సామాన్యులను 22-ఏ పేరుతో ఇబ్బందులు పెడితే సహించేది లేదని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, ఆయా సమస్యల్లో జాప్యం చేస్తే ఇకపై సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. 22-ఏ భూములపై సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అధికారులతో పలు కీలక అంశాలపై ఆయన చర్చించారు. అయితే అది నిజంగా అమలు చేస్తే సంతోషమే! కానీ మరి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసినట్టు లేదు.
సొంతిల్లు ఒక కుటుంబానికి కేవలం నాలుగు గోడలు కాదు. ఒక అందమైన కల. జీవితకాలం సంపాదనకు ప్రతి రూపం. పిల్లల భవిష్యత్తుకు భరోసా. అత్యవసర సమయంలో ఆదుకునే ఆర్థిక రక్షణ. అలాంటి ఆస్తి ఒక ఉదయం అకస్మాత్తుగా 22-ఏ నిషేధిత జాబితాలో కనిపిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? రిజిస్టర్డ్ సేల్‌డీడ్, నిర్మాణ అనుమతి, బ్యాంకు రుణం, ఆస్తిపన్ను, విద్యుత్తు, నీటి కనెక్షన్లు అన్నీ ఉన్నప్పటికీ విక్రయించలేరు, బదలాయించలేరు, తనఖా పెట్టలేరు. రాష్ట్రంలో వేలాది కుటుంబాలు ఇప్పుడు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి ఇదే.
ప్రభుత్వ భూములు, అసైన్డ్, భూదాన్, అర్బన్ ల్యాండ్ సీలింగ్, దేవాదాయ, వక్ఫ్, చెరువులు, కుంటలు, నాలాలు, అటవీ భూములను అక్రమ బదలాయింపుల నుంచి రక్షించేందుకు రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏ అవసరమైన రక్షణ. ప్రజా ఆస్తులను కబ్జాదారుల నుంచి కాపాడటాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో చట్టబద్ధమైన ప్రైవేట్ ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు కూడా విచారణ లేకుండా నిషేధిత జాబితాలో చేరితేఅది రక్షణ చట్టం కాకుండా పౌరుడిపై విధించిన పరిపాలనా శిక్షగా మారుతుంది.
హఫీజ్‌పేట్‌లో 20202021 మధ్య నిర్మాణాలు పూర్తయిన కొన్ని నివాస వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన కుటుంబాలు ఇప్పుడు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. బాధితుల సమాచారం ప్రకారం, సుమారు 700 కుటుంబాలు ఈ వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేశాయి. కొందరి రిజిస్ట్రేషన్లు పూర్తికావడంతో వారు కొత్త ఫ్లాట్లలో నివాసం ఉంటున్నారు. మిగిలినవారు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లినప్పుడు తమ ఫ్లాట్లు 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. దాదాపు 500 కుటుంబాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు బాధితులు చెప్తున్నారు. ఒకే వెంచర్లో కొందరి ఫ్లాట్లు రిజిస్టర్ కావడం, వారు నివాసం ప్రారంభించడంఅదే భూమిలో మిగిలిన ఫ్లాట్లను ఇప్పుడు 22-ఏ పేరుతో నిలిపివేయడం సహజంగానే అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. హఫీజ్‌పేట్ భూముల వివాదానికి సుదీర్ఘ న్యాయచరిత్ర ఉన్నది. నవాబ్ ఖుర్షీద్ ఝా పైగా ఆస్తుల విభజనకు సంబంధించిన కేసు తొలుత హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దాఖలై, తర్వాత హైకోర్టుకు బదిలీ అయి C.S.No.14 of 1958గా నమోదైంది. హఫీజ్‌పేట్‌లోని దాదాపు 1,210 ఎకరాల పట్టా భూములను ఆ కేసులో Schedule-IV, Item No.37గా పేర్కొన్నట్లు తర్వాతి హైకోర్టు తీర్పులు నమోదు చేశాయి. 1963లో preliminary decree వెలువడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం defendant No.53గా, అప్పటి Jagir Administrator defendant No.43గా ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారు. హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్లు 77, 78, 80 తదితర భూములపై ప్రభుత్వం వాదనలను హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో పలుమార్లు పరిశీలించారు. ఈ భూములపై ప్రభుత్వ claim కనీసం ఆరు సందర్భాల్లో విఫలమైందని తెలంగాణ హైకోర్టు తర్వాతి తీర్పుల్లో నమోదు చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 నవంబర్ 2004న Memo No.28908/JA1/2004-1 ద్వారా సర్వే నంబర్లు 77 నుంచి 80 వరకు mutation చేయాలని రంగారెడ్డి కలెక్టర్‌ను ఆదేశించింది. అనంతరం Memo No.59734/JA.1/2005, dated 18-05-2009 ద్వారా C.S.No.14/1958లో విజయం సాధించిన final decree holders పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించినట్లు కోర్టు రికార్డులు తెలియజేస్తున్నాయి.
హఫీజ్‌పేట్ సర్వే నంబరు 78ను 22-ఏ జాబితాలో కొనసాగించడంపై Savera Constru ctions Pvt. Ltd. దాఖలు చేసిన W.P.No. 21799 of 2019 కీలకమైనది. ఈ కేసులో I.A.No.1 of 2019పై తెలంగాణ హైకోర్టు 1 అక్టోబర్ 2019న రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ అధికారులను సర్వే నంబరు 78లోని భూములను prohibited list నుంచి తొలగించాలని ఆదేశించినట్లు తర్వాతి division Bench తీర్పులు స్పష్టంగా నమోదు చేశాయి. అంతకుముందే W.P.No.19069 of 2014లో 25 ఆగస్టు 2014న సర్వే నంబరు 78కు సం బంధించిన22-ఏ notificationను హైకోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ ఆ సర్వే నంబరు ఆన్లైన్ prohibited registerలో కొనసాగడం వివాదానికి దారితీసింది.
హఫీజ్‌పేట్‌లో సర్వే నంబరు 78కు సంబంధించిన W.P.Nos.14881 and 14885 of 2020లో తెలంగాణ హైకోర్టు division bench 27 నవంబర్ 2020న అత్యంత స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ claim ఆరు సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాల వరకు తిరస్కరణకు గురైన తర్వాత కూడా భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొనడం vexatious and impermissible అని కోర్టు వ్యాఖ్యానించింది. ఏ చట్టబద్ధమైన ఆధారం లేకుండా ప్రభుత్వ శాఖలు తమకు నచ్చిన భూములను చేర్చుకునే private prohibitory register నిర్వహించలేవని పేర్కొన్నది.
సర్వే నంబరు 78లో ఇప్పటికే ప్రజయ్ ఇంజినీర్స్, మహేంద్ర కన్స్ట్రక్షన్స్, ఆదిత్య కన్స్ట్రక్షన్స్, జి.కె. కన్స్ట్రక్షన్స్ తదితర సంస్థలకు భారీ నిర్మాణాల అనుమతులు ఇచ్చిఅదే సర్వే నంబరులో మరికొందరికి అనుమతులు నిరాకరించడం వివక్షగా కోర్టు గుర్తించింది. పిటిషనర్లకు నిర్మాణ అనుమతులు ఇవ్వడంతో పాటు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఖర్చులు చెల్లించాలని కూడా ఆదేశించింది.
M/s Kraft Alloy Pvt. Ltd. v. State of Telangana, 4 ఫిబ్రవరి 2021 తీర్పులో సర్వే నంబరు 78లోని 8.07 ఎకరాలకు సంబంధించిన sale certificateను నమోదు చేయకుండా నిలిపివేసిన చర్యను హైకోర్టు పరిశీలించింది. C.S.No.14/1958లో ప్రభుత్వ వాదనలు తిరస్కరణకు గురికావడం, 2014లో 22-A notification రద్దవడం, W.P.No. 217 99/ 2019లో deletion order రావడం, 2020 division Bench తీర్పు ఇవన్నీ ఉన్నప్పటికీ అదే భూమిని prohibited listలో కొనసాగించడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. W.P.No.21799/2019కు సంబంధించిన ఆదేశాల అమలుపై C.C.No.625 of 2020 కూడా నమోదైంది. 21 ఫిబ్రవరి 2025న కూడా W.P.No.21799/2019, contempt proc eedingsకు సంబంధించిన విచారణ కొనసాగినట్లు అందుబాటులో ఉన్న procee ding sheet చూపుతున్నది. అంటే 2019లో ఆదేశం వచ్చిన తర్వాత కూడా అమలుపై వివాదం పూర్తిగా ముగియలేదనే స్పష్టమవుతున్నది.
కోర్టు ఉత్తర్వు చేతిలో ఉన్నా, ఆన్లైన్ prohibited registerలో entry తొలగించకపోతే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలను కొనసాగించరు. రెవెన్యూ శాఖ తొలగించినా రిజిస్ట్రేషన్ శాఖ databaseలో మార్పు జరుగకపోతే ప్రయోజనం ఉండదు. ఒక శాఖ మరో శాఖను చూపిస్తూ కాలం గడిపితేఆర్థికంగా నష్టపోయేది పౌరుడే.
22-ఏ సమస్య కేవలం హఫీజ్పేట్కే పరిమితం కాలేదు. కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి పరిసరాల్లో పాత సర్వే రికార్డులు, సీలింగ్, ప్రభుత్వ భూమి, పోరంబోకు, వక్ఫ్, పైగా ఆస్తుల వివాదాల పేరుతో అనేక ఆస్తులు లావాదేవీలకు నోచుకోవడం లేదు. తాజాగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన నివాస ప్రాంతాలకూ 22-ఏ సెగ తగిలింది. సర్వే నంబర్లు 403/1, 120, 102/1లోని అనేక ఆస్తులను ceiling landగా చూపుతున్నట్లు బాధితులు చెప్తున్నారు.
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి ప్రభుత్వం సుమారు 1,398 ఎకరాలు కేటాయించగా, దాదాపు 1,100 ఎకరాల్లో 3,035 ప్లాట్లు ఉన్నట్లు సమాచారం. సొసైటీలో సుమారు 5,000 మంది సభ్యులు ఉండగా, దాదాపు 300 ప్లాట్లు 22-ఏ సమస్యను ఎదుర్కొంటున్నట్లు సొసైటీ వర్గాలు వెల్లడించాయి.
బంజారాహిల్స్ రోడ్ నంబరు 4లోని స్టోన్‌వ్యాలీ అపార్ట్మెంట్స్ H.No. 8-2-416ను కూడా prohibited list నుంచి తొలగించాలని హైదరాబాద్ కలెక్టర్‌కు వినతి వెళ్లినట్లు వార్తలు తెలిపాయి. ఇరవై ఏండ్ల క్రితం నిర్మించిన ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ విక్రయానికి వెళ్లినప్పుడు అది ceiling landగా నమోదై ఉందని తెలిసిందంటే పరిపాలనా వ్యవస్థలోని లోపం ఎంత తీవ్రమో అర్థమవుతున్నది. గోదావరి, రాధిక, యమునానగర్, ఎమ్మెల్యే కాలనీలోని కొన్ని ఆస్తులు కూడా సమస్యను ఎదుర్కొంటున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ pro hibited-properties portalలో ప్రస్తుతం Prohibition data is under review; it will be published soon అనే సమాచారం కనిపిస్తున్నది. హైదరాబాద్ జిల్లా సవరించిన పూర్తి జాబితా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పత్రాన్ని రిజిస్ట్రేషన్‌కు సమర్పించిన
తర్వాతే తమ ఆస్తి నిషేధిత జాబితాలో ఉన్నదని తెలుసుకుంటున్నారు. ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటే, దానికి సంబంధించిన పూర్తి కారణాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఏ clause కింద? ఏ చట్టం ప్రకారం? ఏ survey extent? ఏ ownership record? ఏ notification? ఏ తేదీ నుంచి? అన్నీ public domainలో ఉండాలి.
ప్రభుత్వం పాత పొరపాట్లను కొత్త డిజిటల్ జాబితాలో మళ్లీ నమోదు చేస్తే సమస్య మరింత జఠిలమవుతుంది. ప్రభుత్వం వెంటనే హైదరాబాద్ జిల్లా పూర్తి draft listను ప్రజల ముందుంచాలి; ప్రతి entryకి clause, extent, supporting record జతచేయాలి; హఫీజ్‌పేట్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాలకు ప్రత్యేక verification cell ఏర్పాటు చేయాలి; W.P.No.21799/2019 సహా తుది కోర్టు ఆదేశాలున్న ఆస్తులను suo motuగా పరిశీలించాలి; ఒక సర్వే నంబరులోని వివాదాస్పద భాగాన్ని మాత్రమే block చేయాలి; ఇప్పటికే రిజిస్టర్ అయిన, నిర్మాణ అనుమతి పొందిన, నివాసంలో ఉన్న ప్రాజెక్టులకు fast-track hearing ఇవ్వాలి; deletion applicationsను ఆరు వారాల్లో పరిష్కరించాలి; తిరస్కరణకు suppo rting documentsతో కూడిన speaking order ఇవ్వాలి; కోర్టు ఆదేశాల అమలుకు RevenueRegistrationMunicipal శాఖల సంయుక్త nodal officerను నియమించాలి.
22-ఏ ప్రభుత్వ భూములను కాపాడే కవచంగా ఉండాలి. ప్రజల సొంతిండ్లను బంధించే సంకెళ్లుగా మారకూడదు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా నిషేధిత entry కొనసాగితే అది కేవలం సాంకేతిక లోపం కాదున్యాయపాలనపై ప్రజల విశ్వాసానికి ఎదురుదెబ్బ. ప్రజా భూమిని రక్షించడం సర్కారు బాధ్యత. కానీ ప్రజల చట్టబద్ధమైన ఆస్తిని రక్షించడం కూడా అదే ప్రభుత్వ బాధ్యతే.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-పి. విజయబాబు