కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేసేందుకు తలపెట్టిన బిల్లుతో అడవులకు, అడవుల్లో నివసించే జనసమూహాల హక్కులకు ముప్పు ఏర్పడుతున్నదని పార్లమెంటు సభ్యులకు కాన్స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్ రాసిన ఒక లేఖలో హెచ్చరించింది. హర్ష్ మందర్ వంటి ప్రజాభిమానం చూరగొన్న 155 మంది మాజీ ఐఏఎస్ అధికారులు ఈ లేఖపై సంతకాలు చేశారు. బిల్లుతో చట్టానికి తెస్తున్నవి సవరణలు కావని, అవి చట్టాన్నే దిగమింగే మృత్యుఘంటికలని దుయ్యబట్టారు. ప్రస్తుత రూపంలో బిల్లును ఆమోదించవద్దని కేంద్రాన్ని వేడుకున్నారు.
గౌరవనీయ రాజ్యసభ,
లోక్సభ సభ్యులకు…
అఖిలభారత, కేంద్ర సర్వీసులకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారులమైన మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులుగా సేవలందిం చాం. ఒక సమూహంగా మాకు ఎలాంటి పార్టీ అనుబంధాల్లేవు. నిష్పాక్షికత, తటస్థత, భారత రాజ్యాంగం పట్ల నిబద్ధత ఉండాలని మేము విశ్వసిస్తాం. 2023 మార్చిలో పార్లమెంటుకు సమర్పించిన, రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఆమోదించనున్న అటవీ సంరక్షణ (సవరణ) బిల్లుపై మేమంతా తీవ్రంగా కలత చెంది ఉన్నాం. బిల్లులోని అంశాలు, దాన్ని ముందుకు తెస్తున్న తీరు.. రెండూ మాకు ఆందోళన కలిగిస్తున్నాయి.
పద్ధతి ప్రకారమైతే ఆ బిల్లును శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అటవీ అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలి. అందుకు బదులుగా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపారు. ఆ కమిటీలో ఒక్కరు మినహా అంతా పాలక పక్షానికి చెందినవారే. దీంతో బిల్లు పరిశీలన ఏకపక్షంగా, అసంతృప్తికరంగా జరిగింది. ప్రస్తుత బిల్లు గురించి చర్చించే ముందు అడవుల విధ్వంసాన్ని నిరోధించేందుకు 1980లో అటవీ సంరక్షణ చట్టం తేవడం వెనుక గల చారిత్రిక కారణాలను మననం చేసుకోవడం మంచిది. 1980కి ముందరి మూడు దశాబ్దాల కాలంలో 42 లక్షల హెక్టార్ల అటవీ భూభాగం అటవీయేతర అవసరాలకు మళ్లించారు. 1980లో అటవీ సంరక్షణ చట్టం తెచ్చిన తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో కేవలం 15 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఇతర అవసరాలకు ఇచ్చారు. అటవీ భూముల సంరక్షణకు చట్టం చేసిన మన శాసనకర్తల దూరదృష్టి ఫలితంగా ఇది జరిగింది.
దురదృష్టవశాత్తు గత కొన్నేండ్లుగా అటవీ భూముల దారి మళ్లింపు ఊపందుకున్నది. ఉత్తరాదిని వరదలు అతలాకుతలం చేయడం వంటి పర్యావరణ ఉత్పాతాలు మన కండ్లముందే ఉన్నప్పటికీ ఇది జరుగుతుండటం గమనార్హం. 2018-19 నుంచి 2022-23 మధ్యకాలంలో దాదాపు 90,000 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపునకు గురైంది.
ఈ మళ్లింపును తగ్గించి, క్రమబద్ధీకరించాల్సిన అటవీ సలహా కమిటీ, ప్రాంతీయ సాధికార కమిటీలు నిర్వీర్యమైపోయాయి. అటవీ భూముల మళ్లింపు ప్రతిపాదనలు పెద్దగా తిరస్కరణకు గురవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. 2020లో 14,855 హెక్టార్ల భూమి మళ్లింపుపై 367 ప్రతిపాదనలు వస్తే అందులో కేవలం 11 హెక్టార్లకు సంబంధించిన 3 ప్రతిపాదనలు మాత్రమే తిరస్కరించారు.
అటవీ భూములను అటవీయేతర ఉపయోగాలకు తేరగా పందేరం చేసే ఈ ధోరణిని మరింత బలపరిచే ప్రయత్నాలు అటవీ సంరక్షణ సవరణ బిల్లు ద్వారా జరుగుతున్నాయి. రక్షిత ప్రాంతాల్లో కాకుండా ఇతర చోట్ల ఉండే అటవీభూమిని పలురకాల అటవీయేతర ఉపయోగాలకు మళ్లించడాన్ని ఈ బిల్లు అనుమతిస్తుంది. అందులో ఏమేం సడలింపులున్నాయో చూద్దాం. 1.దేశ సరిహద్దులకు 100 కిలోమీటర్ల పరిధిలో రక్షణ అవసరాలకు ఇవ్వొచ్చు. 2.రైలుమార్గాలు, ప్రధాన రహదారులకు, ప్రభుత్వం, ప్రాధికార సంస్థలు నిర్వహించే జంతు ప్రదర్శన శాలలకు, 4.ఎకో టూరిజం అవసరాలకు, 5.నియంత్రిత అడవుల పెంపకానికి, కేంద్ర ప్రభుత్వం సూచించే మరే ఇతర అవసరాలకు అటవీ భూములను మళ్లించవచ్చని బిల్లు సూచిస్తున్నది. ఇందులో చివరిది కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పాలి. అదేవిధంగా కేంద్రం ప్రభుత్వం సూచించిన షరతుల పరిధిలో అటవీ అన్వేషణ యాత్రలు, ఖనిజ నిక్షేపాల సర్వేలు, ఇతర సర్వేలు జరపొచ్చని కూడా బిల్లు చెప్తున్నది. ఖనిజ నిక్షేపాల సర్వేలు దేనికి? అంటే ఎక్కడైనా నిక్షేపాలు బయల్పడితే గనుల తవ్వకాలను అనుమతిస్తారని అర్థమా? మధ్యప్రదేశ్లోని బక్స్ వాహా కీకారణ్యంలో వజ్రాల తవ్వకం చేపట్టనున్నట్టు ఇటీవల ఓ పత్రికా వ్యాసం ద్వారా తెలిసింది. ఈ గనులు తవ్వితే ప్రాంతీయంగా నీటి సరఫరా దెబ్బతింటుంది. వాతావరణ తాపానికీ అది కారణమవుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత కఠిన నిబంధనలున్న చట్టం కిందనే అనుమతి ఇచ్చారు. ఇక చట్టాన్ని సవరిస్తే అనుమతులు యథేచ్ఛగా ఇస్తారా?
సవరణలు అమల్లోకి వస్తే 2030 నాటికి 250 నుంచి 300 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమమైన కార్బన్ను నిక్షిప్తం చేసుకునే వృక్షచ్ఛాయ ఏర్పడుతుందని బిల్లు పీఠికలో తెలిపారు. పరిహార అటవీకరణపై విశ్వాసంతో ఈ మాటలు రాసినట్టు తెలుస్తూనే ఉన్నది. ఇది పూర్తిగా అవాస్తవికమైన అంచనా అవుతుంది. ఎందుకంటే సహజమైన అడవులను పెద్దఎత్తున అటవీయేతర అవసరాలకు ఇచ్చేస్తారు. పైగా కార్బన్ నిక్షిప్త ప్రక్రియలో కృత్రిమంగా పెంచిన అడవుల కన్నా సహజ అడవులు 40 రెట్ల అధిక ప్రభావం కలిగి ఉంటాయని అనేక అధ్యయనాలు తెలిపాయి. పరిహార అటవీకరణ ఫలితాలు ఆశించినస్థాయిలో ఉండవని కూడా రుజువైంది. 2018-19లో మళ్లింపునకు గురైన భూమిలో 72 శాతానికి సమానమైన విస్తీరణంలో కృత్రిమ అటవీకరణను చేపట్టారు. అందులో 24 శాతం పచ్చదనం కోల్పోయిన పాత అటవీభూముల్లోనే చేపట్టారు.
సహజ అడవులు కార్బన్ నిక్షిప్తానికి సహకరించడంతో పాటు వివిధరకాల జంతు, వృక్ష సంతతులకు ఆలవాలంగా కూడా ఉంటాయి. ప్రపంచంలో 5,000 పైచిలుకు ప్రాంతీయ విశిష్టతలు కలిగిన జంతు, వృక్ష జాతులు కలిగిన 17 మహా జీవవైవిధ్య దేశాల్లో భారత్ ఒకటి. ముందుచూపు లేని ఈ బిల్లుతో ఆ జీవవైవిధ్యమంతా ప్రమాదంలో పడుతుంది.
అటవీ భూములకు, మామూలు భూములకు తేడా చూడకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన గోదావర్మన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రశంసనీయమైన తీర్పును బిల్లు తోసిరాజంటున్నది. పైగా బిల్లులోని అత్యంత హానికరమైన అంశం సరిహద్దుల వెంబడి 100 కిలోమీటర్ల పరిధిలో జాతీయ ప్రాముఖ్యం, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్టులు చేపట్టవచ్చని సూచించడం. సిక్కింతో సహా యావత్తు ఈశాన్య రాష్ర్టాలు, ఉత్తరాఖండ్ ఈ 100 కిలోమీటర్ల పరిధి కిందకు వస్తాయి. అత్యధిక అటవీ భూభాగాలు, జీవవైవిధ్యం ఉన్న రాష్ర్టాలివి.
సవరణలతో అటవీ ఆధారిత ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు సమకూరుతాయని, అడవులపై ఆధారపడిన జనసమూహాల జీవనోపాధి మెరుగుపడుతుందని బిల్లు పీఠిక తెలియజేస్తున్నది. అడవుల్లో జీవించేవారి హక్కులకు మద్దతునిచ్చేవాటిలో అటవీ హక్కుల చట్టం (2006) ఒకటి. ఆ చట్టంలో హామీ ఇచ్చిన హక్కుల గురించి ప్రస్తుత బిల్లులో ప్రస్తావించలేదు. ఆ చట్టం నిబంధనలను సమర్థిస్తున్నట్టు లేదా వ్యతిరేకిస్తున్నట్టు కూడా ఏమీ చెప్పలేదు. ఉదాహరణకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జనసమూహాలు నివసించే అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం, సఫారీ పార్కులు లేదా రక్షణ ప్రాజెక్టులకు లీజుకు ఇచ్చేస్తే ఏమవుతుంది? ఈ తరహా వైరుధ్యం ఇటీవల జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ హర్ష్ చౌహాన్ వివాదంతో బయటపడింది. బిల్లు వాయిదా వేయాలన్న తన వినతిని కేంద్రం తిరస్కరించడంతో ఆయన రాజీనామా చేశారు. అటవీ ఆధారిత జనసమూహాల హక్కులను కాపాడేందుకు బదులుగా ఈ బిల్లు నిజానికి కబళించివేస్తుందని స్పష్టమైపోతున్నది.
పర్యావరణాన్ని పరిరక్షించి, మెరుగుపర్చి, దేశంలోని అడవులను, వన్యప్రాణులను ప్రభుత్వం కాపాడాలని రాజ్యాంగంలోని 48(ఏ) అధికరణం చెప్తున్నది. కానీ ఈ బిల్లు అందుకు వ్యతిరేక దిశలో పోతున్నది. సవరణ బిల్లు లోపభూయిష్టంగానూ, పూర్తిగా పక్కదారి పట్టించేదిగానూ ఉన్నది. ప్రస్తుత రూపంలో దానిని ఆమోదించవద్దని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. తాను సవరించాల్సిన చట్టాన్ని బిల్లు అంతం చేస్తుంది. దేశంలో ప్రస్తుతం ఉన్న అటవీ వనరులను నాశనం చేసే చివరి అస్త్రమవుతుంది. సత్యమేవ జయతే..
– కాన్స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్