హైదరాబాద్ : అతడు ప్రాపంచిక సుఖాలను వదిలిపెట్టి భక్తి మార్గంలో వెళ్లాలనుకున్నాడు. అందుకు బాబాగా(Baba) మారేందుకు తన జననాంగాన్ని గొడ్డలితో నరుక్కొని బావిలో పడేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని(Madhyapradesh) ఛతర్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రాం మిలాన్ అనే ఓ రైతు (42) పాప భీతి నుంచి విముక్తి పొంది సన్యాస జీవితాన్ని గడపాలని, అలాగే ప్రాపంచిక కోరికలకు దూరంగా ఉండాలని ఆకాంక్షించి తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడు.
తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన సదరు వ్యక్తి గొడ్డలితో తన జననాంగాన్ని కట్ చేసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపాడు. వెంటనే బాధితుడిని కుటుంబ సభ్యులు ఛతర్పూర్ జిల్లా దవాఖానకు తరలించారు. అయితే అతడు తీవ్రమైన మానసిక వేదన వల్లే ఈ తీవ్ర చర్యకు పాల్పడినట్లు తెలిసింది.
ఇతడికి ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పెద్ద బిడ్డ పెండ్లి వచ్చే జూన్ 25 జరగాల్సి ఉంది. మరోవైపు తన భార్య చాలాకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అనారోగ్య, సమస్యలు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. రక్తస్రావం తీవ్రంగా జరిగిందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.