న్యూయార్క్ : సముద్రంలో పోగొట్టుకున్న ఫోన్ ఏడాది తర్వాత పనిచేస్తుందని ఎవరూ ఊహించరు. అయితే హ్యాంప్‌షైర్‌కు చెందిన మహిళ 465 రోజుల కిందట సముద్రంలో తన ఐఫోన్ పోగొట్టుకుని ఇటీవల ఆ ఫోన్‌ను వర్కింగ్ కండిషన్లో రికవరీ చేసుకున్నారు. బీచ్ సమీపంలో ఈ ఫోన్ కొట్టుకురాగా అక్కడ వాకింగ్ చేస్తున్న ఓ వ్యక్తి కంటపడింది.
ఐఫోన్ 8 ప్లస్‌ను పోగొట్టుకున్న మహిళ అది దొరుకుతుందనే ఆశలు వదులుకున్న తర్వాత అనూహ్యంగా ఫోన్ వర్కింగ్ కండిషన్లో చేతిలోకి రావడం పట్ల ఆశ్చర్యానికి లోనయ్యారు. హ్యాంప్‌షైర్ ప్రాంతంలోని హవంత్ తీరంలో 39 ఏండ్ల క్లేర్ అట్ఫీల్డ్ అనే మహిళ గత ఏడాది ఆగస్ట్ 4న తన ఐఫోన్ 8ను పోగొట్టుకున్నారు. ఆపై ఫోన్ నీటిపాలవడంతో ఇక ఎన్నటికీ తనకి తిరిగిరాదని ఆమె భావించారు. అలల ఉధృతిలో ఫోన్‌ను వెతకడం కూడా వృధా ప్రయాసే అని ఆమె అనుఉన్నారు.
అయితే నవంబర్ 7న బీచ్‌లో వాకింగ్ చేస్తున్న వ్యక్తి ఫోన్‌ను గుర్తించి మహిళకు అందించారు. ఐఫోన్ 8 ప్లస్‌కు కేస్ ఉండటంతో ఫోన్‌కు ఎలాంటి స్క్రాచెస్ లేవు. ఫోన్ ఇప్పటికీ పర్ఫెక్ట్గా పనిచేస్తోందని క్లేర్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఫోన్‌ను ఎప్పుడు తన మెడకు వేలాడదీస్తానని, అయితే సముద్రంలో అది పొరపాటున జారి నీటిలో పడిపోయిందని ఆమె గుర్తుచేసుకున్నారు. తనతో పాటు ఫోన్‌ను గుర్తించిన వ్యక్తి పూర్తిగా షాక్‌లో ఉన్నామని క్లేర్ చెప్పుకొచ్చారు. క్లేర్ కొత్త ఫోన్ వాడుతున్నా తిరిగి తన పాత ఫోన్ తన చెంతకు చేరడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు.