‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు. మరి ఆ అన్నాన్ని ఆరుగాలం కష్టించి పండించి మనకు అందించే రైతును ఎలా చూడాలి? ముద్దముద్దకూ ‘అన్నదాతా సుఖీభవ’ అని మొక్కాల్సిందే కదా. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’ అని నానుడి. అలాంటి రైతును ఎలా చూసుకుంటారనేదే రాజకీయ పార్టీల చిత్తశుద్ధికి గీటురాయి అవుతుంది. పైపై ప్రేమలు, పెదవితీపి మాటలు ఎన్నయినా చెప్పొచ్చు. ఆచరణలో ఏం చేశారనేది అంతిమంగా నిలుస్తుంది. మన రాష్ర్టానికి సంబంధించి గల్లీ పార్టీ బీఆర్ఎస్, ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రైతుల పట్ల అనుసరించిన తీరును పరిశీలిస్తే ఎవరేమిటో తెలిసిపోతుంది. సాగు సాగనీయకుండా అరిగోసపెట్టి అన్నదాతలను ఆత్మహత్యల వైపు నెడుతున్న కాలంలో ఉన్నాం మనం. కాళేశ్వరం పంపుల కట్కలు వేసి జలాశయాలు నింపాలని బతిమాలినా, బామాలినా ససేమిరా అంటూ మొండికేసిన తొండి పాలకుల పాలన ఫలితం ఇది. ఉద్యమకాలంలోనైనా, తొమ్మిదిన్నరేండ్ల పాలనా కాలంలోనైనా కేసీఆర్ నిరంతరంగా ఆలోచించింది రైతన్నల గురించే. ఎక్కడ రైతులకు కష్టం వచ్చినా రెక్కలు కట్టుకొని వాలేది బీఆర్ఎస్ ఒక్కటే. ఆపన్నహస్తం అందించేది, గుండెనిండా రైతన్న సంక్షేమాన్ని నింపుకొన్నది గులాబీ పార్టీ ఒక్కటే. ఇందుకు గత పాతికేండ్ల పైచిలుకు ప్రస్థానంలో బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు, అధికార పగ్గాలు అందిపుచ్చుకున్నాక అనుసరించిన విధానాలు నిలువెత్తు నిదర్శనాలు. తెలంగాణ కోసం దశాబ్దన్నర కాలం సాగించిన పోరాటంలో రైతుల సమస్యలనే ఆయుధంగా మలచుకోవడం ఓ చరిత్ర. ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడిన బీఆర్ఎస్ మొదటి నుంచి రైతు సమస్యలను ఉద్యమానికి కేంద్రబిందువుగా చేసింది.
గ్రామీణ తెలంగాణను కుదిపేసిన కరువు, సాగునీటి కొరత, అప్పుల భారం, రైతుల ఆత్మహత్యలు, నిర్లక్ష్యానికి గురైన చెరువులు-ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో కీలకాంశాలుగా మారాయి. యావత్తు ఉద్యమకాలంలో రైతుల వెంట నడిచింది బీఆర్ఎస్. ఇక ప్రజల ఆశీర్వాదంతో రెండు విడతలు అధికార పగ్గాలు చేపట్టినప్పుడు రైతు చుట్టే పాలనా విధానాలు అల్లుకోవడం ఓ ఘనమైన గతం. బీఆర్ఎస్ పాలనలో నీరు పారింది. ఎవుసం తీరు మారింది. రైతు రాజయ్యాడు. కాళేశ్వర జలకళతో సాగు సమున్నతంగా నిలబడింది. ఉచిత కరెంటు ఊతమయ్యింది. విత్తనాలు, ఎరువులు అవసరమైనంత మేర సమకూర్చడం, ఆపై రైతుబంధు పంటసాయం అందించడం మొదలు కుని, చివరి గింజవరకు కొనడం, పెరిగిన పంట దిగుబడులకు అనువుగా గోదాముల సామర్థ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచడం దాకా సాగుకు అదొక స్వర్ణయుగం.
ఇప్పుడు అదంతా తారుమారైంది. ఓటు చేజారి, సర్కార్ మారింది. మాయదారి మాటల మోసకారి కాంగ్రెస్ పాలనలో సాగు ఆగమైంది. విత్తనాలు, ఎరువులు దొరుకడంలేదు. పంటసాయం అందుతుందన్న భరోసా ఎప్పుడో పోయింది. అప్పోసప్పో జేసి పంట పండిస్తే కొనుగోళ్లు జరుపక ముప్పుతిప్పలు పెడుతున్నారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసినట్టుగా పేదరైతుల భూములు గుంజుకొని పెద్దలకు ధారాదత్తం చేయడమే పనిగా పెట్టుకొన్నది సర్కార్. ఇదేమని అడిగితే రైతుల వీపుల మీద పోలీసు లాఠీలు విరుగుతున్నాయి. దొంగలకు సద్దిగట్టే ఇంటిదొంగలు. ఇప్పుడు తెలంగాణలో సాగు అనేది సర్కార్కు ఏమాత్రం పట్టని ఓ అనాథ. మరోమారు ఈ గడ్డ మీద రైతన్నల మృత్యుఘోష మిన్నంటుతున్నది. అందుకే మరోసారి బీఆర్ఎస్ అన్నదాతల కోసం వీధుల్లోకి వచ్చింది. సర్కార్ను అనుక్షణం నిలదీస్తూ ఆందోళనలు చేపడుతున్నది. ఉసురు తీసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థికంగానూ చేయూత అందిస్తున్నది. ఇదీ రైతుల పట్ల ప్రేమ.
అటు ఢిల్లీలో పన్నెండేండ్లుగా చక్రం తిప్పుతున్న బీజేపీ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. స్వదేశీ నినాదాన్ని వల్లించే ఈ పార్టీకి కార్పొరేట్లే చుట్టాలు. వారి విధానాల్లో రైతుల స్థానం అట్టుడుగుననే. నల్లచట్టాలు తెచ్చి కార్పొరేట్లకు రైతులతో ఊడిగం చేయించాలనే ప్రయత్నించడం, కనీవినీ ఎరుగని రీతిలో రైతుల ఢిల్లీ ముట్టడితో తోకముడవటం చూశాం. ఆ ఆందోళనలో అమరులైన రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయం అందించిన చరితార్థమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికా దిగుబడులతో భారతీయ వ్యవసాయాన్ని నాశనం చేయాలని కేంద్రం చూస్తుండటంతో రైతులు మరోసారి సమరశంఖం పూరిస్తున్నారు. రెండు జాతీయ పార్టీల తీరుతెన్నులు తెలిసిన రాష్ట్ర రైతులు తమ పార్టీ ఏదో ఎప్పుడో అర్థం చేసుకొన్నారు. అందుకే తమ ఇంటిపార్టీ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే బాగుంటుందని రైతులు పదేపదే తలపోసుకుంటుండటం గమనార్హం. అన్నదాతకు ఆసరాగా నిలిచే రైతు బాంధవుడి పాలన కోసం నిరీక్షిస్తున్నారు.