బీజేపీ ఎట్టకేలకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఓడించింది. కేంద్రంలో గత పదేండ్లకు పైగా అధికారం చెలాయిస్తున్న పార్టీకి ఇది చిరకాల స్వప్నం. అయితే సీట్ల పరంగా బీజేపీకి చాలానే వచ్చినప్పటికీ ఓట్ల పరంగా పెద్ద తేడాలేకపోవడం గమనార్హం. గెలిచిన, ఓడిన పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం రెండు శాతం లోపే ఉండటం గమనార్హం. ఇది బీజేపీ విజయమా? ఆప్ ఓటమా? అనే సందిగ్ధాన్ని కలిగించాయి ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు. బీజేపీ మీద కన్నా ఆప్ మీదే అస్ర్తాలను సంధిస్తూ రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి ఓ ఆరు శాతం ఓట్లు, సున్నా సీట్లు వచ్చాయి. బీజేపీని ఓడిస్తామని చెప్పుకొని తిరిగే కాంగ్రెస్ ఇలా ఆ పార్టీ గెలుపునకు పరోక్షంగా ఎలా సాయపడింది? అనేది ప్రశ్న. బీజేపీని ఓడించాలనే లక్ష్యాన్ని మధ్యలోనే గాలికి వదిలేసిందా? బీజేపీకి బీ టీమ్’గా మారిందా? అనే సందేహం రాకమానదు.
ఏదేమైనప్పటికీ ఆప్ గ్రాఫ్ పడిపోయింది. జాతీయ పార్టీలమని విర్రవీగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను అంటుకు లేకుండా మట్టికరిపించడం ద్వారా ‘ఆప్’ తొలిసారిగా అధికారం చేపట్టింది. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించింది. కేంద్రానికి పక్కలో బల్లెంలా తయారైంది. రెండో రాష్ట్రమైన పంజాబ్‌లోనూ గెలిచి నేనూ జాతీయ పార్టీనే అని సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది. అటు కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ‘ఆప్’ పరిపాలనకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. లెఫ్టినెంట్ గవర్నర్‌తో అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుని వేధించింది. ఈ వైరం అభివృద్ధికి ఆటంకంగా పరిణమించి, ప్రజలకు దీనివల్ల విసు గు కలిగి ఉండవచ్చు. పైగా బీజేపీ అతిరథ మహారథుల్ని ప్రచారం రంగంలోకి దిం పిం ది. ప్రధాని నరేంద్ర మోదీ ఆప్దా (ఆపద) విముక్తి అంటూ ఇచ్చిన పిలుపు ప్రభావం చూపింది. మహారాష్ట్రలో బీజేపీ ‘బటేంగే తో కటేంగే’ (విడిపోతే ఓడిపోతాం) నినాదంతో జరిపిన ప్రచారాన్ని ఇది గుర్తు చేసింది.
పన్నెండేండ్ల పరిపాలన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పైగా కాలుష్యంతో పాటుగా నగరం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చడంలో ‘ఆప్’ ఎదుర్కొన్న వైఫల్యాలు ఓటమికి దారితీశాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి పుట్టుకు వచ్చిన పార్టీ చివరకు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఓడిపోవడం విచిత్రమే. ఆ ఆరోపణల్లో నిజమెంత అనేది వేరే విషయం. అవి కోర్టులో ఎంతవరకు నిలుస్తాయనేది సందేహమే. కానీ పదేపదే అవినీతి గురించే బీజేపీ రచ్చ చేసింది. ముఖ్యమంత్రి సహా ఆ పార్టీ సీనియర్ నేతలను జైలులో వేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఎంత వ్యూహాత్మకంగా తిప్పికొట్టినా ప్రజల మనసుల్లో అనుమానాలు కలిగించడంలో బీజేపీ కృతకృత్యమైంది. ఈ విషయంలో కేంద్రం పెంపుడు జంతువుల్లాంటి ఈడీ, సీబీఐ వంటి సంస్థలు నిర్వహించిన సహాయక పాత్రను తక్కువగా అంచనా వేయలేం.
‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా ఢిల్లీ ఫలితాలు ఇండియా కూటమికి చావుదెబ్బగా పరిణమించాయి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కొడిగట్టిన దీపంలా తయారైన ఐక్యత ‘ఆప్’ పరాజయంతో కొండెక్కింది. పరస్పర విమర్శలు చూస్తుంటే కూటమి పార్టీలకు ఉమ్మడి లక్ష్యం, ధ్యేయం అనేవి ఉన్నాయా అనిపిస్తుంది. ‘హర్యానాలో మా ఓటమికి ‘ఆప్’ కారణం కనుక ఢిల్లీలో ఆ పార్టీని ఓడించి చూపాం’ అనేది కాంగ్రెస్ వాదనగా కనిపిస్తున్నది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యానికి ఇండియా కూటమి అడ్డుకట్ట వేయగలిగింది. అయితే అదే సమయంలో అది పూర్తిస్థాయి విజయం తెచ్చిపెట్టలేకపోయింది. తర్వాత వరుస ఎదురుదెబ్బలతో ఇండియా కూటమి క్షీణదశకు చేరుకున్నది. అటు పార్లమెంటు ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించుకోలేక చతికిల పడ్డ బీజేపీకి ఢిల్లీ విజయం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. దేశంలో విపక్షం ముక్కచెక్కలు అవుతుండటం ఆ పార్టీకి అదనపు శక్తిని ఇస్తుందని చెప్పవచ్చు.