విప్లవాత్మక భూ సంస్కరణలకు ఆద్యుడు.. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు చరణ్‌సింగ్. చిన్న, సన్నకారు రైతుల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడాయన. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి రెండు సార్లు సీఎంగా, భారత ఐదో ప్రధానిగా సేవలందించిన చౌదరీ చరణ్‌సింగ్ రైతుల అభ్యుదయం కోసం నిరంతరం కృషి చేశారు. అందుకే ఆయన జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా ఏటా మనం జరుపుకొంటున్నాం.
Charan Singh | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో 1902 డిసెంబర్ 23న జన్మించిన చరణ్‌సింగ్ దేశ ప్రధాని స్థాయికి ఎదిగారు. యూపీకి సీఎంగా సేవలందించిన ఏకైక జాట్ నేతగా రికార్డు సృష్టించారు. యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లోని రైతు సంఘాలు ఇప్పటికీ చరణ్‌సింగ్ చూపిన బాటలోనే నడుస్తున్నాయంటేనే ఆయన ఎంతటి మహనీయుడో అర్థం చేసుకోవచ్చు.
మహాత్మాగాంధీ భావాలకు ప్రభావితమై, ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడైన చరణ్‌సింగ్ స్వాతంత్య్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. రాజకీయాల్లో ఉంటేనే పేదలు, రైతులకు సేవ చేయగలనని భావించిన ఆయన చిన్న వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. 1937లో స్వాతంత్య్రానికి పూర్వమే శాసనసభ్యుడిగా ఎన్నికై రైతులకు అండగా నిలిచారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రైతు కుటుంబంలో పుట్టి, మట్టి మనిషిగా పెరిగిన చరణ్‌సింగ్ అన్నదాతల కోసమే అహర్నిశలు శ్రమించారు. యూపీ మొదటి ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ పంత్ క్యాబినెట్లో రెవెన్యూ మంత్రిగా సేవలందించి జమిందారీ వ్యవస్థ నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేశారు. దున్నేవాడికే భూమి దక్కాలని చెప్పే చరణ్‌సింగ్.. రైతులకే భూ యాజమాన్య హక్కులు సిద్ధించేలా చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఉత్తర భారత్‌లో ప్రధాన రైతు సామాజిక వర్గాలైన జాట్, యాదవ్, గుజ్జర్, కుర్మి, ముస్లిం వర్గాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
కాంగ్రెస్‌లోనే ఉంటూ దేశ తొలి ప్రధాని నెహ్రూ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, గ్రామీణ వ్యవస్థకు హాని కలిగించే ప్రభుత్వ వైఖరిపై గళమెత్తిన ధీశాలి చరణ్‌సింగ్. రామ్మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్, నానాజీ దేశ్‌ముఖ్ తదితరుల మద్దతుతో 1967లో కాంగ్రెసేతర తొలి యూపీ సీఎంగా ఎన్నికయ్యారు. అతితక్కువ కాలమే సీఎంగా పనిచేసిన చరణ్‌సింగ్ భూసంస్కరణలను తీసుకొచ్చారు. 1977లో జనతా పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో అడుగుపెట్టారు. అనతికాలంలోనే చరణ్‌సింగ్ అడుగులు ప్రధాని పీఠం దిశగా సాగాయి. జనతా పార్టీ (సెక్యులర్) చైర్మన్ రాజ్ నారాయణ్ మద్దతుతో 1979లో ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అయితే ఇందిరాగాంధీ మద్దతును ఉపసంహరించుకోవడంతో 23 రోజులకే చరణ్‌సింగ్ ప్రభుత్వం కూలిపోయింది.
యూపీ, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లలోని 160 అసెంబ్లీ సీట్లు, 40కి పైగా లోక్‌సభ స్థానాల్లో చరణ్‌సింగ్ సామాజికవర్గమైన జాట్ల ప్రభావం ఉంటుంది. ఎక్కువగా వ్యవసాయం చేస్తూ పొట్టపోసుకునే ఆ సామాజికవర్గానికి చరణ్‌సింగ్ ఆరాధ్య దైవం. రైతులకు ప్రాతినిధ్యం వహించిన ఆయనకు భారతరత్న వరించడం హర్షణీయం. అయితే రైతును రాజును చేయాలనే చరణ్‌సింగ్ ఆశయ సాధన దిశగా ప్రభుత్వాలు అడుగులు వేసినప్పుడే ఆయనకు అసలైన నివాళి అవుతుంది.
– మాలోతు సురేశ్, 98856 79876