ప్రజాస్వామ్యంలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఎటు దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక-ఆర్థిక దిశానిర్దేశం. ఒక రకంగా చెప్పాలంటే, బడ్జెట్ అనేది ప్రజల ఆశయాలకు అద్దం పట్టే రాజకీయ పత్రం. కానీ, మార్చి 20న శాసనసభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన రూ.3,24,234 కోట్ల భారీ బడ్జెట్ అట్టడుగు వర్గాల్లో ఆశలు రేకెత్తించాల్సింది పోయి, తీవ్ర నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా తెలంగాణ జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీల విషయంలో ఈ బడ్జెట్ ‘అంకెల గారడీ’గానే మిగిలిపోయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం బహుజనులలో గొప్ప ఆశలు రేపిం ది. వనరుల సమాన పంపిణీ జరుగుతుందని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ పాలనలో ‘నిధులు’ అనే అంశం బీసీలకు అందని ద్రాక్షగానే మిగిలింది. 2014-15లో లక్ష కోట్ల రూపాయలతో ఉన్న రాష్ట్ర బడ్జెట్, నేడు మూడు లక్షల కోట్లు దాటింది. బడ్జెట్ పరిమాణం పెరిగిన నిష్పత్తిలో బీసీల అభివృద్ధిపై ఖర్చు పెరగకపోవడం గమనార్హం. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ఒక నిర్మాణాత్మకమైన అన్యాయం. ప్రభుత్వ కుల సర్వే ప్రకారం రాష్ట్రంలో మెజారిటీ జనాభా ఉన్న బీసీలకు ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే. అంటే మొత్తం బడ్జెట్లో బీసీల వాటా కేవలం 3.85 శాతం! జనాభాకు, కేటాయింపులకు పొంతన లేకపోవడం సామాజిక న్యాయం అనే మాటకు అర్థాన్నే మార్చేస్తున్నది. నిరుడు కేటాయింపులతో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్టు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ నిధులు ఖర్చు కావడం లేదనేది చేదు నిజం.
గడిచిన రెండేండ్ల గణాంకాలను పరిశీలిస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టమవుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.9,200 కోట్లు కేటాయించి కేవలం రూ.2,080 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే కేటాయించిన దాంట్లో 22 శాతం కూడా వెచ్చించలేదు. ఇక 2025-26లో రూ.11,400 కోట్లు కేటాయించి, సుమారు రూ.3,000 కోట్లే ఖర్చు పెట్టారు. అధికారంలోకి రాకముందు ‘కామారెడ్డి డిక్లరేషన్’ పేరుతో ఏటా రూ.20,000 కోట్లు, ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని ఇచ్చిన హామీ నేడు ఎన్నికల మోసంగా మారిందా అనే అనుమానం కలుగుతున్నది. రెండేండ్లలో కనీసం రూ.5,000 కోట్లు కూడా ఖర్చు చేయకపోవడం బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపునకు నిదర్శనం.
బీసీల స్వయం ఉపాధికి వెన్నెముకగా ఉండాల్సిన కార్పొరేషన్లు నేడు నిధులు లేక వెలవెలబోతున్నాయి. 2014-23 మధ్య కాలంలో బీసీ కార్పొరేషన్లకు రూ.2,642 కోట్లు కేటాయించి కనీసం 26 శాతం ఖర్చు చేశారు. కానీ, గత రెండేండ్ల కాలంలో రూ.1,363 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఎంబీసీ (ఎంబీసీ) కార్పొరేషన్, వివిధ కుల ఫెడరేషన్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కేటాయింపులు కాగితాలకే పరిమితమై, విడుదలైన నిధులు మాత్రం సున్నాగా మారడంతో లక్షలాది మంది చేతివృత్తుల వారు, నిరుద్యోగ యువత ఉపాధి కోల్పోతున్నారు. ప్రభుత్వం వద్ద ఆర్భాటపు ప్రాజెక్టులకు, ఆడంబరపు ప్రచారాలకు భారీగా ఖర్చు పెడుతామని చెప్తున్నది. కానీ, బీసీల స్వయం ఉపాధి విషయం వచ్చేసరికి ‘రెవెన్యూ లోటు’ను సాకుగా చూపిస్తున్నది.
రాష్ట్రంలోని రైతు పథకాల్లోనూ బీసీలకు అన్యాయమే జరుగుతున్నది. తెలంగాణలో సుమారు 50 లక్షల భూమిలేని బీసీ కుటుంబాలు ఉన్నాయి. రైతు భరోసా వంటి పథకాలు భూమి ఉన్న వారికే లబ్ధి చేకూరుస్తుండటంతో, భూమి లేని నిరుపేద బీసీలకు ఈ పథకాల ద్వారా ఒక్క పైసా కూడా అందడం లేదు. ఫలితంగా సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నది.
భూమి లేని కౌలు రైతులకు, రైతు కూలీలకు చేయూత అందిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైంది? ఎంతకాలం బీసీలు కేవలం సబ్సిడీల మీదే బతకాలి? వారిని సాధికారులుగా, స్వావలంబన పొందేలా చేసే విజన్ ఈ బడ్జెట్లో ఎక్కడా కనిపించడం లేదు? ప్రభు త్వం చెప్తున్న ‘ఫ్యూచర్ సిటీ’, ‘3 ట్రిలియన్ ఎకానమీ’ లక్ష్యాల్లో బీసీలు భాగస్వా ములు కాదా? వారికి వాటా లేకపోతే మాటల్లో చెప్తు న్న అభివృద్ధి ఎవరి కోసం? విద్యారంగంలో బీసీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. సుమారు రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే దుస్థితి నెలకొన్నది. ఇతర రాష్ర్టాల్లో చదివే బీసీ విద్యార్థులకు ట్యూషన్ ఫీ చెల్లింపులు లేవు, ఉద్యోగ నియామకాల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై స్పష్టత లేదు.
విద్య, ఆర్థిక సహాయం లేకుండా బీసీలు ఎలా ఎదుగుతారు? మాటల్లో అంబేద్కర్ పేరు జపిస్తూ, బీసీలను విస్మరించడం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, ప్రజలను మోసం చేయడమే. బడ్జెట్లో వాటా కోరడం సాయం కాదు అది బీసీల హక్కు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆడంబరాల కోసం ఖర్చులు తగ్గించి, జ్యోతిబా పూలే బీసీ సబ్‌ప్లాన్ వెంటనే అమలు చేయాలి. బీసీ కార్పొరేషన్లకు కనీసం రూ.50,000 కోట్లు కేటాయించి, కులవారీ లబ్ధిదారుల డాటాను వెల్లడించాలి. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రోజులు పోవాలి. సామాజిక న్యాయం జరగకపోతే, రాబోయే రోజుల్లో బీసీ సమాజం ఐక్యంగా గళం ఎత్తడం ఖాయం.
విద్య, ఆర్థిక సహాయం లేకుండా బీసీలు ఎలా ఎదుగుతారు? మాటల్లో అంబేద్కర్ పేరు జపిస్తూ, బీసీలను విస్మరించడం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, ప్రజలను మోసం చేయడమే.