ఇరవై ఏండ్ల పోరాట ఫలితంగా బంజారాలకు 1976లో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు దక్కాయి. నాటి నుంచి కాంగ్రెస్ పాలనలో మంత్రిమండలికి బంజారా జాతి ప్రాతినిధ్యం వహించింది తొమ్మిదేండ్ల ఐదు నెలలు మాత్రమే. టీడీపీ పదిహేడు ఏండ్ల పాలనలో 1989లో ఎన్టీ రామారావు మంత్రివర్గంలో అజ్మీరా చందులాల్‌కు మంత్రిగా అవకాశం దక్కింది. ఆ తర్వాత 1995-2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ బంజారా జాతికి తన మంత్రిమండలిలో అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన దారిలోనే తన శిష్యుడు రేవంత్‌రెడ్డి కూడా నడుస్తుండటం గమనార్హం.
తెలంగాణలో సుమారు ఏడు శాతం జనాభా ఉన్న బంజారాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని సందర్భాలు రెండే రెండు. ఒకటి, చంద్రబాబు హయాంలో, రెండు ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనలో. బంజారా ఓట్లను వాడుకొని అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు బంజారాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. తన మంత్రిమండలిలో బంజారాలకు అవకాశం ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం.
పద్నాలుగేండ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో బంజారా జాతి కేసీఆర్ వెన్నంటే నిలిచింది. ఆ తర్వాత కూడా పదేండ్ల పాటు గిరిజన బిడ్డలు గులాబీ జెండాకు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని గ్రహించిన కేసీఆర్ రెండు పర్యాయాలు తన మంత్రివర్గంలో బంజారాలకు అవకాశం కల్పించారు. మొదటి పర్యాయం అజ్మీరా చందులాల్, బీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టాక సత్యవతి రాథోడ్ మంత్రులుగా బంజారా జాతికి ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరు కలిసి ఏడేండ్ల 9 నెలల పాటు మంత్రులుగా సేవలందించారు.
బీఆర్ఎస్ పాలనలో బంజారాల అభ్యున్నతికి కేసీఆర్ ఎంతో కృషి చేశారు. ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించి బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించారు. బంజారాహిల్స్‌లో సేవాలాల్ పేరిట ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించారు. ‘మా తండాలో మా రాజ్యం’ కలను సాకారం చేస్తూ తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయం పాలనకు పునాది వేశారు. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్ర తేజావత్ను నియమించారు. గవర్నర్ కోటాలో రాములు నాయక్‌కు ఎమ్మెల్సీగా అవకాశమి చ్చారు. నాతోపాటు గాంధీ నాయక్, వాలియా నాయక్‌లకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించారు. టీఎస్పీఎస్సీ సభ్యులుగా డాక్టర్ చంద్రావతి రమావత్ ధన్సింగ్ నాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులుగా రాంబల్ నాయక్, రాంబాబు నాయక్, సమాచార కమిషనర్‌గా గుగులోతు శంకర్ నాయక్‌లకు అవకాశం ఇచ్చి బంజారా జాతిని గౌరవించారు. అంతేకాదు, 70 ఏండ్ల స్వతంత్ర భారత్‌లో ఎన్నడూ వెలుగులకు నోచుకోని తండాల్లో 24 గంటల కరెంట్‌ను సరఫరా చేశారు. రాష్ట్రంలోని 58 నియోజకవర్గాల్లో బంజారా ఆత్మగౌరవ భవనాలను నిర్మించారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలు నిర్మించి గిరిజన జాతి ఉన్నతికి తోడ్పడ్డారు. నాలుగు లక్షల ఎకరాల పోడు పట్టాలు పంచిపెట్టిన కేసీఆర్‌ను బంజారా జాతి ఎప్పటికీ మర్చిపోదు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాయమాటలను నమ్మి, ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులై అందరిలాగానే గిరిజన జాతి కూడా మోసపోయింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడటంలో 30-45 నియోజకవర్గాల్లోని గిరిజనుల ఓట్లు కీలకపాత్ర పోషించాయి. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం నేడు తన మంత్రిమండలిలో బంజారాల గళం లేకుండా చేశారు. కేసీఆర్ సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేసి, గిరిజనులను నమ్మించి మోసం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు యావత్ బంజారా జాతి సిద్ధంగా ఉన్నది.
(వ్యాసకర్త: తెలంగాణ ట్రైకార్ మాజీ చైర్మన్, బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు)
-ఇస్లావత్ రాంచందర్ నాయక్
98498 25386