నిన్న మొన్నటి వరకు ఆమె పేరు దేశంలో చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ఆ పేరు మహిళలతోపాటు అందరికీ స్ఫూర్తి. వయనాడ్ విపత్తు సమయంలో గంటల వ్యవధిలో వారధి నిర్మించిన జట్టుకు నేతృత్వం వహించారు మేజర్ సీతా షెల్కే. కేరళలో ప్రకృతి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలమంది క్షతగాత్రులయ్యారు.
కొండచరియల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ, నేవీ రంగంలోకి దిగాయి. చుట్టంతా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు ముందుకుసాగలేదు. ఈ పరిస్థితుల్లో అతి తక్కువ సమయంలో 190 అడుగుల వంతెన నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు సీత. 36 గంటల్లో వారధి కట్టి సహాయక చర్యలకు ఆటంకం లేకుండా మార్గం చూపారు. బెంగళూరులోని మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్‌లో మేజర్ సీతా షెల్కే ఏకైక మహిళా అధికారి.
ఈ గ్రూప్‌నే మద్రాస్ సాపర్స్ అని పిలుస్తారు. మహారాష్ట్రలోని గాడిల్గావ్లో ఆమె జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఐపీఎస్ కావాలన్న లక్ష్యం నెరవేరలేదు. అయినా నిరుత్సాహపడకుండా సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎస్ఎస్బీ పరీక్షలో రెండుసార్లు విఫలమైనా.. పట్టుదలతో మూడోసారి ప్రయత్నించి విజయం సాధించారు. శిక్షణ పూర్తిచేసుకొని 2012లో సైన్యంలో చేరారు. సైన్యంలో మగవారికి దీటుగా మహిళలు కూడా రాణించగలరని నిరూపించారు మేజర్ సీతా షెల్కే.