‘నా గొడవ’… అంటే మన గొడవ!
అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.‘అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు’ అని ఏ తెలంగాణ వైతాళికుడు అన్నరో, ఆయన రాసిన ‘నా గొడవ’ను రేవంత్ రెడ్డి చంద్రబాబుకు బహూకరించడం ఒక వైచిత్రి. అసలు అందులో ఏమి ఉన్నదో ఇచ్చినాయనకు తెలియకపోవచ్చు; అందులో ఉన్నది తమను ఏమి చేసిందో, మరింకేమేమి చేయగలదో తీసుకున్నాయనకూ తెలియకపోవచ్చు.
చంద్రబాబు నాయుడుతో మనకు తీరని గొడవ ఉన్నది కాబోలు! నాదేమీ కుట్ర సిద్ధాంతం కాదు! తెలంగాణ ఇపుడు జాగరూకతతో ఉండవలసిన అవసరం ఉన్నదని మరింతగా నొక్కి చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం. ముఖ్యంగా చంద్రబాబు ప్రతినిధి తెలంగాణను పాలిస్తున్నపుడు మనం మరింత అలెర్ట్‌గా ఉండాలె! కుట్ర సిద్ధాంతాలకు విరుగుడే ‘నా గొడవ’, అదే, కాళోజీ గొడవ!
అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.‘అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు’ అని ఏ తెలంగాణ వైతాళికుడు అన్నరో, ఆయన రాసిన ‘నా గొడవ’ను రేవంత్ రెడ్డి చంద్రబాబుకు బహూకరించడం ఒక వైచిత్రి. అసలు అందులో ఏమి ఉన్నదో ఇచ్చినాయనకు తెలియకపోవచ్చు; అందులో ఉన్నది తమను ఏమి చేసిందో, మరింకేమేమి చేయగలదో తీసుకున్నాయనకూ తెలియకపోవచ్చు.
తెలంగాణ వాళ్లు పొద్దున్నే లేవరని, ఎన్టీఆర్ వల్లనే వరి అన్నం తినటం నేర్చుకున్నారనటం దగ్గరి నుంచీ… అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించే దాక పోయిండు చంద్రబాబు! ఈ అహంకారానికి ఆత్మగౌరవ సమాధానమే కాళోజీ ‘నా గొడవ’. అందులో ఏముందో తెల్వక రేవంత్ రెడ్డి ఏదో ఫ్యాన్సీగా ఇచ్చి ఉండొచ్చు. కానీ ‘నా గొడవ’ చంద్రబాబుకు సహించేది కాదు, అందులోని సత్యస్ఫూర్తి ఆయన భరించేది కాదు అన్నరు తెలంగాణ ఉద్యమకారుడు, కవి మిత్రుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్.
కాళోజీ చెప్పిన ‘పాతి పెట్టాల్సిన ప్రాంతీయుడు, తరిమి కొట్టాల్సిన ప్రాంతేతరుడు’ కలిసి ఈ నాటకాన్ని రక్తి కట్టించడం ఒక గడుసైన దృశ్యం! దానికి తారస్థాయి ముగింపు చంద్రబాబు నోట ‘జై తెలంగాణ’ మాట!
విభజన చట్టాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తున్నరు. ఆయన ద్వారా బీజేపీ తెలంగాణలో నాటకాలకు తెరతీసిందన్న కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి మాటలు కాంగ్రెస్ వాళ్లు గమనించాలి. కూతురుకు నిన్ననే కార్పొరేషన్ పదవి ఇప్పించుకున్న జగ్గారెడ్డి ఇప్పుడప్పుడే రేవంత్‌రెడ్డిని డైరెక్ట్‌గా ఏమీ అనడం లేదు; అట్లని అనకుండానూ లేరు. చంద్రబాబును అన్న మాటలు అన్నీ రేవంత్‌రెడ్డికే తగులుతయి. తమ ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకుంటరో, ఈనగాచి నక్కల పాలు చేసినట్టు రేవంత్‌కు ధారపోస్తరో, తద్వారా చంద్రబాబుకు గుత్తకు ఇస్తరో కాంగ్రెస్ వాళ్లే తేల్చుకోవాలి.
సోనియా, రాహుల్‌లకు అర్థం అయితున్నదో లేదో గానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వమూ గడ్డు కాలం ఎదుర్కొంటున్నది. ప్రభుత్వమేమో ప్రజలకు; పార్టీయేమో అసలైన కార్యకర్తలకు కాకుండా పోతున్నది. పాత కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్, ఫిరాయింపు కాంగ్రెస్‌లుగా పార్టీ విడిపోయింది. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో కనీసం మూడువర్గాలున్నయి. రోజూ కొట్టుకుంటున్నయి. సాండ్ ల్యాండ్ ఫండ్ మాఫియాగా మారిపోయి పచ్చని తెలంగాణను అల్లకల్లోలం చేస్తున్నయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే తంతు! గల్లీల్లో పరస్పర భౌతిక దాడులకు దిగుతుండగా, ఢిల్లీలో అధిష్ఠాన ఏజెంట్ల ముందు మంత్రులు సైతం ఒకరిపై ఒకరు పితూరీలు చెప్పుకుంటూ ఉన్నరు.
రేవంత్‌రెడ్డి విధేయత మోదీకా, రాహుల్‌కా అన్నది ఢిల్లీ పెద్దలకు వీడని సంశయం. మరొకవైపు తెలంగాణ మేధావులు ‘కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్య వీచికలు, స్వేచ్ఛాయుత పాలన’ పర్యవసానాలు ఇపుడిపుడే చవిచూస్తున్నరు. 2019 ఎన్నికల సందర్భంగా కోదండరాం జనసమితిని కూటమిలోంచి తరిమేయాలని చంద్రబాబు హుకుం జారీచేసిన విషయం రాహుల్‌కు ఒక శ్రోతలాగ మాత్రమే తర్వాత తెలిసింది. కత్తి వేటుకు నెత్తురు చుక్కలేని మోముతో రాహుల్ కూడా తలూపక తప్పని పరిస్థితి. ‘కోదండరాం రాజకీయాలకు పనికిరాడు’ అని మీడియా ముఖంగా పలికిన రేవంత్‌రెడ్డి అదే విషయం తన గురువు చంద్రబాబు ద్వారా రాహుల్‌కు చెప్పించిండు. అందరూ కలిసి కోదండరాంకు పొగ పెట్టిన్రు. టీజేఎస్‌ను ఆరు సీట్లకు పరిమితం చేసి, అందులో నాలుగు చోట్ల తమ రెబల్ అభ్యర్థులనూ దింపిన విలువ లేని పార్టీ కాంగ్రెస్!
ఇన్ని తెలిసినా కోదండరాం ఇంకా రేవంత్‌రెడ్డి వైపు చూస్తున్నరంటే కారణం రేవంత్ సమర్థత మీదో, తెలంగాణ అభివృద్ధి మీదో నమ్మకం కాదు, కేసీఆర్‌పై ఏదో పట్టరాని కోపం. నిజానికి చాలామంది తెలంగాణ మేధావులకు కేసీఆర్‌పై నిర్హేతుకమైన కోపమే. బీఆర్ఎస్ పాలనపై రోజూ దుమ్మెత్తి పోసి, కాంగ్రెస్ పార్టీకి బాండెడ్ లేబర్‌లా పనిచేసిన ఎంతోమంది తెలంగాణ బుద్ధిజీవులు నేడు లోపల్లోపల కుములుతున్నరు.
సింగరేణి పోరుబాట బట్టింది. నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడి తర్వాత రాహుల్‌గాంధీ ఇంటి ముట్టడి తలపెడుతున్నరు. తమను ఈ ప్రభుత్వం ఆదుకోలేదని నిరాశా నిస్పృహలకు లోనవుతున్న రైతులు సెల్ఫీ వీడియోలు పెట్టి మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆరు నెలల్లో 11 మంది నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడిన్రు. హాస్టళ్లలో విద్యార్థులు తరచూ విషాహారం పాలబడుతున్నరు. మంత్రులు మాట్లాడే మీటింగ్‌లలో సైతం కరెంటు పోవడం నిత్యకృత్యమైంది. విద్యార్థుల ఆకలి తీర్చే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’కు మంగళం పాడిన్రు. శాంతిభద్రతలు లుప్తమై నడిరోడ్ల మీద జనం తన్నుకు చస్తున్నరు. రియల్ మాఫియాను అడ్డుకునేవారు లేరు. విద్య, హోం శాఖలు చూస్తున్న రేవంత్‌రెడ్డికి తీరికే లేదు. తుచ్ఛ రాజకీయాలకు మాత్రమే పరిమితమైతున్నరు. పల్లె-పట్టణ ప్రగతికి పైసా విదల్చక పారిశుద్ధ్యం పడకేసింది, వ్యాధులు విజృంభిస్తున్నాయి. అదానీకి విద్యుత్తు రంగాన్ని అప్పజెపుతున్నరు. ఆరు గ్యారెంటీలు అటకెక్కినయి. హక్కులు అడిగితే చెప్పుతో కొడతామంటున్నరు మంత్రులు. అది అందిపుచ్చుకొని చేతల్లో చూపిస్తున్నరు పోలీసులు!
తన పాలననే రెఫరెండంగా ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలన్న రేవంత్ పిలుపునకు ప్రజలు సరిగానే స్పందించిన్రు. ‘రేవంత్‌ది పూర్ పర్ఫార్మెన్స్’ అంటూ కాంగ్రెస్ అధిష్ఠానం త్రిసభ్య కమిటీని విచారణకు పంపిందంటే రేవంత్ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత ఎంత ఉందనేది స్పష్టమవుతున్నది. ధర్నాలతో దద్దరిల్లుతున్నది తెలంగాణ. ఒక్క ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దృష్టిలో తప్ప పాలన అంతా అస్తవ్యస్తంగా ఉన్నది. ఆరు నెలల్లో 38 వేల కోట్లు అప్పు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం అవి ఎక్కడ ఖర్చు పెట్టిందో దేవునికే ఎరుక. రైతుబంధు పడ లేదు, షాదీ ముబారక్ చెక్కులు బౌన్స్ అవుతున్నయి. వరికి మద్దతు ధర లేదు గానీ బీఆర్ఎస్ నుంచి వచ్చే వారికి మద్దతు ధర మాత్రం ఇస్తున్నట్టున్నరు!
నయానో భయానో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకోవడం తప్ప రేవంత్ మరో పని చేయడం లేదు. పార్టీలు మారుతున్న ప్రజా ప్రతినిధులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. పైన చెప్పిన దారుణ దుర్మార్గాలన్నీ మీ కండ్ల ముందే ఉన్నయి. మీ మీ నియోజకవర్గ ప్రజలను ఎవరిని కదిపినా చెప్తరు రోజులెంత దుర్భరంగా ఉన్నయో, కేసీఆర్ పాలనను ఎంత మిస్ అవుతున్నమో అని. మరి మీరు పార్టీ మారేది ఏమి సాధించడానికి? రేపు మళ్లీ గెలువగలరా? ప్రజాగ్రహం ముందు నిలువగలరా! నిరుద్యోగుల సమస్యలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఏమి చేయాలో తెలియక, ఏమని సర్దిచెప్పాలో పాలుపోక కోదండరాం, ఆకునూరి మురళి, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్నలు మొహం చాటేసిన్రు. కోదండరాం ఇంటి ముట్టడికి విద్యార్థులు సిద్ధమైతున్నరు. మరి మీరు పార్టీలు మారి ఏమి పీకుతరని ప్రజలు అడుగుతున్నరు ఊళ్లల్లో. రేపు రాళ్లతో కొడతరు, తయారుగా ఉండండి!
ఆడలేక పాత గజ్జెలు అన్నట్టు ఇప్పటికీ గత ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్న రేవంత్ రెడ్డి, మొన్న తన గురువు ఏమన్నరో గ్రహించాలి. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. గుజరాత్, కర్ణాటకలను కూడా దాటేసింది అన్నరు చంద్రబాబు. రాహుల్ గాంధీయేమో తెలంగాణ మాడల్ దేశమంతా కావాలి అంటే, రేవంత్ రెడ్డి గుజరాత్ మాడల్ కావాలంటున్నరు. చంద్రబాబు గుజరాత్ కంటే తెలంగాణ బాగుంది అంటున్నరు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు, వైఎస్‌కు సమాన దగ్గరలో ఉంటున్నరు. ‘వైఎస్ ఆశీస్సులు రేవంత్‌కు ఉంటయి’ అన్నరు ఉండవల్లి అరుణ్ కుమార్. అటు చంద్రబాబు, ఇటు వైఎస్ ఆశీస్సుల బలంతో రేవంత్ తెలంగాణను ఏ గతి పట్టించగలడో మన ఊహకు అందుతున్నదా?
‘వైఎస్ ఒక దార్శనికుడు. ఆయన హయాంలో ఉమ్మడి ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. కూటమి ప్రభుత్వంపై కొట్లాడేది షర్మిలయే. 2029లో ఏపీలో కాంగ్రెస్‌దే అధికారం, షర్మిల సీఎం’… అన్నరు రేవంత్ మొన్న ఏపీలో వైఎస్‌కు నివాళి ఘటిస్తూ! అంతకుమునుపు ఇదే మనిషి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సాధించిన విజయాలు ఏకరువు పెట్టిండు; జలవనరుల నిర్వహణలో ఆయనే ఆదర్శమన్నడు!
ఒక మనిషికి ఎన్ని ముఖాలని ఉంటయి? ఎంత థర్డ్ క్లాస్ రాజకీయమైనా ఇంత దిగజారాలా? బాబును దింపి, షర్మిలను సీఎం చేయాలన్న రేవంత్ మాటలను ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ, ఈటీవీ, చంద్రబాబు, తుమ్మల, వెంకయ్యనాయుడు తదితరులు ఒప్పుతరా? అసలు విషయం ఏమంటే, ఏపీ కాంగ్రెస్‌నూ, షర్మిలనూ ఫూల్ చేసి వచ్చిండు రేవంత్. రాజకీయ నాయకులు సమయానికి తగ్గట్టు మాట్లాడటం సహజం. కానీ, ఇంత బరితెగింపు, ఇంత నైచ్యం, ఇంత విశ్వాస రాహిత్యం ఒక్క రేవంత్‌కే సాధ్యం! చైతన్యవంతమైన తెలంగాణకు రేవంత్ ఒక అవమానం! పాపం ఏపీలో కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ తమవాడో కాదో డౌట్. ఇపుడు తెలంగాణ కాంగ్రెస్ వాళ్లకు కూడా అదే సందేహం. ఆయనతో మనసులేని కాపురం చేస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నా సానుభూతి. మీ చావుకు మీరే తోరణం, మీ కర్మకు మీరే కారణం!
ఎవరి చావు ఎవరన్నా చావనీ; ఏ పార్టీలు ఎటన్నా పోనీ… అందరూ కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నరన్నదే కదా మనందరి బాధ! ఇంత క్షుద్ర రాజకీయాలు మనం ఎరుగుదుమా? పదేండ్లలో అభివృద్ధి-సంక్షేమం-ఆత్మగౌరవం తప్ప తెలంగాణను కబళించే శక్తుల ఆటలు సాగినయా? వైఎస్ లేదా చంద్రబాబుల స్ఫూర్తిని కలవరించే పాలకుడు వస్తడని ఊహించినమా?
ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే వచ్చిందొక ఫోన్, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. జగన్ చేసిన సంక్షేమం చంద్రబాబు ఇప్పటిదాకా చేయలేదని, ఇకముందూ చేయబోరని. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏటా కనీసం లక్ష రూపాయలు ఏదో ఒక రూపంలో అందినాయని. స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత జగన్ ఓటమికి దారి తీసిందని ఆ మాటల సారాంశం. అచ్చు తెలంగాణలో జరిగినట్టే అక్కడా జరిగినట్టు అనిపిస్తున్నది.
తెలంగాణలో కూడా క్షేత్రస్థాయి నాయకులు సరిగ్గా లేక, అధినాయకుని దార్శనికతను అందుకోలేక, తాము బొక్కబోర్లా పడి, పార్టీని ముంచి… ఇపుడు అంగలారిస్తే ఏమి లాభం? పోనీ గెలిచినవారన్నా పరిణామాలు మొత్తంగా అర్థం చేసుకోక, మంచిరోజులు వస్తాయనే ఆశా, ఓపికా లేక పక్కచూపులు చూస్తున్నరే… రేపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేతిలో చిత్తు చిత్తు అవబోతున్నది కదా, అపుడేమి చేస్తరు? పైన చెప్పినట్టు ప్రజలు నానా కష్టాలు పడుతూ ఉంటే, ప్రభుత్వంపై ఆగ్రహోదగ్రులు అవుతూ ఉంటే వారి పక్షాన కొట్లాడే బాధ్యత మరిచి ఫిరాయింపులకు పాల్పడటం ప్రజా ద్రోహం. కేసీఆర్‌కు పోయేదేమీ లేదు… ఇంట్లో కూచున్నా అధికారంలోకి వస్తరు, అంతలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నష్టపోయేది మీరు. మీ ఇష్టమిక.
ప్రియ ప్రజలారా!…
ముప్పేట దాడితో వలసవాదులు మనమీదికి వస్తున్నపుడు, సమైక్య పాలనలోని కష్టాలు మళ్లీ మన అనుభవంలోకి వస్తున్నపుడు కాళోజీ ఆత్మగౌరవ ప్రకటన అయిన ‘నా గొడవ’ను మననం చేసుకోవలసిందే. ఒక పీడకుని చేతిలో మరొక పీడకుడు పెట్టిన మన అస్తిత్వాన్ని గుంజుకోవలసిందే.
జై తెలంగాణ!
-శ్రీశైల్ రెడ్డి పంజుగుల
90309 97371
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

