జాతరలో అగ్నిగుండాలను దాటి మన భక్తిని ప్రదర్శిస్తాం. అవి హాని చేయనంత పరిమిత దూరమే ఉంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి బోర్డు పరీక్షలు మాత్రం ఇటు పిల్లలు, అటు వారి తల్లిదండ్రులను దహించివేసే సుదీర్ఘమైన అగ్నిగుండాలుగా మారాయి. ప్రభుత్వం ఎటువంటి శాస్త్రీయ అవగాహన లేకుం డా 34 రోజులపాటు (మార్చి 14-ఏప్రిల్ 16) పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించి, పిల్లల మానసికస్థితిని దెబ్బతీస్తున్నది. పదో తరగతి విద్యార్థుల కోసం పరీక్షల షెడ్యూల్ ఎంతో కీలకమైన అంశం. కేవలం ఆరు పేపర్లు ఉండే ప్రతి పరీక్ష మధ్య సరైన గ్యాప్ ఉండటం అవసరం. అయితే, ఐదారు రోజులకు పైగా ఎక్కువ గ్యాప్‌లు ఇవ్వడం విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక్కో పరీక్షకు మధ్య కొంత గ్యాప్ రివిజన్‌కు సహాయపడుతుంది. కానీ ఎక్కువ విరామం ఇవ్వడం వల్ల చదివిన విషయాలు మరచిపోవడం విద్యార్థుల్లో సాధారణంగా జరుగుతుంది.
మెమొరీపరంగా చూసినా ఎక్కువ సమయం గ్యాప్ ఉండడం వల్ల చదివిన అంశాలపై పట్టుదల తగ్గిపోతుంది. దీనినే సైంటిఫిక్‌గా ‘Forgetting Curve Effect’ అని అంటారు. అంతేకాకుండా విద్యార్థులు తమ ఎగ్జామ్స్ మైండ్‌సెట్‌ను కోల్పోయి, వరుసగా పరీక్షలు రాయడంలో వచ్చే ఫోకస్, క్రమశిక్షణ తగ్గిపోతాయి. ఇందుకు ఉదాహరణగా..గత కొన్నేండ్లుగా 11 పేపర్లు వరుస రోజుల్లో పరీక్ష పెట్టినా విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. పరీక్షల మధ్య మరీ ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల నిరంతరం ఏకాగ్రతలో చదువు కొనసాగించడం కష్టసాధ్యం. అదనంగా స్ట్రెస్, ఎక్కువగా ఆలోచించడం వంటివి అందోళనను పెంచి మానసిక వత్తిడికి దారితీస్తాయి. ఫలితంగా వారి దైనందిన కార్యక్రమాలు, నిద్ర కూడా అసమతుల్యంగా మారి మొత్తం పనితీరుపై ప్రభావం చూపుతాయి. రానున్న విద్యాసంవత్సరం నుంచి అయినా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పిల్లలకు సరిపడే కాలపరిమితిలోనే పరీక్షలు జరిపితే మేలు జరుగుతుంది.
-శ్రీధర్ మారెబోయిన, 90108 52085