ఇప్పటికే మూడు, నాలుగు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన కాంగ్రెస్ వృద్ధ నాయకుడొకరు ‘బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగైపోతుంది’ అని సెలవిచ్చారు. జాతీయ పార్టీలకే తప్ప ప్రాంతీయ పార్టీలకు ఇకపై చోటు ఉండదని కూడా అన్నారు. ఆయనే కాదు, ఆ పార్టీలో గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ లీడర్ల దాకా, అలాగే మరో జాతీయ పార్టీ బీజేపీ నాయకులు కూడా కూడబలుక్కున్నట్టు అందరికందరూ ఇదే రాగం అందుకుంటున్నారు. ఒక్క ఎన్నికలో ఓ నాలుగు ముష్టి సీట్లు రాగానే తాము వందల సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన గతాన్ని మరిచిపోయి గంతులేస్తున్నారు. దీనికి పచ్చ మీడియా పైత్యంగాళ్లు తాళం వేస్తున్నారు.
పాపం ఎప్పుడూ అమ్మ.. బొమ్మ అంటూ గాంధీల బొమ్మలు పెట్టుకొని గెలిచే అలవాటున్న కాంగ్రెస్ పార్టీలోని నాయకులు, తమ నాయకుడి ఆధ్వర్యంలో రాహుల్ బొమ్మ పెట్టుకుంటే ఇక ఎప్పటికీ గెలుపు చూడలేమనేది మరోసారి నిర్ధారణ అయితే కుప్పకూలేది కాంగ్రెస్ మాత్రమే! ఇప్పటికీ తాము కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఒక్కడంటే ఒక్క నాయకుడూ చెప్పుకోలేని ఆ పార్టీ.. ఇంకెంతో కాలం నిలిచి ఉంటుందని అనుకోలేం.
మన దేశ రాజకీయాలను గమనించినప్పుడు ఈ దేశంలో జాతీయ పార్టీల నుంచి పుట్టిన పార్టీలే కనుమరుగయ్యాయి తప్ప ప్రాంతీయ పార్టీలకు ఆ గతి ఎప్పుడూ పట్టలేదు. పైగా ఆ పార్టీలు దశాబ్దాలుగా ఆయా రాష్ర్టాలు, ప్రాంతాల్లో అత్యంత బలంగా పాతుకుపోయాయి కూడా. సాధారణంగా ప్రతి ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం వెనుక ఒక బలమైన ఉద్వేగం ఉంటుంది. బలమైన ఆకాంక్ష ఉంటుంది. అన్యాయం మీద పిడికిలెత్తిన తిరుగుబాటు ఉంటుంది.
భిన్నజాతులు, మతాలు కలిగిన ఈ దేశంలో అందరినీ కలుపుకొనిపోవాల్సిన అవసరాన్ని జాతీయ పార్టీలు విస్మరించడం.. ఆయా ప్రాంతాల, జాతుల ఆకాంక్షలను గుర్తించకపోవడం.. గుర్తించేందుకు నిరాకరించడం.. అవమానించడం.. అణచివేయడం వంటి చర్యల నుంచే ప్రాంతీయ పార్టీలు పుడుతాయి. ఆ ఉద్వేగ భావజాలాన్ని బలంగా వినిపించే ఈ పార్టీల చుట్టూ ప్రజలు తమ భవిష్యత్తును కలబోసుకుంటారు. ఈ పార్టీలతో కలిసి అడుగులు వేస్తారు. గుండెల్లో పెట్టుకుంటారు. ఇదొక పేగుబంధమై స్థిరపడుతుంది. అందుకే జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలే ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోతున్నాయి.
ఎన్నో కాంగ్రెస్‌లు.. ఏవీ.. ఎక్కడ?: మన దేశ రాజకీయ చరిత్రను చూడండి. స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ ఎప్పుడో అంతర్థానమైపోయింది. ఆ తర్వాత ఇందిర హయాంలో చీలిక ఏర్పడగా మిగిలిన కాంగ్రెస్(ఓ) అడ్రస్ లేకుండాపోయింది. కాంగ్రెస్ (ఆర్) కూడా పోయింది. కాంగ్రెస్(యు) కూడా మాయమైపోయింది. కాంగ్రెస్(ఐ) వచ్చింది. అవేకాదు, ఆ పార్టీలోని సీనియర్లు ఎంతోమంది బయటకువచ్చి కాంగ్రెస్ పేరుకు ఎన్నో తోకలు తగిలించి పార్టీలు పెట్టుకున్నారు. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. జనతా పార్టీది అదే జాతకం. కలెగూరగంప లాంటి ఆ పార్టీ నుంచి పుట్టిన పార్టీలెన్నో కనబడకుండా పోయాయి. బీజేపీ అందులోంచే వచ్చినా అది పాత జనసంఘ్ పార్టీ పునరుద్ధరణ మాత్రమే. ఇక కమ్యూనిస్టు పార్టీ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆ పార్టీ నుంచి పుట్టిన చాలా ఎక్స్, వై, జడ్‌లు ముక్కలు ముక్కలై ఏ ముక్క మిగిలిందో.. ఏ ముక్క ఇంకే ముక్కలో కలిసిందో తెలియని స్థితి.
చెక్కు చెదరనివి ప్రాంతీయ పార్టీలే!: కానీ, ప్రాంతీయ పార్టీలు ఇందుకు పూర్తిగా భిన్నం. దేశంలో ఒక ప్రాంతంలో ఒకసారి ప్రాంతీయ బీజం పడిందంటే కచ్చితంగా అది మొక్కై, వృక్షమై బలంగా వేళ్లూనుకొనిపోతుంది. ఉత్థాన పతనాలెన్ని ఉన్నా ఆయా ప్రాంతాల్లో విస్మరించలేని బలమైన రాజకీయ శక్తిగా స్థిరపడుతుంది. ఉదాహరణే తీసుకుంటే స్వాతంత్య్రం రాకముందు 1920లో పుట్టిన శిరోమణి అకాలీదళ్ వందేండ్ల తర్వాత ఇప్పటికీ పంజాబ్‌లో తిరుగులేని రాజకీయశక్తిగా ఉన్నది.
రాష్ట్ర రాజకీయాలను నిర్దేశిస్తున్నది. అలాగే 1939లో పుట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ జాతీయ పార్టీల కుట్రలు, కుతంత్రాలను, నిర్బంధాలను, జైళ్లను తట్టుకొని ఇప్పటికీ కశ్మీర్‌ను శాసిస్తున్నది. 1966లో పుట్టిన శివసేనను ఒకసారి కాంగ్రెస్, ఓసారి బీజేపీ కుట్ర చేసి చీల్చినా ఇప్పటికీ ఆ పార్టీ అస్తిత్వం చెక్కు చెదరలేదు. మరాఠా అస్తిత్వానికి చిహ్నంగా ఆ పార్టీ ఇప్పటికీ ప్రజల మన్నన పొందుతూనే ఉన్నది. ఇక 1949లో పుట్టిన డీఎంకే వంటి ద్రవిడ పార్టీ మరిన్ని ద్రవిడ పార్టీలకు జీవం పోసింది.
ఏ ఒక్క జాతీయ పార్టీని ఆ గడ్డ మీద కాలు పెట్టనీయకుండా తరిమితరిమి కొట్టింది. 1982లో పుట్టిన టీడీపీ అప్పటినుంచి ఇప్పటిదాకా, ఉమ్మడి రాష్ట్రం నుంచి అవశేష ఆంధ్రప్రదేశ్ దాకా రాజకీయాల్లో అత్యంత బలమైన శక్తిగా కొనసాగుతున్నది. 1972లో పుట్టిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా ఎగుడుదిగుడులెన్ని ఎదురైనా రాష్ర్టాన్ని శాసిస్తూనే ఉన్నది. 1961లో పుట్టిన మహారాష్ట్ర గోమంతక్ పార్టీ ఇప్పటికీ గోవాలో నిలిచి ఉంది.
1985లో పుట్టిన అస్సాం గణపరిషత్ ఇప్పటికీ ఉంది. 1997లో పుట్టిన బిజూ జనతాదళ్ గత 26 ఏండ్లుగా మరొకరికి అవకాశం ఇవ్వకుండా అధికారంలో కొనసాగుతూ జాతీయ పార్టీలను రాష్ట్ర పొలిమేరల వద్ద ఆపేసింది. 1961లో పుట్టిన మిజో నేషనల్ ఫ్రంట్ ఇప్పటికీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నది. ఇలా చెప్పుకొంటూపోతే ఈ లిస్టు చాలా పెద్దది. ప్రాంతీయ పార్టీలున్న చోట ఎప్పుడు ఎన్నికలు జరిగినా రంగంలో ఒక ప్రధానశక్తిగా ఉండేది ఈ ప్రాంతీయ పార్టీలే. బీజేపీకి నిద్ర లేకుండా చేస్తున్న బెంగాల్ టీఎంసీ, కొరకరాని కొయ్యగా మారిన ఒడిషాలోని బిజూ జనతాదళ్, ఢిల్లీ ఆప్ పార్టీలే దానికి ఉదాహరణలు.
బలమైన పునాదుల మీద బీఆర్ఎస్…: దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ చాలా విభిన్నమైంది. ఆ పార్టీ పునాది అత్యంత బలమైంది. భావోద్వేగభరితమైంది. ఆ పార్టీ ఆవిర్భావం త్యాగాల పునాదుల మీద నిర్మితమైంది. పద్నాలుగేండ్ల పాటు తెలంగాణ రాజకీయ ఎజెండాను ఆ పార్టీ శాసించింది. రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలను శాసించే బలమైన లాబీలను ఢీకొట్టి పడగొట్టిన పార్టీ అది. అక్షరాలను చెరబట్టి ప్రాంతేతరుల ఆకాంక్షలే ప్రజల ఆకాంక్షలుగా, వారి అవసరాలే రాష్ట్ర అవసరాలుగా, వారి ప్రయోజనాలే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలుగా చెలామణి చేస్తున్న మీడియాను, ఆంధ్ర లాబీలు నడిపిస్తున్న కిరాయి ప్రజాసంఘాలను, కిరాయి మేధో భావజాలాలను బద్దలు కొట్టిన పార్టీ అది.
ఒక్క పిలుపుతో లక్షల మందిని సమీకరించిన సత్తా కలిగిన పార్టీ అది. శిలా సదృశ్యమైన విశాలాంధ్ర భావనలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేసి, ఆత్మగౌరవ ప్రతీకగా స్వరాష్ట్ర జెండా ఎత్తిన పార్టీ టీఆర్ఎస్. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఒక్కో ఇటుకా పేర్చి దేశంలో తెలంగాణ పేరును తలెత్తుకొని తిరిగేలా చేసిన పార్టీ.
గత 21 ఏండ్లుగా ప్రజా జీవనంలో ఒక భాగమై నిలిచిన పార్టీ. కావొచ్చు.. ఒక ఎన్నిక ఓడిపోయి ఉండవచ్చు. అనుకోని విధంగా అంచనాలు తప్పి ఉండవచ్చు. కానీ, ఆ ఫలితం ప్రజల పూర్తి తిరస్కారమా? లేక కేవలం అసంతృప్తా?.. అనేది ఫలితాల అంకెలే చెప్తున్నాయి. మరో ఎన్నిక జరిగింది, ఆ ఫలితాలు రావాల్సి ఉన్నది. వాటికోసం వేచి చూడకుండా అప్పుడే పార్టీ పని అయిపోయినట్టు.. పార్టీ ఏదో కాలగర్భంలో కలిసిపోతున్నట్టు వెర్రిమొర్రి ప్రేలాపనలు!
ముందున్నది ముసళ్ల పండుగ: అదట్లా ఉంచినా రాష్ట్రంలో ఎన్నికల పర్వం అప్పుడే పూర్తికాలేదు. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏ రాష్ట్రంలోనైనా ఏ రాజకీయ పార్టీకైనా బల ప్రదర్శనకు మూడు దశల ఎన్నికలుంటాయి. ఇందులో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. ఇంకా లోకల్ బాడీ ఎన్నికలు ముందున్నాయి. ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్రస్థాయి బలాబలాల ప్రదర్శనకు ఈ లోకల్ బాడీ ఎన్నికలే పునాదుల వంటివి. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ అంశాల ప్రభావం కొంతవరకు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత రాష్ట్ర రాజకీయం, కొంత జాతీయ రాజకీయం కలగాపులగంగా ఉంటుంది.
అందువల్లనే మన రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరిగింది. ఆ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కొంత ప్రయోజనం చేకూరింది. ఇక పార్లమెంటు ఎన్నికలు.. ఫలితాలు వస్తేగానీ ఆ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి తెలియదు. కానీ, ఇప్పుడు ముందున్న స్థానిక ఎన్నికలు ఈ ఎన్నికలకు పూర్తి భిన్నం. స్థానిక ఎన్నికలు పూర్తిగా రాష్ట్ర అంశాలపైనే ఆధారపడి ఉంటాయి. ఇక్కడ పోటీలో అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే ఉంటాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్సే. కాబట్టి స్థానిక పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే పరిమితమవుతుంది.
ఇక్కడ మోదీ వేవ్‌లు, అమిత్ షా చాణక్యాలు పనిచేయవు. అసలు బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా క్యాడర్ లేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకే అభ్యర్థులను వెతుక్కున్నది. ఇక స్థానిక ఎన్నికలకు క్యాండిడేట్లు దొరికేదెక్కడ? అయినా గత స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన సీట్లు నామమాత్రమే. దాని బలం, బలగం అంతే. ఈసారి ఏదో సీట్లు కురిసే అద్భుతాలేం జరగవు. అసలు ఏ రాష్ట్రంలోనైనా స్థానిక ఎన్నికల్లో పోటీ అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షానికి తప్ప మూడో పార్టీకి రెలవెన్స్ ఉండదు. సో.. బీజేపీ అవుటాఫ్ సిగ్నల్ ఏరియానే!
ఈసారీ ఓడితే గ్రాండ్ ఓల్డ్ పార్టీ మిగిలేనా?: దేశంలో మఖలో పుట్టి పుబ్బలో మాయమైన పార్టీలు ఏవైనా ఉన్నాయి అంటే అవి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన నాయకులు పెట్టిన పార్టీలు మాత్రమే. ఇలాంటివి డజన్ల కొద్దీ ఉన్నాయి. వాస్తవానికి అవి స్వభావరీత్యా ప్రాంతీయ పార్టీలే కాదు. పార్టీలో పదవులు రాక బయటకు వచ్చినవాళ్లు పెట్టుకున్న వ్యక్తి కేంద్ర సొంతపార్టీలు మాత్రమే. అలాంటి పార్టీలకు ప్రాంతీయ ఎమోషన్లూ ఉండవు. ప్రాంతం కోసం ఉద్యమించే ప్రణాళికా ఉండదు. అవి అధిష్ఠానాన్ని బెదిరించడానికో, బ్లాక్మెయిల్ చేయడానికో పెట్టుకున్న దుకాణాలు మాత్రమే.
ఇలా కాంగ్రెస్ నుంచి వచ్చి వ్యక్తివాదంతో పెట్టిన సొల్లు పార్టీలు మాత్రమే కనుమరుగు కావడమో, లేకుంటే సిగ్గులేకుండా కాంగ్రెస్‌లో విలీనం కావడమో జరిగాయి తప్ప ఒక సిద్ధాంతం ప్రాతిపదికన.. లేదా ఒక జాతి ఆకాంక్షలకు ప్రతీకగా.. లేదా తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల మీద తిరుగుబాటుగా పుట్టిన ప్రాంతీయ పార్టీలేవీ దేశ రాజకీయాల్లో చెక్కు చెదరలేదు. ఒకటీ అరా అవకాశవాదులు, పదవుల కోసం వెంపర్లాడే స్వార్థపరులు పెట్టుకున్న పార్టీలే తమను తాము అమ్ముకున్నప్పుడు మాత్రమే అడ్రస్ లేకుండాపోయాయి.
గత 70 ఏండ్ల నుంచి కాంగ్రెస్‌లో పదవులు రాని ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఏదో పార్టీ పెట్టడం.. ఒకటి రెండు ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ ఓట్లు చీల్చి తానోడటం, కాంగ్రెస్‌ను ఓడించడం, తర్వాత కాంగ్రెస్సే తలుపులు బార్లా తెరిస్తే సొంత ఇంటికి వెళ్తున్నానంటూ పళ్లికిలించి ప్రకటించి పార్టీలను విలీనం చేయడం. ఇలాంటి తంతు చాలాకాలం నడిచింది.
అయితే ఆ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడా స్టేజీని దాటిపోయింది. ఇప్పుడు విలీనాలు లేవు. స్వగృహ ప్రవేశాలు లేవు. ఉన్న నాయకుడు ఎవడు, ఎప్పుడు ఏ పార్టీలో చేరిపోతాడో అని కాపలా కాసుకునే స్థితి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కనీసం వందో, యాభయ్యో సీట్లు రాకుంటే అడ్రస్ గల్లంతయ్యేది కాంగ్రెస్ పార్టీయే. రాహుల్ నేతృత్వంలో ఇప్పటిదాకా పార్లమెంటుకు, వివిధ అసెంబ్లీలకు జరిగిన సుమారు 46 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిందని ఆ మధ్య ఓ పత్రిక రాసింది.
పాపం ఎప్పుడూ అమ్మ.. బొమ్మ అంటూ గాంధీల బొమ్మలు పెట్టుకొని గెలిచే అలవాటున్న ఆ పార్టీలోని నాయకులు, తమ నాయకుడి ఆధ్వర్యంలో ఆయన బొమ్మ పెట్టుకుంటే ఇక ఎప్పటికీ గెలుపు చూడలేమనేది మరోసారి నిర్ధారణ అయితే కుప్పకూలేది కాంగ్రెస్ మాత్రమే! ఇప్పటికీ తాము కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఒక్కడంటే ఒక్క నాయకుడూ చెప్పుకోలేని ఆ పార్టీ.. ఇంకెంతో కాలం నిలిచి ఉంటుందని అనుకోలేం. జూన్ 4న తేలేది దేశ భవిష్యత్తే కాదు.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా!!
ఎస్జీవీ శ్రీనివాసరావు