COP29 | అజర్‌బైజాన్‌లోని బాకులో 196 దేశాలతో కూడిన కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (కాప్) 29వ సదస్సు ఇటీవల ప్రారంభమైన విషయం విదితమే. నవంబర్ 11న మొదలైన ఈ సదస్సు నవంబర్ 22 వరకు కొనసాగనున్నది. వాతావరణ మార్పులకు సంబంధించి పెట్టుబడుల సమీకరణే ప్రధానాంశంగా కొనసాగుతున్న ఈ సదస్సును ‘ైక్లెమేట్ ఫైనాన్స్ కాప్’ అని కూడా పిలుస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఆన్ ైక్లెమేట్ ఫైనాన్స్ (ఎన్సీక్యూజీ)కు భవిష్యత్తులో అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకోవడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. అయితే, సంపన్న దేశాల వాటా పెంచాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నిధులు సమకూర్చేదెవరు? ఆ నిధులను ఎలా పంపిణీ చేయాలి? అన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.
భూతాప సమస్యను పరిష్కరించేందుకు గానూ కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ అనుకూల ఇంధనం వైపు మళ్లడం కోసం అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు సంపన్న దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ఇచ్చేలా 2009లో ఒప్పందం జరిగింది. అయితే, ఆ మొత్తం ఏ మాత్రం సరిపోవడం లేదని, ఆర్థిక సాయాన్ని ఏటా 1 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఏటా 1-1.3 ట్రిలియన్ డాలర్లు లేదా 2030 నాటికి 5-6.9 ట్రిలియన్ డాలర్ల వరకు ఆర్థిక సాయం అందించాలని అరబ్ దేశాలతో పాటు ఆఫ్రికన్ గ్రూప్ దేశాలు సూచిస్తున్నాయి. కానీ, అభివృద్ధి చెందిన దేశాల వాదన మరోలా ఉన్నది. ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థికపరమైన ఇబ్బందులను అవి ఎత్తిచూపుతున్నాయి. చైనా సహా గల్ఫ్ దేశాలు కూడా ఆర్థిక సాయం చేసే దేశాల పరిధిలోకి రావాలని అభివృద్ధి చెందిన దేశాలు వాదిస్తున్నాయి. 22 వేల డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు కూడా నిధులు ఇవ్వాలని స్విట్జర్లాండ్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే రష్యా, సౌదీ అరేబియా, చైనా తదితర దేశాలు ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది.
అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డు సృష్టించింది. ఐరోపాకు చెందిన కోపర్నికస్ ైక్లెమేట్ చేంజ్ సర్వీస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. భూతాప సమస్యలే అందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ప్రకారం.. భూతాపం కారణంగా 2014-2023 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 2 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. 2021 గ్లోబల్ ైక్లెమేట్ రిస్క్ సూచీ ప్రకారం.. భూతాపం వల్ల ప్రభావితమయ్యే తొలి 10 దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2100 నాటికి భారత్ తన జీడీపీలో ఏటా 3-10 శాతం వరకు నష్టపోనున్నట్టు ఒక అంచనా. అంతేకాదు, వాతావరణ మార్పుల కారణంగా మన దేశంలో 2040 నాటికి పేదరికం పెరుగుదల రేటు 3.5 శాతం పెరిగే అవకాశం ఉన్నది. వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న విపత్కర పరిణామాలు కండ్లముందే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తెలంగాణలో జరిగిన విధ్వంసమే అందుకు తార్కాణం. రాష్ట్రంలోని 29 జిల్లాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్, వరదల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. 39 మంది మరణించారు. రూ.5,400 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. వ్యక్తిగత ఆస్తులకు జరిగిన నష్టం దానికి మూడింతలు ఉండొచ్చని ఒక అంచనా.
భూతాప సమస్యను ఎదుర్కొనే క్రమంలో జీ 20 సభ్య దేశాలు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్హౌస్ వాయువుల్లో సుమారు 80 శాతం ఈ దేశాల నుంచే వస్తున్నది. అ యితే, భూతాప సమస్యలను ఎదుర్కొనే క్రమంలో నిధుల సమీకరణ ఇబ్బందికరంగా మారుతున్నది. ఈ తరుణంలో వాతావరణ మార్పులను కొట్టిపారేసే డొనాల్డ్ ట్రంప్ తిరిగి
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం ఆందోళనకరం.
కాప్ 29 చర్చల సమయంలో ఒకే రకమైన ఆసక్తులున్న వివిధ దేశాలు ఒక గ్రూప్‌గా ఏర్పడి తమ వాణిని వినిపిస్తాయి. గ్రూప్ 77, చైనా, అభివృద్ధి చెందుతున్న దేశాలది ఒక సమూ హం. యురోపియన్ యూనియన్‌తో పాటు అభివృద్ధి చెందిన ఇతర దేశాలది ఒక జట్టు. అయితే, భూతాప సమస్యలను ఎదుర్కొనే విషయమై దేశాలతో పాటు పౌరులూ కీలకపాత్ర పోషించాలి. అప్పుడే భూతాప సమస్య పూర్తిగా సమసిపోతుంది.
(వ్యాసకర్త: వ్యవసాయ, వాతావరణ, సహకార నిపుణులు)
-చెన్నమనేని రమేశ్