తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి రంగంలో కీలక సంస్థగా ఉన్న టీజీజెన్కోలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)కు సంబంధించిన రూ.255 కోట్ల విలువైన ఏహెచ్‌పీ (Ash Handling Plant), సీహెచ్‌పీ (Coal Handling Plant) ఆపరేషన్, మెయింటెనెన్స్ టెండర్ తీవ్ర చర్చకు దారి తీస్తున్నది. మూడేండ్ల కాలానికి ప్రతిపాదించిన ఈ టెండర్ కేవలం మానవవనరుల కొరతను భర్తీ చేసే చర్య మాత్రమే కాకుండా, సంస్థలోని కీలక ఇంజినీరింగ్ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నమనే అభిప్రాయం ఇంజినీరింగ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ అనేవి విద్యుత్తు ఉత్పత్తి ప్రక్రియలో అంతర్భాగాలు. బొగ్గు బంకర్లకు చేరకపోతే విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోతుంది. బూడిదను తరలించకపోతే యూనిట్ల నిర్వహణ, పర్యావరణ అనుమతులు, ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటాయి. ఇలాంటి కీలక వ్యవస్థల నిర్వహణ, ఆపరేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, సీ అండ్ ఐ, డీసీఎస్, పీఎల్సీ, ట్రబుల్ షూటింగ్, బ్రేక్‌డౌన్ మెయింటెనెన్స్ వంటి బాధ్యతలను పూర్తిగా కాంట్రాక్టర్‌కు అప్పగించటం వల్ల సంస్థ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీజీజెన్కోలో ఇంజినీర్లు ప్లాంట్‌ను కేవలం రోజువారీ ఆపరేషన్ కోణంలో కాకుండా, దీర్ఘకాలిక ఆస్తిగా చూస్తారు. వేల కోట్ల రూపాయల విలువైన యంత్రాల జీవితకాలం, విశ్వసనీయత, భవిష్యత్ పనితీరు, బలహీనతలు, మూలకారణాల విశ్లేషణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అయితే కాంట్రాక్టర్ ప్రధాన లక్ష్యం కాంట్రాక్ట్ కాలంలో పనిని పూర్తిచేయటమే. యంత్రాల 20-30 సంవత్సరాల జీవితకాలం, భవిష్యత్ పనితీరు, మూల కారణాల నివారణ వంటి అంశాలపై అదే స్థాయి బాధ్యతాభావం ఉండకపోవచ్చని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. పరికరం చెడిపోతే దాని ప్రభావాన్ని దశాబ్దాల పాటు భరించేది జెన్కో. కానీ కాంట్రాక్టర్ బాధ్యత కాంట్రాక్ట్ ముగిసే వరకే ఉంటుందని పలువురు సీనియర్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఏహెచ్‌పీ, సీహెచ్పీల నిర్వహణ ద్వారా అసిస్టెంట్ ఇంజినీర్లు, ఏడీఈలు, డీఈలు ప్రాక్టికల్ అనుభవాన్ని సంపాదిస్తున్నారు. కన్వేయర్లు, వ్యాగన్ టిప్లర్లు, క్రషర్లు, స్టాకర్ రిక్లైమర్లు, పీఎల్సీలు, డీసీఎస్‌లు, ఇన్స్ట్రుమెంటేషన్ వ్యవస్థలపై లోతైన అవగాహన పొందుతున్నారు. రానున్న రోజుల్లో ఈ బాధ్యతలన్నీ కాంట్రాక్టర్‌కు వెళ్లిపోతే రాబోయే తరాల ఇంజినీర్లకు నేర్చుకునే అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫలితంగా టీజీజెన్కోలో సాంకేతిక నైపుణ్యం క్రమంగా తగ్గిపోవచ్చని భావిస్తున్నారు.
ఈ టెండర్‌పై ఇంజినీర్ల ప్రధాన అభ్యంతరం ప్రమోషన్ల భవిష్యత్తు. ప్రస్తుతం అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి ఏడీజీ, డీజీ, ఎస్ఈ, సీఈ స్థాయిలకు ఎదగటానికి అవసరమైన ఫీల్డ్ అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం, ఆపరేషనల్ నాయకత్వం ఈ విభాగాల ద్వారా లభిస్తున్నది. ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ వంటి ప్రధాన విభాగాలు పూర్తిగా అవుట్సోర్స్ అయితే భవిష్యత్ ఇంజినీర్లు కేవలం కాంట్రాక్ట్ మానిటరింగ్ అధికారులుగా మారే ప్రమాదం ఉన్నదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. టీజీజెన్కోలో ఇప్పటికే కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున నియామకాలు జరుగలేదని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా అవుట్‌సోర్సింగ్‌ను ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో కొత్త భర్తీల అవసరం లేదనే వాదన బలపడే అవకాశం ఉన్నదని వారు అంటున్నారు. ఇది యువ ఇంజినీర్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయటమే కాకుండా, సంస్థలో శాశ్వత సాంకేతిక సిబ్బంది సంఖ్యను క్రమంగా తగ్గించే ప్రమాదాన్ని కలిగిస్తుందని పేర్కొంటున్నారు.
మూడేండ్లకు రూ.255 కోట్ల వ్యయం అంటే సంవత్సరానికి సుమారు రూ.85 కోట్ల ఖర్చు. ఇదే మొత్తాన్ని సిబ్బంది హేతుబద్ధీకరణ, ఖాళీల భర్తీ, ప్రమోషన్లు, సాంకేతిక శిక్షణలపై వినియోగిస్తే సంస్థకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా టీజీజెన్కోలో ఇప్పటికే మానవవనరుల హేతుబద్ధీకరణపై కమిటీని నియమించిన నేపథ్యంలో, ఆ కమిటీ నివేదిక రాకముందే ఇంత భారీ అవుట్సోర్సింగ్ ఒప్పందం చేపట్టటం సరైందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్న అత్యంత పెద్ద ఆందోళన ఏమిటంటే.. ఇది కేవలం ఏహెచ్‌పీ, సీహెచ్పీలకే పరిమితం కాకపోవచ్చు. ఈరోజు బొగ్గు, బూడిద నిర్వహణను అవుట్సోర్స్ చేస్తే రేపు డీఎం ప్లాంట్, వాటర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, బాయిలర్ ఆక్సిలరీలు, టర్బన్ ఆక్సిలరీలు, చివరకు ఉత్పత్తి కార్యకలాపాలే ప్రైవేట్ సంస్థలకు వెళ్లే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రైవేటీకరణ ఒక్కరోజులో జరగదు. ముందుగా విభాగాల అవుట్సోర్సింగ్, తర్వాత కీలక కార్యకలాపాల బదిలీ, ఆపై సంస్థ అంతర్గత సామర్థ్యం క్షీణించటం ద్వారా క్రమంగా జరుగుతుందని ఉద్యోగ సంఘాల వాదన.
ఇంజినీర్ల సంఘాలు స్పష్టం చేస్తున్నది ఒక్కటే. వైటీపీఎస్‌లో మానవ వనరుల కొరత వాస్తవమే. అయితే దానికి పరిష్కారం అవుట్సోర్సింగ్ కాదని, హేతుబద్ధీకరణ, నియామకాలు, పెండింగ్ ప్రమోషన్లు, సాంకేతిక సిబ్బంది బలోపేతమేనని వారు చెబుతున్నారు. జెన్కో భవిష్యత్తు, ఇంజినీర్ల కెరీర్ పురోగతి, సంస్థ సాంకేతిక స్వావలంబన, రాష్ట్ర విద్యుత్తు ఉత్పత్తి భద్రత దృష్ట్యా ఏహెచ్‌పీ, సీహెచ్‌పీ వంటి కీలక విభాగాలు టీజీజెన్కో ఇంజినీర్ల ఆధ్వర్యంలోనే కొనసాగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించిన ఈ టెండర్ ఇప్పుడు కేవలం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు. ఇది టీజీజెన్కో భవిష్యత్తు, ఇంజినీరింగ్ క్యాడర్ స్థిరత్వం, భవిష్యత్ నియామకాలు, ప్రమోషన్లు, సాంకేతిక స్వతంత్రత, ప్రభుత్వ రంగ విద్యుత్తు ఉత్పత్తి సంస్థల దిశను నిర్ణయించే కీలక అంశంగా మారింది.
(వ్యాసకర్త: అధ్యక్షుడు, తెలంగాణ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్)
-గువ్వల పవన్ కుమార్