బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు చరిత్రాత్మకం. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే కేసీఆర్‌తో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ జతకలిశారు. నిజం అంత తొందరగా, సులువుగా అర్థం కాదు. ఐన్‌స్టీన్ చెప్పినట్టు.. విశ్వంలో యూనివర్సల్ సత్యం గానీ, అసత్యం గానీ ఉండవు. ప్రతిదీ సాపేక్షంగానే ఉంటుంది. తెలంగాణ పడక కుర్చీ మేధావులారా.. ఆర్ఎస్పీ-కేసీఆర్ దోస్తీని కూడా సాపేక్షంగానే చూడాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకమా? అనుకూలమా? అనేదే అసెంబ్లీ ఎన్నికల ఎజెండా. రానున్న ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలా? కొనసాగించాలా? అనేదే ప్రస్తుత చర్చ. మతం పేరుతో రెచ్చగొడుతూ, రాజ్యాంగాన్ని మార్చాలనే లక్ష్యంతో బీజేపీ ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నదనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు, ప్రజాస్వామికవాదుల పాత్ర ఎలా ఉండాలి? ఎన్నికల్లో మన ప్రయాణం ఎటువైపు ఉండాలనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
తెలంగాణలోని బహుజనుల అస్తిత్వం కోసం ఆర్ఎస్పీ ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంతమేరకు ప్రభావం చూపింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఇది తెలంగాణ సమాజానికే కాదు, దేశ భద్రతకు, లౌకికవాదానికి ప్రమాదకరం. భారత రాజ్యాంగాన్ని మార్చాలని బలంగా ముందుకువెళ్తున్న బీజేపీని కట్టడి చేయడం కేసీఆర్‌తోనే సాధ్యమని ఆర్ఎస్పీ విశ్వసించారు. ఎన్నికల్లో పొత్తు ద్వారానే అది సాధ్యమవుతుందని భావించిన ఆర్ఎస్పీ ఆ దిశగా కీలక అడుగులు వేశారు. ఆనాడు కాన్షీరాం తప్పటడుగులు వేశారని కొందరు నిందించారు. కానీ, కాలక్రమంలో కాన్షీరాం తీసుకున్న నిర్ణయం ఓ చారిత్రక మైలురాయిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆర్ఎస్పీ వేస్తున్న అడుగుల వెనుక కూడా అదే పరమార్థం దాగి ఉన్నది. ప్రజల అమాయకత్వం, విశ్వాసాలనే ఆయుధంగా చేసుకొని మతం పేరు చెప్పుకొని రోజురోజుకు బలపడుతున్న బీజేపీని కట్టడి చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. మతోన్మాదంతో రెచ్చగొడుతూ దేశాన్ని విభజించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. ఇది మన దేశానికి ప్రమాదకరం. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన శక్తులు, పార్టీలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నాయి. ఇది ముమ్మాటికీ పరోక్షంగా బీజేపీకి లాభం చేయడమే అవుతుంది.
లౌకిక పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్.. బాబ్రీ మసీదు కూల్చివేతను అధికారంలో ఉండి కూడా ఎందుకు అడ్డుకోలేదు? ఆనాడు జరిగిన అల్లర్లు, హత్యలు, అత్యాచారాలను నివారించేందుకు ఆ పార్టీ చేసిన కృషి ఏమిటి? పైగా నాడు జరిగిన అఘాయిత్యాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించడంలోనూ విఫలమైంది. దీంతో సరైన సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు ఆ కేసులను కొట్టివేసింది. గుజరాత్, మణిపూర్ ఘటనల్లో కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం ఏమైంది? ముస్లింలు, క్రైస్తవులపై జరిగిన దాడుల విషయంలోనూ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరినే అనుసరించిందనేది చరిత్ర చెప్తున్న సత్యం.
వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన రోజుల్లో కూడా మట్టి మనుషులు, దళిత, గిరిజన, బహుజనుల అణచివేతకు కాంగ్రెస్, బీజేపీలు రజాకార్లకు, బ్రిటిష్‌వారికి మద్దతుగా నిలిచిన చారిత్రక సత్యం మన ముందున్నది. ఈ సత్యాలు కాన్షీరాంకు తెలుసు, ఆర్ఎస్పీకి తెలుసు. అందుకే వారి అడుగులు బహుజన సమాజం వైపు పడ్డాయి. అందుకు మాయావతి చేయూతనిస్తున్నారు.
బహుజనవాదాన్ని వదిలేస్తే కేంద్ర, రాష్ట్ర మంత్రి కావడం ఆర్ఎస్పీకి పెద్ద కష్టం కాదు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగుకు నెట్టివేసిన కులంలో జన్మించిన ఆర్ఎస్పీ.. ఎంతో కృషి, పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఎంతోమంది బహుజన బిడ్డలను శిఖరాగ్రానికి చేర్చారు. దేశంలో అన్ని వ్యవస్థలను రాజకీయ వ్యవస్థ మాత్రమే శాసిస్తున్నదనే వాస్తవాన్ని గ్రహించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సేవ కోసం ఏడేండ్ల సర్వీస్‌ను వదిలేశారు. కాన్షీరాం, మాయావతి వారసునిగా బహుజన సమాజం కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది మేధావులు, నాయకులు ఆర్ఎస్పీని విమర్శిస్తున్నారు. ఆధిపత్య పార్టీలపై ఆయన ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పుడు వారంతా ఎక్కడున్నారు? తాత్కాలిక ఉపశమనం కోసం ఆధిపత్య పార్టీల గొడుగు కింద తలదాచుకుంటున్నారనే వాస్తవం అందరికీ తెలుసు. అటువంటి వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సత్యాన్ని నమ్మనివారి గురించి ఆలోచించడం దండుగ.
తెలంగాణ సమాజంలో మెజారిటీలైన దళిత, గిరిజన, ఆదివాసీ, వెనుకబడిన (వెనుక వేయబడిన) వర్గాలు ఆర్ఎస్పీతో కలిసిరావాలి. బహుజనుల ఆత్మగౌరవం కోసం మరో అడుగు వేద్దాం. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు తెలంగాణ సమాజం ముందుకు రావాలి. మన రాముడు కాన్షీరాముడు. బహుజనుల ఆరాధ్యులు బుద్ధుడు, పూలే, సావిత్రీబాయి, అంబేద్కర్. వారి ఆశయాల బాటలో నడుద్దాం. ఆర్ఎస్పీ- కేసీఆర్ మైత్రిని బలపరుద్దాం.
(వ్యాసకర్త: రాజకీయ, సామాజిక విశ్లేషకులు)
-డాక్టర్ పీసీ వీరస్వామి
94944 46262