అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ బీసీలను ప్రసన్నం చేసుకుని అధికారంలోకి రాగలిగింది. ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 23 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచేందుకు కులగణన నిర్వహించింది. అంతవరకు బాగానే ఉన్నా, రాష్ట్రంలో సగానికిపైగా ఉండాల్సిన బీసీ జనాభాను 46 శాతంగా చూపిస్తుండటం వివాదానికి కారణమైంది. సర్వే నివేదికపై మండిపడుతున్న బీసీ సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీసీల జనాభాను కులాల వారీగా లెక్కించి రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పిస్తారని ఆశించిన బీసీల నోట్లో కాంగ్రెస్ మట్టికొట్టింది. కేసీఆర్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 51.1 శాతంగా ఉన్న బీసీల జనాభా ఇప్పుడు ఏకంగా 5 శాతం మేర తగ్గించి చూపడం వెనక కుట్ర ఉన్నది. బీసీలను ఈ ప్రభుత్వం నిలువునా మోసం చేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో బీసీలకు చేసింది ఏమీ లేదు. జ్యోతిబా ఫూలే పేరుతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ గత బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు. రాబోయే ఐదేండ్లలో బీసీ సంక్షేమానికి లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు పైసా కూడా విదల్చలేదు. ప్రత్యేకంగా ఎంబీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా హామీగానే మిగిలిపోయింది. అసలు బీసీ జనాభా 5 శాతం ఎందుకు తగ్గింది? వారంతా ఏమయ్యారన్నవి శేష ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఎవరికో మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా బీసీలతో దాగుడు మూతలు ఆడుతున్నది. ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను కాపాడేందుకే బీసీ లెక్కలను తక్కువగా చూపుతున్నారా? అన్న అనుమానం బీసీల్లో బలపడుతున్నది. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ పట్ల బీసీ నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఏకంగా బీసీ జనాభా శాతాన్నే తగ్గించడం వారిని మరింత నిరాశకు గురిచేసింది. ఈ అసంతృప్తికి ఏదో ఒక రోజు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోకతప్పదు. ప్రభుత్వం ఇప్పటికైనా చేసిన తప్పును సవరించుకుని బీసీల రాజకీయ, ఆర్థిక, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా అడుగు వేయాలి. లేదంటే బడుగు, బలహీన వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదు.
– కె.శ్రావణ్‌కుమార్, 80960 49770