కపట పాలకులు కరువు సృష్టికర్తలు
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్షాలు పడకపోయినా కాళేశ్వరం నీళ్లతో చెరువులు నింపి, పంటలకు నీళ్లిచ్చిన మొనగాడు కేసీఆర్. నేడు నదుల్లో నీళ్లున్నా, వాటిని ఆపి, చెరువులు నింపడం చేతకాక ‘ఎల్ నినో’ పేరిట తప్పించుకొని, పంటలను ఎండబెడుతున్న చేతగానివాళ్లు కాంగ్రెస్ పాలకులు! పచ్చని తెలంగాణలో ‘కృత్రిమ’ కరువును తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నదుల్లో నీళ్లు పారుతున్నా వాటిని ఆపి, చెరువులను నింపే సోయి లేదు.
పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్త్తున్నా పట్టించుకోవడం లేదు ఈ దుర్మార్గపు పాలకులు! రిజర్వాయర్లలో నీళ్లున్నా చెరువులు నింపని చేతగాని, చేవలేని పాలకులు. కేసీఆర్‌పై కక్షతోనే లక్షల ఎకరాల పంటలను ఎండబెడుతున్నారు. అక్టోబర్‌లోనే ఎండాకాలం వచ్చినట్లుగా వాతావరణం మారి, నీళ్లు లేక జనం అల్లాడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం చోద్యం చూస్తున్నా రు! కరువు కోరలు చాచింది. ఈ దయనీయ దృశ్యాలు పల్లెల్లో పునరావృతమవుతుం టే, గుండెలు మండుతున్న రైతన్నలు రోడ్లెక్కి గగ్గోలు పెడుతున్నారు. నదుల్లో నీళ్లున్నా ఆపే తెలివితేటలు లేకపోవడంతో వృథాగా కిందికి పోతున్నాయి. ఏ ఊరిలో చూసినా పంటలు ఎండిపోయి రైతుల కండ్లల్లో కన్నీళ్లు పారుతున్నాయి. స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్ల పాటు పచ్చని పంటలు, నిండుకుండల్లాంటి చెరువులతో కళకళలాడిన తెలంగాణ నేడు మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి బీడుపడిన నేలగా మారుతున్నది. అందుకే ఇది ప్రకృతి ఇచ్చిన కరువు కాదు..ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన ‘కృత్రిమ’ కరువు! పాలకుల అసమర్థత ఒకవైపు, ముందుచూపు లేని పాలన మరోవైపు..వెరసి దాదాపు మూడేండ్ల పాలనలోనే తెలంగాణను మళ్లీ 30 ఏండ్లు వెనక్కి నెట్టేసింది.
తెలంగాణలో నీటికి కొరత లేదు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే సోయి పాలకులకు లేనే లేదు. ఎస్సారెస్పీలో నీళ్లున్నా రైతుల పంటలకు కాలువల ద్వారా విడుదల చేయడం లేదు. మిడ్ మానేరు నిండుగా ఉన్నా కిందనున్న చెరువులను నింపాలన్న ఆలోచన ఏ కోశానా రావడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీళ్లున్నా..రైతుల పొలాలకు వదలకుండా గేట్లు బిగించి కూర్చున్నారు. మేడిగడ్డ నుంచి ఆంధ్రాకు వృథాగా పోతున్న వేలాది టీఎంసీల నీళ్లను ఆపడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఇదేమిటని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు ఎవరు ప్రశ్నించినా జవాబు చెప్పడం చేతగాక తిట్ల దండకం అందుకుంటున్నారు.
కరువు గురించి బీఆర్ఎస్ నాయకులు అడిగితే…బ్రిటన్, జపాన్ దేశాల్లో కాంగ్రెస్ ఉన్నదా? మరి అక్కడ ఎల్ నినో లేదా? అని ఎదురు ప్రశ్నిస్తున్న మంత్రుల అజ్ఞానాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. బ్రిటన్, జపాన్ దేశాల్లో మనలాగా ప్రవహించే కృష్ణా, గోదావరి నదుల్లేవు. కాళేశ్వరం, పాలమూరు లాంటి ప్రాజెక్టులూ లేవు. మన తెలంగాణ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కాల్వలు పారుతున్నాయి, ఒకప్పుడు రాళ్లసీమగా చెప్పుకొన్న రాయలసీమలో కూడా ఇవాళ చెరువులు నిండుతున్నాయి. పొలాలకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. మరి, రాయలసీమలో లేని ఎల్ నినో ప్రభావం..కేవలం తెలంగాణ సరిహద్దు దాటగానే వచ్చిందా? కరువుపై ముందస్తు చర్యలు తీసుకోవడం ఎలాగో తెలియని అనుభవం లేని పాలకులు తమ చేతగానితనాన్ని ప్రకృతిపై నెట్టి, చేతులు దులుపుకొంటున్నారు.
కృష్ణా జలాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే. 2015లో తాత్కాలిక సర్దుబాటు కింద 299ః515 నిష్పత్తిని అంగీకరిస్తే.. దానిపై శాశ్వతంగా అవార్డు ఇవ్వాలని ఆనాడు బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? కృష్ణా ప్రాజెక్టులను (శ్రీశైలం, సాగర్) కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించడానికి అంగీకరించి, తెలంగాణ హక్కులకు మరణశాసనం రాసింది. ఎలాంటి బేరసారాలు లేకుండానే ఆ ప్రాజెక్టుల నియంత్రణను బోర్డులకు వదిలేసి తెలంగాణను ఎండబెట్టింది. కేసీఆర్‌కు పేరొస్తుందనే కుళ్లు రాజకీయ కక్షతోనే ప్రాజెక్టుల మోటర్ల పంపులను బంద్ పెట్టారు. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే, రిపేరు చేయకుండా, దాన్ని నెపంగా పెట్టింది. గోదావరి నీళ్లన్నింటినీ సముద్రంలోకి వృథాగా పోనిస్తున్నది. తప్ప..కాళేశ్వరం పంపులు ఆన్ చేసి చెరువులను నింపడం లేదు. రైతుల పంటలకు నీళ్లివ్వడం లేదు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లిస్తే ఆయనకు క్రెడిట్ వస్తుందనే ఈ కక్షసాధింపు చర్యల వల్ల ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. మళ్లీ సమైక్య రాష్ట్రంలో మాదిరిగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
పంటలు ఎండిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి కనీసం పలకరింపు కరువైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి మొదలుకొని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే రైతులకు ముఖం చాటేశారు. కనీసం ఎండిన పొలాలను పరిశీలించి బాధిత రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొన్నది. ఇవాళ గ్రామాలకు వెళ్తే ఎటుచూసినా, ఎండిన పంటలు, గుండెలు పగిలే దృశ్యాలే కనిపిస్తున్నాయి. పట్టెడు గడ్డి దొరుకక, తాగడానికి చుక్క నీరు లేక పశువులు, నోరు లేని జీవాలు చనిపోతున్నాయి. కళతప్పిన ముఖాలతో రైతులు దీనంగా చూస్తుంటే, గుండెలు అవిసిపోతున్నాయి. ఈ కరువు సమస్య ప్రకృతిది కాదు..ప్రభుత్వం ‘ముందుచూపు’ లేని నిర్లక్ష్యానిది! అని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాళేశ్వరం బరాజ్‌లు నింపాలి, ఆ నీళ్లు తెచ్చి ఊరూరా చెరువులు నింపాలన్న సోయి లేకపోవడంతోనే ఈ నీళ్ల కరువు వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ కక్షసాధింపు చర్యల వల్ల వచ్చిన ఈ కృత్రిమ కరువుకు కాలమే సమాధానం చెప్తుంది. ఈ ‘కరువు’ కపట నాటక సూత్రధారులైన కాంగ్రెస్ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం.
(వ్యాసకర్త: శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుడు)
తక్కెళ్లపల్లి
రవీందర్రావు
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

