కేంద్రం ఇటీవల ప్రతిపాదించిన జాతీయ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ చట్ట సవరణ బిల్లు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది. ఈ గొప్ప దేశానికి చెందిన పౌరుడిగా, మన రాజ్యాంగ విలువలను, సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకోవడం చాలా కీలకమని నేను నమ్ముతున్నాను. అది మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం.
ప్రతిపాదిత బిల్లు ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్‌సీటీడీ)లో ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని నిర్వీర్యం చేసి, నగర ప్రభుత్వంలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు (తద్వారా కేంద్ర సర్కారుకు) సంపూర్ణ నియంత్రణను మంజూరు చేసేందుకు ఉద్దేశించింది. దీనిని అనుమతించినట్టయితే ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వబడిన ప్రజాస్వామ్య అధికారం బలహీనమైపోతుంది. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలకు ఇది సంపూర్ణంగా విరుద్ధం రాజ్యాంగంలోని ఒకటో అధికరణం భారతదేశం రాష్ర్టాల యూనియన్‌గా ఉం టుందని స్పష్టంగా పేర్కొన్నది. ఈ విస్పష్ట నిర్వచనం వివిధ రాష్ర్టాలు, భూభాగాలతో కూడిన మనదేశ ఐక్యతను సూచిస్తుంది. ఫెడరల్ స్ఫూర్తిని ప్రతిఫలిస్తున్నది.
యూనియన్, రాష్ర్టాల మధ్య అధికారం పంపిణీ చేయబడింది. రాష్ర్టాల్లో సమర్థవంతమైన పాలనను అందించడానికి ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు కొన్ని హక్కులు, బాధ్యతలు మంజూరు చేయబడ్డాయి. ఈ అధికరణం ద్వారా నిర్వచించిన రాష్ర్టానికి సమానమైన లక్షణాలతో ఢిల్లీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నది.
ఆర్టికల్ 239 ప్రాముఖ్యం: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్‌సీటీడీ)కి ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నది. ఇది యూనియన్ టెరిటరీ అయినప్పటికీ, ఎన్సీటీడీకి రాష్ట్రస్థాయితో సమానమైన హోదాను అది మంజూరు చేస్తున్నది. ఈ ప్రత్యేక నిబంధన ఢిల్లీలో ఎన్నుకోబడిన ప్రభుత్వానికి వివిధ పరిపాలనా విషయాలపై గణనీయమైన అధికారాలను కలిగి ఉండేలా చేస్తుంది.
2018లో, సుప్రీంకోర్టు ఢిల్లీ పాలనా వ్యవస్థ స్వభావాన్ని నొక్కిచెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతంలో సజాతీయ తరగతి లేదని గుర్తించింది. రాష్ట్ర హోదా ఇవ్వనప్పటికీ సమాఖ్యవాద సూత్రం ఢిల్లీకి వర్తిస్తుందని తెలిపింది. కాగా 2023 మే 1న ఇచ్చిన తీర్పులో ఎన్సీటీడీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వ అధికారమే అంతిమమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. సర్వోన్నత న్యాయస్థానం సమాఖ్య పాలనా సూత్రాన్ని మరోసారి సమర్థించింది. ఇక్కడ ఎన్నికైన ప్రతినిధులు అధికారాన్ని కలిగి ఉంటారు. పౌర సేవకులు ఓటర్లకు జవాబుదారీగా ఉంటారు. ఎల్జీ అధికారాలు ఢిల్లీ అసెంబ్లీ వ్యవహారాల్లో, ఎన్నికైన ప్రభుత్వ శాసనాధికారాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.
ప్రతిపాదిత సవరణ బిల్లు నగర పాలక సంస్థలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై ఎల్జీకి సంపూర్ణ నియంత్రణను కల్పించాలని కోరింది. ఈ చర్య రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం, దేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ఇది బలహీనపరుస్తుంది. నామినేటెడ్ ఎల్జీ వర్సెస్ ఎన్నికైన ప్రభుత్వం: ఎల్జీ అనేది ఎన్సీటీడీలో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే నామినేటెడ్ పోస్ట్. పరిపాలనా వ్యవహారాలపై ఎల్జీకి విస్తృతాధికారాలు ఇవ్వడం ఢిల్లీ ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటూ ఇచ్చిన ప్రజాస్వామ్య తీర్పునకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అధికారం కల్పించాలి. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పౌరుల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకునేలా చూడాల్సి ఉంది.
సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరచడం: ఎల్జీకి సంపూర్ణ నియంత్రణను మంజూరు చేయడం అంటే ఎన్నికైన ప్రభుత్వాధికారాన్ని రద్దుచేయడమే కాకుండా మనదేశ సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. రాజ్యాంగం యూనియన్, రాష్ర్టాల మధ్య సున్నితమైన అధికార సమతుల్యతను అందిస్తుంది, ఢిల్లీ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి ఈ సమతుల్యతలో అంతర్భాగం.
ప్రతిపాదిత బిల్లు సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేసేలా కనిపిస్తున్నది. దానిని బేఖాతరు చేస్తున్నది. ఎన్సీటీడీలో పరిపాలనాపరమైన అంశాలపై ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం ఉంటుందని కోర్టు ఇటీవలి తీర్పులో నొక్కిచెప్పింది. దానిని దెబ్బతీస్తూ కేంద్రం చేపట్టిన చర్య న్యాయవ్యవస్థ పట్ల వారికున్న గౌరవం గురించిన ప్రశ్నలను లేవనెత్తుతున్నది.
రాజ్యాంగ పవిత్రతను నిలబెట్టడంలో, న్యాయవ్యవస్థ, తనిఖీల సూత్రాన్ని గౌరవించడంలో ప్రభుత్వ నిబద్ధతపై ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. ఎల్జీకి విస్తృతమైన అధికారాలు కల్పించడమంటే ఢిల్లీ ప్రాంతపు ఎన్నికైన సర్కారు అధికారాలను లాగేసుకుని కేంద్రానికి కట్టబెట్టడమే అవుతుంది.
బిల్లు ఆమోదించడాన్ని అనుమతిస్తే, అది ప్రమాదకరమైన దృష్టాంతాన్ని నెలకొల్పవచ్చు. ఇతర రాష్ర్టాల వ్యవహారాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు తలుపులు తెరిచినట్టవుతుంది. ఇటువంటి విధానం రాష్ర్టాల సార్వభౌమాధికారాన్ని క్రమంగా క్షీణింపజేయడానికి దారితీస్తుంది. వారి ప్రత్యేక అవసరాలకు బాగా సరిపోయే నిర్ణయాలు తీసుకునే వారి సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా, బిల్లును పునఃపరిశీలించాలని, మన రాజ్యాంగ సారాంశాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మన దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడటానికి సమాఖ్య నిర్మాణాన్ని సమర్థించడం చాలా అవసరం. యూనియన్ రాష్ర్టాల మధ్య అధికార సమతుల్యతను కొనసాగించడం, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో అందరం ఐక్యంగా నిలబడాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిరక్షణకు చేయిచేయి కలపాల్సిన అవసరమున్నది. మన దేశ ప్రజాస్వామ్య నిర్మాణం, ప్రజల గొంతు ప్రధానమైనదిగా ఉండేలా చూసుకోవాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ)
బి.వినోద్‌కుమార్