‘ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి బయటికి వస్తే ఢిల్లీకి సీఎం చేస్తాం. మీపై సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు ఎత్తివేస్తాం.’…బీజేపీ తన దూతల ద్వారానే కాకుండా సీబీఐ, ఈడీ అధికారులు విచారణకు పిలిచినప్పుడు వారు తనకు ఇచ్చిన ఈ ఆఫర్‌కు సంబంధించి సాక్ష్యాధారాలున్నాయని 2022, ఆగస్టు 22న మనీశ్ సిసోడియా మీడియాకు వెల్లడించారు.
ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియాకు సరిగ్గా ఆరు నెలల కిందట కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇచ్చిన ఆఫర్‌ను తోసిపుచ్చిన పర్యవసానంగా ఇప్పుడు ఆయనకు జైలు తప్పలేదు. తమకు లొంగకపోతే, తాము చెప్పినట్టు వినకపోతే ఊచలు లెక్కపెట్టక తప్పదని కేంద్రంలోని బీజేపీ సర్కార్ పరోక్షంగా ఇచ్చిన సంకేతం ఇది. ఢిల్లీలో తమకు పక్కలో బల్లెంలా ఆప్ ఎదగడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ సర్కార్ ఆ పార్టీని మొదటినుంచి వేధింపులకు గురిచేస్తూనే ఉన్నది. మొదట ప్రలోభాలకు గురిచేయడం, పదవులు ఎర వేయడం అప్పటికీ లొంగకపోతే కేంద్రం తన దొడ్లో కట్టేసుకున్న ఈడీ, సీబీఐ, ఐటీలను రంగంలోకి దింపడం కొత్తేమీ కాదు. గతంలోనూ తమ మాట వినని పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూడా ఈడీ, సీబీఐ, ఐటీల నుంచి వేధింపులను ఎదుర్కొన్నవే. తమపై పెట్టిన కేసులతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మెత్తబడక తప్పలేదు.
ఉద్దవ్ థాక్రే దారికి రాకపోవడంతో ఏకంగా శివసేన పార్టీని నిలువునా చీల్చి ఏక్నాథ్ షిండేను గద్దెనెక్కించిన ఉదంతం ఎరిగిందే. మహారాష్ట్రలోనే కాదు, గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను సైతం కూల్చడానికి దర్యాప్తు సంస్థలనే రంగంలోకి దించింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రదర్శిస్తున్న టక్కుటమారా విద్యలన్నీ జగద్విదితమే. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నదో, బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో స్వయంగా ప్రధాని మోదీ నిస్సిగ్గుగా బయటపెట్టారు. కేంద్ర దర్యాప్తుసంస్థల కారణంగా విపక్ష పార్టీలన్నీ ఏకత్రాటిపైకి వచ్చాయని, ఆ సంస్థలకు విపక్షాలు ధన్యవాదాలు తెలపాలని ఆయన వ్యాఖ్యానించడం తెలిసిందే.
ఆప్ టార్గెట్ ఎందుకైంది?: కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకు మేకుగా మారింది. ఢిల్లీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆప్ పంజాబ్‌లో అధికారంలోకి రావడం, గుజరాత్లో 6 శాతం ఓట్లు సాధించడం, ఉత్తర భారతంలో విస్తరిస్తూ తన ఓటు బ్యాంకు పెంచుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోవడమనేది అసలు కారణం. సిసోడియా అరెస్టు వెనుక ఉన్నది రాజకీయ కక్ష సాధింపు మాత్రమే. ఆప్ అధినేత అరవింద్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు, ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సిసోడియా అరెస్టును ఒక పావులా వాడుకుంటున్నది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న సత్యేంద్రజైన్ ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి వన్నె తెచ్చిన విద్య, ఆరోగ్యశాఖలకు చెందిన ఇద్దరు మంత్రులను జైల్లో పెట్టి కేంద్రం వికృతానందం పొందుతున్నది. ఆప్‌ను టార్గెట్ చేయడానికి కేంద్రం చేయని పనంటూ లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి ముందే ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలకూ బీజేపీ ఎర వేయడానికి ప్రయత్నించి భంగపడ్డది. చివరికి పేదలకు పంచే నిత్యావసర సరకుల పంపిణీని సైతం తన తాబేదారు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా అడ్డుకున్నది. ఈ కక్ష సాధింపుల వెనుక ఉన్నది ఒకే కారణం. జాతీయపార్టీ కాంగ్రెస్ మరింత బలహీనపడిందన్నది వాస్తవం. ఈ క్రమంలో ఉత్తరాదిన ఆప్ ఎదుగుదలను ఆపడమే వ్యూహంగా పెట్టుకున్నది.
భవిష్యత్‌లో తమకు పోటీ అవుతుందేమోనన్న భయంతో ఆప్‌ను, ఢిల్లీ ప్రభుత్వా న్ని రకరకాలుగా వేధించడం మొదలుపెట్టింది. అయితే గోడకు బంతిని ఎంత బలంగా విసిరికొడితే అంతే బలంగా తిరిగివస్తుందని రుజువు చేస్తూ ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఆప్ విజయ దుందుభి మోగించింది.
కేసులు..సాకేనా?: బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపర్చేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుంటున్నది. ఇప్పటివరకు సీబీఐ, ఈడీ, ఐటీలు నమోదుచేసిన కేసులు ఆ కోవకు చెందినవే. పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత సువేందు అధికారిని శారద మల్టీ లెవల్ మార్కెట్ కుంభకోణంలో విచారణ పేరిట వేధించింది. వీటినుంచి తనకు విముక్తి లభించాలంటే బీజేపీలో చేరడమే మేలనే విధంగా చేశారు. 2014 నుంచి వేధింపులను ఎదుర్కొన్న ఆయన 2020లో బీజేపీలో చేరగానే ఆ కేసు ఊసే లేదిప్పుడు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నారాయణ్ రాణెపై మనీ లాండరింగ్ కేసులో ఈడీ తీవ్ర వేధింపులకు గురిచేసింది. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వదిలేసి బీజేపీకి మద్దతు పలికారు. అంతే, ఈడీ దర్యాప్తు ఆగింది. అసోం సీఎం హిమంత బిశ్వది అదే కథ. కాంగ్రెస్ పార్టీకి చెందిన బిశ్వ కూడా శారద కుంభకోణంలో నిందితుడు.
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన కొద్ది కాలానికే 2014లో బిశ్వ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. బీజేపీ నుంచి తాను ఎలాంటి వేధింపులను ఎదుర్కొవాల్సి ఉంటుందో ముందే గ్రహించిన బిశ్వ తెలివిగా 2015లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయనపై ఉన్న కేసులు అటకెక్కాయి. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింథియాపై భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. ఆయన కూడా 2020 మార్చిలో బీజేపీ తీర్థం పుచ్చుకోగానే ఆ కేసులు మూసివేయబడ్డాయి. మహారాష్ట్రలో శివసేన ఎంపీ భావన గావ్లేకు ఈడీ ఐదు సమన్లు జారీ చేసింది. ఆయన షిండే వర్గంలో చేరగానే ఆ కేసుల జాడే లేదు. అలాగే యశ్వంత్ జాదవ్, యామిని జాదవ్ ఎమ్మెల్యే దంపతులపై గతంలో ఫెమా చట్టం ఉల్లంఘన కింద నమోదైన కేసులు, వారు షిండే వర్గంలో చేరగానే వాటి ఊసే లేకుండాపోయింది. ఏపీ టీడీపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లపై నమోదైన కేసులు కూడా వారు బీజేపీలో చేరాక మాయమయ్యాయి.
మోదీ స్నేహితుడు అదానీ దిక్కు యావత్ దేశం వేలెత్తి చూపుతున్నది. అయితే ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిసోడియాను అరెస్టు చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-వెల్జాల చంద్రశేఖర్
98499 98092