భూమిని, ప్రకృతిని నమ్ముకొని ఆదివాసీ- గిరిజనులు జీవిస్తుంటారు. ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతి సంరక్షకులుగా కొండలు, కోనలనే నిలయాలుగా చేసుకొని బతుకుతుంటారు. మరికొందరు స్థిరంగా ఒకచోట నివసించకుండా దేశవ్యాప్తంగా సంచరిస్తూ మన దేశ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. దేశ రక్షణలో భాగస్వాములై తనువులు చాలించిన ఎందరో గిరిజన వీరులు చరిత్రపుటల్లో స్థానం దక్కక పునాది రాళ్లుగా మిగిలిపోయారు.
మన దేశంలో చరిత్రకెక్కిన కొంతమంది ప్రజాస్వామ్యవాదుల కంటే ముందే జన్మించిన గిరిజన వీరులు, యోధులు, వారి ఆరాధ్య దైవాల చరిత్ర కండ్లముందే వేల సంవత్సరాలుగా కదలాడుతున్నది. అక్షరీకరణ కాకపోవడంతో అవి సమాజానికి చేరలేదు. సమ్మక్క- సారక్క, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సద్గురు శ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్, లక్కీ షా బంజారా, బిర్సాముండా, కొమ్రం భీం, తల్కం చందు (కేరళ) మొదలైన గిరిజన నాయకుల చరిత్రలతో పాటు భారతీయ ఇతిహాసాల్లో కనిపించే గిరిజనుల పాత్రలు అమోఘమైనవి. చెంచులు, కోయలు, గోండులు, ఎరుకలతో పాటు మహాభారతంలో గిరిజన యోధుడు ఏకలవ్యునిపై పరిశోధనలు జరగాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది.
ఆధునిక యుగంలోనూ ఆదిమ గిరిజనులు మాట్లాడే భాషకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లిపిని తీసుకురాలేకపోయాయి. అత్యధికులు మాట్లాడే గిరిజన భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చకపోవడంతో తరతరాలుగా వారి చరిత్ర, ఇతిహాసాలు వారికే పరిమితం అయిపోయాయి. దక్షిణ భారతదేశంలో కుంభమేళాను తలపించే సమ్మక్క- సారలమ్మ జాతర మౌఖిక సాహిత్యం, ప్రజల విశ్వాసం ఆధారంగానే జరుగుతున్నది. ఇప్పటి వరకు ఆ జాతర చారిత్రక వాంగ్మూలాలను వెతికే ప్రయత్నం జరగకపోవడం విచారకరం.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లను తీసుకువచ్చారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో వాటిని రాజ్యాంగంలో చేర్చలేదు. విదేశీయులైనన్పటికీ మోర్లే మింటో-మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ అణచివేతకు గురైన వర్గాల వారిని గుర్తించారు. వారి సమగ్రాభివృద్ధికి రిజర్వేషన్లను అమలు చేశారు.
అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లోనూ రిజర్వేషన్ విధానం ఉన్నది. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగ నిపుణులు పై వర్గాల వారిని ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు.
12వ శతాబ్దం నుంచి దాగి ఉన్న గిరిజనుల ఇతిహాసం, కనుమరుగవుతున్న వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, కళారూపాలను కాపాడాలి. వారు మాట్లాడే భాషకు లిపి కనుక్కోవడం, వారి జీవన విధానంలో మార్పులు తదితర అనేక అంశాలను పరిశీలించి పరిశోధనాత్మక పత్రాలను రూపొందించాలి. గిరిజన విశ్వవిద్యాలయాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో పరిశోధనలు చేయడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది.
గిరిజనుల జీవితాల్లో మార్పు రావాలంటే గిరిజనులు ఉన్నత విద్యనభ్యసించాలని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించింది. ఫలితంగా 2007లో మధ్యప్రదేశ్‌లోని అమరకంటక్‌లో ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వ విద్యాలయం ప్రారంభమైంది. 2008 జూలై నుంచి అది అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 2019లోనే ఏపీలో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించింది. విజయనగరం జిల్లా కొండకరకంలో ఉన్న ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం తరగతులు జరుగుతున్నాయి. ఎన్నో ప్రయత్నాల ఫలితంగా విభజన హామీ ప్రకారం.. తెలంగాణకు రావాల్సిన సమ్మక్క- సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2023 అక్టోబర్‌లో మంజూరైనది. ములుగు జిల్లాలో నెలకొల్పనున్న ఈ విశ్వ విద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.
ఒక ప్రత్యేక ఆశయంతో విద్యా సంస్థలు స్థాపించినప్పుడు సాధారణంగా ఆయా సామాజిక వర్గాల వారికి 70 శాతానికి పైగా అడ్మిషన్లు దక్కుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకలవ్య పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన గురుకుల పాఠశాలల్లో ఆయా వర్గాల వారికి 70 శాతానికిపైగా రిజర్వేషన్ అమలవుతున్నది. కానీ, దురదృష్టకర విషయం ఏమంటే గిరిజనుల పేరుతో స్థాపించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలను యూజీసీ నిబంధనల ప్రకారం ప్రారంభించడం. దీనివల్ల గిరిజన విద్యార్థులకు 7.5 శాతం సీట్లే దక్కనున్నాయి. ఈ విశ్వవిద్యాలయాలను కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించాలి. అప్పుడే అనుకున్న ఆశయం నెరవేరుతుంది.
తెలిసో, తెలియకో జరిగిన ఈ పొరపాటు వల్ల గిరిజన బిడ్డలు అన్యాయానికి గురవుతున్నారు. ఈ పొరపాటును కేంద్ర ప్రభుత్వం వెంటనే సరిదిద్ది గిరిజన విద్యార్థులకు 70 శాతం అడ్మిషన్లు కల్పించాలి. మిగిలిన సీట్లను ఇతరులతో భర్తీ చేసి అడవి బిడ్డలకు న్యాయం చేయాలి.
వ్యాసకర్త: మాజీ పార్లమెంట్ సభ్యులు
-అజ్మీర సీతారాం నాయక్