక అనే అనధికారిక సంస్థ 2022లో ఇప్పటికే 512 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చెబుతున్నది. ఈ సంస్థలో ఉండే సభ్యులెంత మంది, సిబ్బంది ఎవరు, వారికి ఉన్న నైపుణ్యం ఏమిటి? ఈ సంస్థ ఇస్తున్న నివేదికల ప్రామాణికత ఏమిటి? గొప్పగా చెప్పుకొనే కొన్ని పత్రికలు, టీవీలు వీరిని ఉటంకిస్తాయి. వీరికి తెలంగాణ వ్యతిరేకత, రైతు వ్యతిరేకత ఎంతగా ఒంటపట్టిందో వీటిని చూస్తే అర్థమవుతుంది.
రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు: కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేసి తమ నిరసన తెలిపారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు మరణించారు. వారి కుటుంబాలకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించింది తెలంగాణ ప్రభుత్వం. సంయుక్త కిసాన్ మోర్చా నేతలు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఈ సంఘాలు, వ్యక్తులు తెలంగాణ ప్రభుత్య వైఖరిని వక్రీకరించి అసత్యాలు ప్రచారం చేశారు. ఇది వారి వక్రబుద్ధికి తార్కాణం. రైతులకు ఇచ్చిన చెక్కులు సమయం దాటిపోతే చెల్లవని అందరికీ తెలుసు. మళ్లీ వాటిని రీ-వ్యాలీడేట్ చేయించాలి. కొంతమందికి చెక్కు సమయమైపోయి బ్యాంకు చెల్లించనందుకు కూడా తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారు ఈ ప్రబుద్ధులు.
24 గంటల ఉచిత విద్యుత్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా’ పథకానికి ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. రైతులకు నిరంతరాయం గా విద్యుత్ అందుతున్నది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంటలను పండించుకుంటున్నారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రైతాంగానికి 24 గంటల కరెంటును ఉచితంగా అందిస్తుంటే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి కొందరు ‘ఇంత అవసరమా?’ అని దీర్ఘాలు తీస్తుండటం సిగ్గుచేటు.
రైతు రుణమాఫీ: రాష్ట్రం ఏర్పడగానే 35.31 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.16,144.10 కోట్ల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో అప్పుల ఊబి నుంచి రైతులు విముక్తి చెందారు. రెండవసారి ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా లక్ష రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు లక్ష కోట్ల నష్టం వాటిల్లింది. అయినా ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.50 వేల రుణమాఫీ చేసింది.
సాగునీరు: కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను అత్యంత తక్కువ సమయంలో అభివృద్ధి చేసింది. కేవలం ఎనిమిదేండ్లలో ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా సుమారు 46 వేల చెరువులను పునరుద్ధరించింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి మూడేండ్ల రికార్డు సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన ‘కాళేశ్వరం’ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఈ చర్యలన్నింటి ద్వారా ప్రభుత్వం మొత్తంగా కోటి ఎకరాల భూమికి సాగునీటిని అందిస్తున్నది. తద్వారా రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగిన మాట వాస్తవం కాదా? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న భూమి, నీటి శిస్తులను రద్దు చేసింది. దీంతో రైతులకు ఊరట కలిగింది. ‘మిషన్ కాకతీయ’ ద్వారా బాగుపడ్డ చెరువులకు అవార్డులు, రివార్డులు వస్తుంటే తెలంగాణ సాగునీటి పాలసీని ప్రపంచంలోని ప్రముఖులు మెచ్చుకుంటున్న విషయం తెలంగాణ వ్యతిరేకులు మరిచిపోకూడదు.
24 గంటల ఉచిత విద్యుత్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా’ పథకానికి ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. తద్వారా రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందుతున్నది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రైతులు పంటలను పండించుకుంటున్నారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రైతాంగానికి 24 గంటల కరెంటును ఉచితంగా అందిస్తుంటే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి కొందరు ‘ఇంత అవసరమా?’ అని దీర్ఘాలు తీస్తుండటం సిగ్గుచేటు.
రైతుబంధు: ఈ బృహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో ప్రవేశపెట్టారు. నాటినుంచి నిరంతరాయంగా ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం 10 విడుతల్లో రూ.65,481 కోట్లను సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇందులో 99 శాతం సన్న, చిన్నకారు రైతులు ప్రయోజనం పొందుతుంటే విపక్షాలకు మింగుడు పడటం లేదు. దీనిపైనా విషప్రచారం చేస్తున్నారు. 2019లో కేంద్రం దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ద్వారా 11.84 కోట్ల రైతులకు పంట పెట్టుబడి సహాయం అందిస్తామని గొప్పలు చెప్పింది. 2022లో ఆ సంఖ్యను 3.87 కోట్ల మంది రైతులకు కుదించింది. ఈ విషయం ఏ పత్రికలూ పట్టించుకోవు, ఏ టీవీలూ చూపించవు. ఈ తెలంగాణ రైతు వ్యతిరేక వేదికలకు మాట పెకలదు. ఎందుకంటే ఇవి కేంద్రానికి బానిసలు కదా! ఆ మాత్రం విశ్వాసం ఉండకుంటే ఎలా?
పెరిగిన పంటల విస్తీర్ణం, ఉత్పాదకత, పంటల కొనుగోళ్లు: రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టడం వల్ల సాగు విస్తీర్ణం సాలీన 131 లక్షల ఎకరాల నుంచి 200 లక్షల ఎకరాల పైచిలుకుకు చేరుకున్నది. అదే సమయంలో వరి ధాన్యం ఉత్పత్తి సుమారు 100 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 308 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. వరి దిగుబడి ఎకరానికి 21 క్వింటాళ్ల నుంచి 27 క్వింటాళ్లకు పెరిగింది. ప్రభుత్వం ప్రతి పంటకాలంలో 7,000 కొనుగోలు కేంద్రాలను తెరిచి గ్రామగ్రామాన రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరిస్తున్నది. అయినా కళ్ళుండి చూడలేని కబోదులు తెలంగాణ ప్రభుత్వంపై విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు. 2014లో మన రాష్ట్రం నుంచి భారత ఆహారసంస్థ 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే.. అదే 2021లో 141 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఈ గణనీయమైన వృద్ధి తెలంగాణ ప్రభుత్యం చేపట్టిన రైతు సంక్షేమ పథకాల విజయానికి తార్కాణం.
పత్తి మద్దతు ధర: పత్తి మద్దతు ధర విషయానికి వస్తే… అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఇది కూడా తెలువని అజ్ఞానులు కొందరు విష ప్రచారం చేస్తూ
రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీరి దురుద్దేశాన్ని ప్రజలు, రైతులు గమనిస్తూనే ఉన్నారు. ఆ ప్రజలే వీరికి సరైన సమయంలో, సరైన రీతిలో బుద్ధి చెప్తారు.
స్వచ్ఛంద సంస్థల ముసుగులో దేశవిదేశాల నుంచి విరాళాలు తీసుకుంటూ పబ్బం గడుపుకొంటున్న ఇలాంటి సంస్థలు, రైతు శ్రేయస్సు కోసం నిరంతరం పాటు పడుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని చూడటం దురదృష్టకరం. ఒక వేదిక పేరుతో కొన్ని పత్రికలు, టీవీలు, ఇక్కడున్న చేవ చచ్చిన వ్యక్తులు, సంస్థలు, పార్టీలు వారిచ్చే అంకెలు, అంచనాలు వాడుకోవడం కంటే దివాళాకోరుతనం మరోటి లేదు. ఇంతకంటే భావదారిద్య్రం మరొకటి ఉండదు. గతం కంటే మెరుగైన జీవన ప్రమాణాలతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇదిచూసి ఓర్వలేక చేసే ఇలాంటి కుయుక్తులను చైతన్యవంతులైన తెలంగాణ రైతాంగం తిప్పికొట్టడం ఖాయం. విష ప్రచారాలు, తప్పుడు లెక్కలు చెప్తే ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు. ఇకనుంచి చట్టపరమైన చర్యలూ తీసుకుంటుంది.
(వ్యాసకర్త: ఎమ్మెల్సీ, తెలంగాణ ‘రైతుబంధు సమితి’ అధ్యక్షులు)
డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి