ఆంధ్రజ్యోతి సంపాదకుడు రాధాకృష్ణ కొన్ని వారాలుగా కొత్త పలుకులో తెలంగాణ ప్రభుత్వంపై తన సహజ ఆక్రోశాన్ని, తెలంగాణ సాధకుడు కేసీఆర్‌పై తన విద్వేషాగ్నిని మోతాదు మించి ఎగజిమ్ముతుండు. తన ఊహాతీత కాశీమజిలీ కథలతో లేనిపోని కథనాల్ని వండి వారుస్తూ కేసీఆర్ సర్కారును కించపరుస్తున్నడు. తెలంగాణ ప్రజల ప్రియతమ నాయకుడైన కేసీఆర్ వ్యక్తిత్వ హననం చేసే పలుకులు పలుకుతుండు. ఆయన ఇటీవల రాసిన ఒక కొత్త పలుకు అలాంటి విద్వేష విషాగ్నికి పరాకాష్ఠ. అయితే దేశ రాజకీయాల్లో అసలైన ఊసరవెల్లి చంద్రబాబు అన్న సంగతి నీకు తెలియదా ఆర్కే? ఇకనైనా చెత్త పలుకులు ఆపి పత్రికా ప్రమాణాలకు తగిన విధంగా రాతలు రాయడం నేర్చుకో!
Andhajyothy | ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలోనే ఊసరవెల్లి సిగ్గుపడేలా…అని శీర్షిక పెట్టి కేసీఆర్‌ను అతి క్రూరంగా కించపరచడానికి సాహసించిండు ఆర్కే. కేసీఆర్ రాజకీయ జీవితంలో ఎంతోమందిని వాడుకుని వదిలేసిండనీ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఈ వంచనకు బలి అయిండనీ అందుకే శరద్ పవార్ కేసీఆర్‌ను ఒక అధమశ్రేణి నాయకుడిగా తన సహచరులతో అన్నాడని అక్కడనే పొంచి విన్నట్టుగా ఆర్కే అబద్ధాలు వండి వార్చాడు. ఇంకా ఎన్నో కట్టు కథలు, కల్లబొల్లి కబుర్లు తన పలుకుల్లో ఒలకబోసిండు.
ఇంతకూ అసలు ఊసరవెల్లి ఎవరు ఆర్కే? రాజకీయ జన్మనిచ్చి, మంత్రిని చేసిన కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన చంద్రబాబు కాదా?! పోనీ చెడిన అల్లుడిని ఆదరించిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన మీ బాబు తొండా? లేక ఊసరవెల్లినా? టీడీపీ ప్రారంభం నుండి ఉన్న ఉపేంద్రను, కష్ట సమయంలో సాహసించి పార్టీలో చేరిన రేణుకా చౌదరిని సాగనంపిందెవరు? జయప్రద లాంటి వాళ్లను పార్టీ అవసరాల కోసం వాడుకొని వదిలేసింది ఎవరు?
కమ్యూనిస్టులను, బీజేపీని ఎన్నోసార్లు వాడుకుని వదిలేసింది ఎవరు? మీ కోసం సిద్ధాంతాలను మరచి మీతో జత కట్టిన కమ్యూనిస్టులను కరెంట్ ఉద్యమం సందర్భంగా బషీర్‌బాగ్ కాల్పుల్లో చంపింది మీ అభిమాన టీడీపీ ప్రభుత్వం కాదా? పైకి కంటి తుడుపు కోసం వైఎస్ఆర్, చంద్రబాబు పాలనల్లో భాగం పంచుకుని కమ్యూనిస్టులు తమ పతనం తామే కొని తెచ్చుకున్నరని ఏదో నిష్పక్షపాతంగా రాసినావనుకోవాలని ఆ ముక్క రాస్తే అయిపోతదా? అసలు కమ్యూనిస్టుల పతనం 1995లోనే ప్రారంభమైందన్న విషయం నీకు తెలుసా ఆర్కే?
ఎన్టీఆర్‌ను గద్దె దింపటం కోసం రామోజీ ఆశీస్సులతో బాబు తిరుగుబాటు ప్రారంభించగానే గవర్నర్‌ను చంద్రబాబు కలవకముందే ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు కలిసి తాము చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నమని తెలిపిననాడే కమ్యూనిస్టుల పతనం ప్రారంభమైంది. అప్పుడే కమ్యూనిస్టులు తోకలుగా రూపాంతరం చెందడం మొదలైంది. ఇప్పుడు కమ్యూనిస్టులు సిద్ధాంతపరమైన కమ్యూనిస్టులా లేక అవకాశవాద కమ్యూనిస్టులా అనేది నీకు తెలియదా రాధాకృష్ణా? మునుగోడులో బీజేపీని ఓడించడానికి బీఆర్ఎస్తో కమ్యూనిస్టులు జత కలవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో భాగస్వాములయ్యారు. బీఆర్ఎస్ ఎన్డీయేకు, ఇండియా కూటమికి సమాన దూరం. అందుకే ఈసారి ఎన్నికల్లో కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదు. అది కుంటిసాకు ఎట్లయితది? బీజేపీతో బీఆర్ఎస్-కేసీఆర్‌ది సిద్ధాంత పోరాటం. అది కత్తి, డాలు పట్టుకొని ఢిల్లీకి పోయి కొట్లాడేది కాదు. మీ బాబు ధర్మ పోరాటం అంటూ ఢిల్లీలో మోదీని దింపుతనని ప్రభుత్వ డబ్బుతో మీటింగులు పెట్టి దేశమంతా తిరిగి ప్రగల్భాలు పలికారు. కానీ ఎన్నికల్లో ఓడంగనే భయపడి కుక్కిన పేనులా ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకూడదా? మరెందుకు మోదీ అంటే మీ బాబుకు అంత వణుకు? మళ్లీ మోదీతోనే పొత్తుకు ఎందుకు వెంపర్లాడుతుండు మీ బాబు? ఇవేమీ నీకు కనిపించవా ఆర్కే?
అప్పట్లో గవర్నర్ నరసింహన్‌ను మీ చంద్రబాబు, ఆయన టీమ్ తిట్టినట్లు ఎవరూ తిట్టలే. మీ అచ్చం నాయుడు గవర్నర్‌ను ‘గంగి రెద్దు’ అన్నడు.. ఆ తరువాత ఆయనను ప్రసన్నం చేసుకొని అవతల పార్టీకి చెందిన నలుగురితో మంత్రులుగా ప్రమాణాలు చేయించలేదా? ప్రభుత్వాలకైనా, వ్యవస్థలకైనా సిద్ధాంతపర లేదా ఆచరణాత్మక సమస్యలు వస్తాయి కానీ వ్యక్తిగత సమస్యలు రావు. తెలంగాణ గవర్నర్ తన పరిధులు దాటి మంత్రివర్గ తీర్మానాలను తిరస్కరించడంతో కేసీఆర్ విభేదించారు. అది వేరు.. సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభోత్సవాలు వేరు. రాజ్యాంగపరంగా ప్రభుత్వాధినేత అయిన గవర్నర్‌ను ప్రార్థనాలయాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం నీకెందుకు తప్పనిపించిందో నాకు తెల్వదు ఆర్కే! మండవ, తుమ్మల ఒకప్పటి కేసీఆర్ సహచరులు. తుమ్మల 2014 ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నప్పుడు కేసీఆర్ పిలిచి మంత్రిని చేసిండు. మరి ఓడినప్పుడు మళ్లీ అవకాశం వచ్చేదాకా ఉండాలి కదా! పట్నంకు అవకాశం రాలేదా? కులోన్మాదమే ఆంధ్రాలో 2019 ఎన్నికల్లో మీ అభిమాన పార్టీని ఒంటరిని చేసింది. మీరు మారకపోతే, అందరినీ కలుపుకొని వెళ్లకపోతే మీరు అధికారంలోకి రావడం కల్ల!
ప్రతి పార్టీకి ఒక వ్యూహం ఉంటది. కేసీఆర్‌కు ఉండే వ్యూహం కేసీఆర్‌కు ఉంటది. తెలంగాణ సాధకుడిగా ఆయనపై ప్రజలకు అమిత గౌరవాభిమానాలు ఉన్నయి. మీకు, కులోన్మాదం కలిగిన కొందరు వలసాంధ్ర నాయకులకు, మీ పత్రికలకు తెలంగాణ సాధించడం జీర్ణం కావటం లేదు. ఏదో విధంగా ఈ రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇప్పటికీ యత్నిస్తూనే ఉన్నరు. అందులో భాగమే నీ విషపు రాతలు. తాజా కొత్తపలుకుతో హీనాతిహీన స్థితికి చేరినవు రాధాకృష్ణా!
శరద్ పవార్ సొక్కమయినోడా? 1977లో పార్టీలు ఫిరాయించిన వారి సాయంతో సీఎం అయిండు.. శరద్ పవార్ కేసీఆర్ కంటే గొప్పోడేం కాదు. మీ చంద్రబాబు అంత అవకాశవాద పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నరా? మీ బాబు లెక్క ఇక్కడ ఎవరూ బావ మరుదులను, తోడల్లుడిని మోసం చేయలే. ఎందుకు చెప్పు.. అవన్నీ.. రాయాలంటే శానా ఉన్నయి. నీ రాతల్లో కనీసం పత్రికా ప్రమాణాలు ఉండేటట్టు చూసుకో. అధమ స్థాయికి దిగజారకు ఆర్కే. ఒకటి తెలుసుకో.. తొండ ముదిరితే ఊసరవెల్లి అయితది… ఊసరవెల్లి ముదిరితే చంద్రబాబు అయితడు!
వెంకటయ్య బొబ్బిశెట్టి