నగరం నగ్న దేహం మీద
రోమాలు నిక్కబొడిచినట్లు
ఆస్తులు, అంతస్థులతో పోటీ పడ్డట్లు
కన్నీటితో చెమ్మగిల్లిన ఆకాశం
సిమెంట్, ఇటుకల కొమ్మల కొసలు
బాయిమెట్లు గుచ్చుకుపోయినట్లు
మధ్యతరగతి ఆశలను
మధ్యలోనే తెంపేసి
కోట్లకు పడగెత్తిన ఆరో భూతం
పంచభూతాలు సైతం
ఈ భూతం శాసించినట్లు
కుమ్మరి పురుగులా
భూమిని తొలుస్తూ
ఈస్ట్ ఫేసింగ్ పేర
సూర్యుని సైతం వాడుకుంటూ
వెంటిలేషన్ గాలిని కూడా
కలుషితం చేసే స్క్వేర్ ఫీట్ల
పేర జీవితాన్ని
ఇరుకిరుకు చేసి.. ఈఎంఐల
పేర బతుకును వాయిదాల
నంజుకుంటున్న బకాసురులు
కోట్ల కోరలతో లక్షల మందిని
కాటేస్తున్న కాలసర్పం వాడు
-మాధవి శ్రీనివాస్ నందిమళ్ల